ఆ ముగ్గురు మంత్రులను కలిపిన కరోనా.. కానీ!
దిశ ప్రతినిధి, కరీంనగర్ : కరోనా మహమ్మారి కారణంగా భౌతిక దూరం పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైరస్ ఒకరి నుండి మరొకరికి సోకకుండా ఉండేందుకు సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయాలని వైద్యులు చెప్తున్నారు. కానీ, అదే కరోనా.. దూరంగా ఉన్న వారిని ఒక దగ్గరకు చేర్చింది. ఇంతకీ ఎవరా ముగ్గురు? ఎందుకు కలిశారంటే..? ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి నలుగురు రాష్ట్ర కేబినెట్‌లో చోటు సంపాదించారు. వీరు ఒకే చోట కలిసిన సందర్భాలు అత్యంత అరుదు. కానీ, […]
దిశ ప్రతినిధి, కరీంనగర్ : కరోనా మహమ్మారి కారణంగా భౌతిక దూరం పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైరస్ ఒకరి నుండి మరొకరికి సోకకుండా ఉండేందుకు సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయాలని వైద్యులు చెప్తున్నారు. కానీ, అదే కరోనా.. దూరంగా ఉన్న వారిని ఒక దగ్గరకు చేర్చింది. ఇంతకీ ఎవరా ముగ్గురు? ఎందుకు కలిశారంటే..?
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి నలుగురు రాష్ట్ర కేబినెట్‌లో చోటు సంపాదించారు. వీరు ఒకే చోట కలిసిన సందర్భాలు అత్యంత అరుదు. కానీ, ఒక్కరు మినహా మిగతా ముగ్గురు మంత్రులు శుక్రవారం ఒకే వేదిక మీద కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. కరీంనగర్ కలెక్టరేట్‌లో కరోనా నియంత్రణపై ప్రత్యేకంగా సమీక్షా సమావేశం జరిగింది. దీనికి మంత్రులు ఈటల, కొప్పుల, గంగుల హాజరయ్యారు. ఏడాది కిందట ఈ ముగ్గురూ రెండోసారి కేబినెట్‌లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ వీరు మాత్రం కలిసి ఒకే కార్యక్రమంలో పాల్గొనలేదు. గతేడాది ఓ సారి మంత్రి గంగుల, ఈటల కలిసి ఒకే వాహనంలో తిరిగారు. అప్పటి నుండి ఎవరి కార్యక్రమాల్లో వారు బిజీ బిజీగా గడుపుతున్నారు. కరీంనగర్ ఎమ్మెల్యేగా గెల్చిన గంగుల కమలాకర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పటికీ ఈటల మాత్రం తన నియోజకవర్గంతో పాటు పెద్దపల్లి జిల్లాలోనే ఎక్కువగా పర్యటించారు. కరీంనగర్‌కు మాత్రం అంతగా రాలేదు. ఒకవేళ వచ్చినా వ్యక్తిగత కార్యక్రమాల్లోనే పాల్గొన్నారు తప్ప అధికారిక కార్యక్రమాలకు మాత్రం అటెండ్ కాలేదు. ఇక ధర్మపురి నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న కొప్పుల ఈశ్వర్ కరీంనగర్‌లోనే నివాసం ఉంటున్నప్పటికీ ఎక్కువగా జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోనే పర్యటించారు. కానీ, ఈ ముగ్గురు మాత్రం ఒకే వేదిక మీద మంత్రి హోదాలో జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఎన్నడూ హాజరు కాలేదు. తాజాగా కరోనా సెకండ్ వేవ్ కట్టడి కోసం ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగంతో నిర్వహించిన సమీక్ష కారణంగా ఈ ముగ్గురు అమాత్యులు కలిసి పాల్గొ్న్నారు.
ఎడమొహం.. పెడ మొహం..
ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సివిల్ సప్లై మినిస్టర్ గంగుల కమలాకర్‌లు గత కొంతకాలంగా ఎడమొహం పెడ మొహంగానే ఉంటున్నారు. వీరిద్దరి మధ్య గ్యాప్ ఉందని టీఆర్ఎస్ వర్గాలు బాహాటంగానే చర్చించుకుంటున్నాయి. మంత్రులుగా బాధ్యతుల చేపట్టిన తరువాత వీరి మధ్య అభిప్రాయ బేధాలు ఏర్పడ్డాయన్న చర్చ కూడా సాగుతోంది. ఇవాళ కరీంనగర్ సివిల్ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంతో పాటు కలెక్టరేట్ రివ్యూ మీటింగ్‌లో కూడా వీరిద్దరు హాజరు కావడం చర్చకు దారి తీసింది. ఇదే సమావేశానికి మంత్రి కొప్పుల కూడా హాజరు కావడంతో జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఒకే చోట కలిసినట్టయింది. అయితే, కరోనా వైరస్ ఈ ముగ్గురిని ఒకే చోట కలిసేలా చేసిందని జిల్లా వ్యాప్తంగా చర్చ సాగుతోంది.
మిగిలింది ఆ ఒక్కరే..
ఉమ్మడి జిల్లాకు చెందిన మరో మంత్రి కేటీఆర్ కూడా ఇదే వేదికపై ఉన్నట్టయితే ఇక్కడి మంత్రులంతా కలిసి ఒకే కార్యక్రమంలో పాల్గొన్న అరుదైన దృశ్యం ఆవిష్కృతం అయ్యేదని టీఆర్ఎస్ వర్గాలు, జిల్లా ప్రజలు అనకుంటున్నారు.