ఎంబీబీఎస్ మరింత కష్టం.. ఎగ్జిట్ పరీక్ష పాస్ అవ్వాల్సిందే
దిశ, తెలంగాణ బ్యూరో: నేషనల్ మెడికల్ కమిషన్ కొత్త నిబంధనల ప్రకారం ఎంబీబీఎస్ పూర్తి చేయడం మరింత కష్టంగా మారనున్నది. అతి త్వరలో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసిన ప్రతివ్యక్తి నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్‌ను రాయాల్సిందేనని ఎన్ఎంసీ తేల్చి చెప్పింది. దీన్ని 2023 వరకు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కూడా కేంద్రం సేకరిస్తున్నది. ఎఫ్ఎంజీ(ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్) స్థానంలో ఈ పరీక్షను తీసుకువచ్చినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే […]
దిశ, తెలంగాణ బ్యూరో: నేషనల్ మెడికల్ కమిషన్ కొత్త నిబంధనల ప్రకారం ఎంబీబీఎస్ పూర్తి చేయడం మరింత కష్టంగా మారనున్నది. అతి త్వరలో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసిన ప్రతివ్యక్తి నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్‌ను రాయాల్సిందేనని ఎన్ఎంసీ తేల్చి చెప్పింది. దీన్ని 2023 వరకు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కూడా కేంద్రం సేకరిస్తున్నది. ఎఫ్ఎంజీ(ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్) స్థానంలో ఈ పరీక్షను తీసుకువచ్చినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఇప్పటివరకు విదేశాల్లో మెడిసిన్ చదివిన వారు మాత్రమే ఈ ఎఫ్ఎంజీ పరీక్షను రాస్తున్నారు. కానీ ఎగ్జిట్ పరీక్షను మాత్రం విదేశాలతో పాటు మన దేశంలో ఎంబీబీఎస్ కోర్సు చదివిన ప్రతివ్యక్తి రాయాలని కొత్త నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
ఎగ్జిట్ పరీక్ష రెండు విధానాల్లో ఉండనున్నది. నెక్స్ట్ స్టెప్ 1, నెక్ట్స్ స్టెప్ 2 పేరిట రెండు సార్లు రాయాల్సి ఉంటుంది. విదేశాల్లో చదివిన స్టూడెంట్స్‌కు స్టెప్ 1 ఎగ్జామ్‌లో అడిషనల్ పేపర్స్ ఉంటాయని ఇటీవల ప్రకటించిన డ్రాఫ్ట్ రూల్స్‌లో పేర్కొన్నది. అంతేకాదు, ఎఫ్‌ఎంజీఈ తరహాలో పాస్ అయ్యేవరకూ ఎగ్జిట్‌ను రాసుకునే అవకాశం ఉండదు. ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత కేవలం రెండు సంవత్సరాల్లో ఈ పరీక్షను పాస్ కావాల్సి ఉంటుంది. అంటే, ఐదేండ్ల ఎంబీబీఎస్ కోర్సు పూర్తయిన తర్వాతి రెండేండ్లలో రెండు స్టెప్ల పరీక్షలు పాస్ అవ్వాలి. ఇది జరగకపోతే సదరు విద్యార్ధి డాక్టర్ అయ్యే అవకాశం ఉండబోదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే ఎఫ్ఎంజీ పరీక్షలో కేవలం 20 శాతం మంది మాత్రమే పాస్ అవుతున్నారు. కానీ ఎగ్జిట్ ఎగ్జామ్ దీని కంటే కఠినంగా ఉంటే ఉత్తీర్ణత శాతం మరింత తగ్గే అవకాశం ఉంటుందని ప్రోఫెసర్లు అంచనా వేస్తున్నారు.
అప్పుడే రిజిస్ట్రేషన్…
ఎన్ఎంసీ విధించే ఎగ్జిట్ పరీక్షలో పాస్ అయితేనే డాక్టర్‌గా రిజిస్ట్రేషన్ పొందడం సాధ్యమవుతుంది. మరోవైపు విదేశాల్లో మెడికల్ కోర్సు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉన్నది. దీంతో విదేశాల్లో ఎంబీబీఎస్‌కు వెళ్లే విద్యార్ధులు ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ఉన్న కోర్సు, ఇంటర్నిషిప్, సిలబస్ ఉన్న కాలేజీలను ఎంపిక చేసుకోవాలని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దీంతో పాటు కొన్ని దేశాల విద్యార్ధులకు ఎన్ఎంసీ ఆన్లైన్ క్లాసెస్‌కు అనుమతి ఇవ్వలేదు. ఇప్పటికే తమిళనాడు ఆ విధానాన్ని అమలు చేస్తున్నది. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాలకు ఇది వర్తించేలా కేంద్రం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో ఫిలిప్పీన్, రష్యా, బంగ్లాదేశ్, వంటి దేశాలకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. మెడికల్ స్టాండర్ట్స్ పెంచేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలువురు డాక్టర్లు పేర్కొంటున్నారు.
ప్రతి ఏటా 5 వేల మంది
మన రాష్ట్రం నుంచి ప్రతి సంవత్సరం సుమారు 4 నుంచి 5 వేల మంది విదేశాల్లో ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్తున్నట్లు మెడికల్ బోర్డు అధికారులు చెబుతున్నారు. కానీ వారిలో ఎంబీబీఎస్పూర్తి చేసిన తర్వాత డాక్టర్లుగా కేవలం 20 శాతం మంది మాత్రమే తయారవుతున్నారు. మిగతా వారంతా మన దేశంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న నేషనల్ బోర్డు నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్ పాస్ కాలేకపోతున్నారు . దీంతో నేషనల్ మెడికల్ కమీషన్ రిజిస్ట్రేషన్ పొందడం సాధ్యం కాదు. దీంతో ఇతర దేశాల్లో అక్కడ చదివిన ఎంబీబీఎస్ పూర్తిగా వృథా అవుతున్నది. చేసేదేమీ లేక చివరికి తక్కువ జీతానికి క్లినికల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. అయితే కెనడా, న్యూజిలాండ్, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా దేశాలకు మాత్రం ఎఫ్ఎంజీ పరీక్షకు మినహాయింపు ఉన్నది.