మాముళ్ల మత్తులో మేడ్చల్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు.. మరి జనాల పరిస్థితి..?
దిశ ప్రతినిధి, మేడ్చల్ : మీకు తల తిరిగి పోతుందా…? జ్వరం వస్తోందా..? కడుపు నొప్పి.. ఒళ్లు నొప్పులు భరించలేకుండా ఉన్నారా..? నిద్ర పట్టడం లేదా..? ఏం భయం లేదు. డాక్టర్లను కలవాల్సిన అవసరమే లేదు. విషయం చెబితే చాలు.. మెడికల్ షాపుల్లో అన్ని రకాల మందులు ఇచ్చేస్తారు. ఎన్ని కావాలన్నా దొరుకుతాయి. డాక్టర్ ప్రిస్ర్కిప్షన్ అవసరమే లేదు. ఏ మందులు వేసుకోవాలో.. రోజుకు ఎన్ని వేసుకోవాలో కూడా వారే చెప్పేస్తారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా […]
దిశ ప్రతినిధి, మేడ్చల్ : మీకు తల తిరిగి పోతుందా…? జ్వరం వస్తోందా..? కడుపు నొప్పి.. ఒళ్లు నొప్పులు భరించలేకుండా ఉన్నారా..? నిద్ర పట్టడం లేదా..? ఏం భయం లేదు. డాక్టర్లను కలవాల్సిన అవసరమే లేదు. విషయం చెబితే చాలు.. మెడికల్ షాపుల్లో అన్ని రకాల మందులు ఇచ్చేస్తారు. ఎన్ని కావాలన్నా దొరుకుతాయి. డాక్టర్ ప్రిస్ర్కిప్షన్ అవసరమే లేదు. ఏ మందులు వేసుకోవాలో.. రోజుకు ఎన్ని వేసుకోవాలో కూడా వారే చెప్పేస్తారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా చాలా మెడి కల్ దుకాణాలు ఇలాగే అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయి. జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. ఔషధ నియంత్రణ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. అప్పుడప్పుడు తనిఖీలు చేయడం, నామమాత్రంగా కేసులు నమోదు చేయడం..చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది.
డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకున్నా..
వైద్యులు ప్రిస్కిప్షన్ రాసిస్తేనే మెడికల్ షాపుల్లో ఔషధాలు ఇవ్వాలి. ఈ నిబంధనలను చాలా దుకాణదారులు పాటించడం లేదు. రోగి, బంధుమిత్రులు వచ్చి మందులు కావాలంటే ప్రిస్ర్కిప్షన్ లేకున్నా ఇచ్చేస్తున్నారు. కార్డియాలజీ, సైక్రియాట్రి, న్యూరాలజీ, బ్రెయిన్ స్ర్టోక్, డయాబెటిక్, బీపీ, యూరిన్ ఇన్‌ఫెక్షన్ తదితర మందులను డాక్టర్ ప్రిస్ర్కిప్షన్ లేకుండా ఇవ్వకూడదు. ఇందులో హైడోస్, లోడోస్ ఉంటాయి. రోగ తీవ్రత, రోగి వయసును బట్టి డాక్టర్లు డోసులను నిర్ణయిస్తారు. ప్రిస్ర్కిప్షన్ పై డాక్టర్ ఎన్ని మందులు రాశారో ఆ మేరకు ఇవ్వాలి. రోగి మరోసారి అడిగితే ఇవ్వకూడదు. కానీ ఆ నిబంధనలు అమలు కావడం లేదు.
ఎన్ని కావాలన్నా..
మెడికల్ షాప్‌కి వెళ్లి అడిగితే.. ఏ మందులు ఎన్ని కావాలన్నా ఇచ్చేస్తున్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడ్డవారు కొన్ని రకాల సిరప్‌లను వాడుతున్నారు. కోరెక్స్, పెన్సిడ్రిల్ వంటి ఔషధాలు కొంత మత్తు కలిగిస్తాయి. మాదకద్రవ్యాలు దొరకని సమయంలో వాటికి బానిసైనవారు ఈ సిరప్‌లను వినియోగిస్తుంటారు. ఈ తరహా సిరప్‌లను డాక్టర్ రాసి ఇస్తేనే రోగికి ఇవ్వాలి. కానీ కొన్ని మెడికల్ షాపుల్లో ఎవరు ఎన్ని అడిగినా ఇచ్చేస్తున్నారు. నిషేధిత డ్రగ్స్, కాలపరిమితి దాటిన, నకిలీ మందుల విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. డాక్టర్ రాసిన ఔషధాలు లేకుంటే, వాటికి బదులుగా మరో కంపెనీ మందులను అంటగడుతున్నారు.
ఫార్మసిస్టులు లేకుండానే
మేడ్చల్ జిల్లాలో రిటైల్, హోల్‌సేల్ మెడికల్ షాపులు మొత్తం 1,678 వరకు ఉన్నాయి. ప్రతి రోజు చిన్న, పెద్ద దుకాణాల్లో రూ.3 వేల నుంచి రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతుంటుంది. ఇలా ప్రతి రోజు రూ. 3 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుందని అంచనా. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 ప్రకారం ప్రతి మెడికల్ షాపులో రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఉండాలి. బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, డీ ఫార్మసీ చేసిన వారు (రిజిస్టర్ చేసుకుని ఉండాలి) మాత్రమే మెడికల్ దుకాణా లను నిర్వహించాలి. మెడికల్ దుకాణాలకు అనుమతిచ్చే సమయంలో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఫార్మసిస్టు ఉన్నదీ లేనిదీ పరిశీలించాలి. ఏరియా ఇన్‌స్పెక్టర్లు తనిఖీ సమయంలో ఫార్మసిస్టు ఉన్నారా..? లేదా…? అని పరిశీలించాలి. అయితే మామూళ్ల మత్తులో ఉన్న కొందరు ఏరియా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
అధికారుల లెక్కలు, డ్రగ్ ఇన్స్‌పెక్టర్ల నివేదికల ప్రకారం ప్రతి మెడికల్ షాపు ఫార్మసిస్టు పర్యవేక్షణలో నడుస్తుంటుంది. వాస్తవంగా లైసెన్సు మాత్రమే ఫార్మసిస్టు పేరిట ఉంటుంది. దుకాణాలను ఔషధాలపై కాస్త అవగాహన ఉన్న సిబ్బంది నిర్వహిస్తుంటారు. వీరికి తక్కువ వేతనం ఇచ్చి దోపిడీ చేస్తున్నారు. ఈ విషయమై మేడ్చల్ జిల్లా ఔషద నియంత్రణ శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ అనిల్ కుమార్ ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా, ఆయన కార్యాలయంలో అందుబాటులో లేరు.. ఫోన్ చేసినా స్పందించడం లేదు.