మీరు ఎమ్మెల్సీ నామినేషన్ వేశారా.. అయితే మీకో బ్యాడ్ న్యూస్?
దిశ, తెలంగాణ బ్యూరో: అధికారపార్టీకి ధీటుగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు నామినేషన్లు వేశారు. ఎవరైతే వేశారో వారి వివరాలను సేకరించి ఉపసంహరణకు అధికార పార్టీకి చెందిన నేతలు ఒత్తిడి చేస్తున్నారు. సన్నిహితులతో ఆ అభ్యర్థులతో మంతనాలు ప్రారంభించారు. ఎంపీటీసీలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీలు ఇస్తూ విత్ డ్రా చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ససేమీర అంటుండటంతో మరోసారి ప్రయత్నిద్దామని వినకపోతే నయానో…భయానో ఇచ్చి దారికి తెచ్చేందుకు పావులు కదువుతున్నట్లు సమాచారం. తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో పన్నెండు స్థానిక సంస్థల స్థానాలకు […]
దిశ, తెలంగాణ బ్యూరో: అధికారపార్టీకి ధీటుగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు నామినేషన్లు వేశారు. ఎవరైతే వేశారో వారి వివరాలను సేకరించి ఉపసంహరణకు అధికార పార్టీకి చెందిన నేతలు ఒత్తిడి చేస్తున్నారు. సన్నిహితులతో ఆ అభ్యర్థులతో మంతనాలు ప్రారంభించారు. ఎంపీటీసీలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీలు ఇస్తూ విత్ డ్రా చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ససేమీర అంటుండటంతో మరోసారి ప్రయత్నిద్దామని వినకపోతే నయానో…భయానో ఇచ్చి దారికి తెచ్చేందుకు పావులు కదువుతున్నట్లు సమాచారం.
తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో పన్నెండు స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మంగళవారం నామినేషన్లకు తుదిగడువు కావడంతో ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు బరిలో నిలిచేందుకు నామినేషన్లు వేశారు. నామినేషన్లు వేసిన గంటల వ్యవధిలోనే కొన్ని జిల్లాల్లో పలువురు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో పాటు కౌన్సిలర్లతో మంత్రులు, ఎమ్మెల్యేలు మంతనాలు ప్రారంభించారు. పలు అంశాలపై చర్చిస్తున్నారు. అంతేకాదు అడిగింది కాదనకుంటా హామీలిస్తున్నట్లు సమాచారం. మంత్రుల నిధులు, ఎమ్మెల్యే నిధులతోపాటు ఎంపీ నిధులు కూడా కేటాయించి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు స్థానిక ప్రజాప్రతినిధులే చేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీలిచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే సమస్యలు పరిష్కారం అయ్యేవరకు విశ్రమించబోమని పలువురు ఎంపీటీసీలు, జెడ్పీసీటీలు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే చివరి వరకు పోటీలో ఉంటారా? ఉపసంహరించుకుంటారా? అనేది చర్చనీయాశంగా మారింది.
నామినేషన్లు వేసినా గంటల వ్యవధిలోనే నామినేషన్లు వేసిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలపై అధికారపార్టీ నేతలు ఒత్తిడి చేయడం ప్రారంభించారు. కరీంనగర్, నల్లగొండ జిల్లాతో పాటు పలు జిల్లాల్లో ఎంపీటీసీలతో సమావేశం నిర్వహించారు. నామినేషన్ వేసిన వారు నిర్వహించే బిజినెస్ లు, ఇతరాత్రా ఏమైన పనులు చేస్తున్నారా… వారు ఎవరెవరిని కలుస్తున్నారు అనే విషయాలను క్లుప్తంగా సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వినకుంటే వారు చేసే వ్యాపార లావాదేవీలను దెబ్బతీసేందుకు యత్నం చేసే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో బరిలో నిలిచేందుకు నామినేషన్లు వేసిన ఇండిపెండెంట్లు ఉపసంహరించుకోకపోతే అధికార పార్టీకి గడ్డుకాలమే అని చెప్పొచ్చు.
రంగారెడ్డి జిల్లాలో నామినేషన్ల చివరి రోజు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎంపీటీసీల సంఘం నుంచి బరిలో ఉంటామని చెప్పిన ఓ ఎంపీటీసీ అభ్యర్థి చివరికి నామినేషన్ వేయలేదు. సంఘం సమావేశంలో పోటీపై స్పష్టతనిచ్చినప్పటికీ ఆమెపై రాజకీయ ఒత్తిడి పెరగడంతోపాటు నామినేషన్ వేసేందుకు వచ్చిన ఆమె నామినేషన్ పత్రాలను సైతం టీఆర్ఎస్ నేతలు చించివేశారు. దీంతో వాగ్వివాదానికి దిగిన ఆమెను పోలీసులు సైతం పట్టించుకోలేదు. లోనికి వెళ్లి మరో నామినేషన్ పత్రం పూరించి అందజేస్తానని చెప్పినప్పటికీ ఎవరూ వినిపించుకోలేదు. దీంతో నిరాశతో వెనుదిరగాల్సివచ్చింది. మరికొన్ని జిల్లాల్లో నామినేషన్ వేసేందుకు రావొద్దని అధికార పార్టీకి చెందిన నేతలు హుకూం జారీ చేసినట్లు సమాచారం.