పొలిటికల్ వార్ టు పర్సనల్.. గతి తప్పుతోన్న మంథని!
ఎంతో ఘన చరిత్రగల మంథనిలో పరిస్థితులు మారిపోతున్నాయా? మేధావుల పుట్టినిల్లుగా వాసికెక్కిన మంథని నేడు నేరమయ ప్రపంచంగా మారి పోవడం ఏంటీ? ప్రత్యర్థులపై ఎత్తులతో ముందుకెళ్లిన చరిత్ర నాటిదైతే హత్యలకు వేదికగా మారిన చరిత్ర నేటిది. ఎందుకిలా సాగుతోంది? అసలేం జరుగుతోంది? దిశ ప్రతినిధి, కరీంనగర్ : మంత్రపురిగా భాసిల్లిన మంథని స్వాతంత్ర్య పోరాటంలో సరికొత్త అధ్యాయాన్నే లిఖించింది. అఖండ భారత్‌లో నైజాం పాలిత ప్రాంతం విలీనం కావాలన్న నినాదంతో సాయుధ పోరాటానికి శ్రీకారం చుట్టింది మంథని […]
ఎంతో ఘన చరిత్రగల మంథనిలో పరిస్థితులు మారిపోతున్నాయా? మేధావుల పుట్టినిల్లుగా వాసికెక్కిన మంథని నేడు నేరమయ ప్రపంచంగా మారి పోవడం ఏంటీ? ప్రత్యర్థులపై ఎత్తులతో ముందుకెళ్లిన చరిత్ర నాటిదైతే హత్యలకు వేదికగా మారిన చరిత్ర నేటిది. ఎందుకిలా సాగుతోంది? అసలేం జరుగుతోంది?
దిశ ప్రతినిధి, కరీంనగర్ : మంత్రపురిగా భాసిల్లిన మంథని స్వాతంత్ర్య పోరాటంలో సరికొత్త అధ్యాయాన్నే లిఖించింది. అఖండ భారత్‌లో నైజాం పాలిత ప్రాంతం విలీనం కావాలన్న నినాదంతో సాయుధ పోరాటానికి శ్రీకారం చుట్టింది మంథని బిడ్డలే. గుల్కోట శ్రీరాములు నేతృత్వంలో మహారాష్ట్రలోని చాందాలో క్యాంపు ఏర్పాటు చేసి సాయుధ శిక్షణ పొందారు యోధులు. జిల్లాలోనే మొట్టమొదటి సారిగా సత్యాగ్రహ దీక్ష చేపట్టిన రఘునాధరావు కాచే మంథని వారే. 1950వ దశాబ్దంలో బీబీసీ రిపోర్టర్‌గా పనిచేసిన ముద్ద కృష్ణయ్య, 1980వ దశాబ్దంలో ఇరిగేషన్ ఈఎన్సీగా పనిచేసిన సువర్ణ ప్రభాకర్ మంథనికి చెందిన వారే. 1980వ దశాబ్దంలోనే వందల సంఖ్యలో విదేశాలకు పయనమై స్థిరపడ్డ వారూ ఉన్నారు.
రాజకీయంగా..
1957 నుంచి 1972 వరకు మంథని ఎమ్మెల్యేగా గెల్చిన పీవీ నరసింహారావు రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.1983 నుంచి 1989 వరకు ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి రాష్ట్ర శాసనసభకు స్పీకర్‌గా వ్యవహరించిన శ్రీపాదరావు, ఆయన తనయుడు శ్రీధర్‌బాబు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.1982లో టీడీపీ ఆవిర్భావ సమయంలో ఏర్పడ్డ ఫైవ్ మెన్ కమిటీలో మంథనికి చెందిన గీట్ల జనార్దన్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. రాజకీయంగా వైరుధ్యం ఉన్నా విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు తప్ప శ్రుతిమించి వ్యవహరించిన పరిస్థితులు ఏనాడూ కనిపించ లేదు. టీడీపీ కార్యాలయం ముందు జాతీయ జెండా ఎగురవేయాలని అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే శ్రీపాదరావును గీట్ల జనార్దన్‌రెడ్డి కోరగానే ఆయన ఠక్కున పతాకావిష్కరణ చేసేశారు. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నా కక్షలు కార్పణ్యాలు అంతగా కనిపించిన దాఖలాలు లేవనే చెప్పాలి.
1989లో..
మంథని నియోజకవర్గ చరిత్రలో అత్యంత ఘోరమైన హత్యాకాండ సాగింది 1989లోనే. కాటారం మండలం దామరకుంటలో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన వారు వర్గాలుగా విడిపోయారు. విద్వేషాలు రగుల్చుకుని ఓ వర్గంపై మరో వర్గం సాగించిన హత్యాకాండలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. రాష్ట్ర స్థాయిలో సంచలనం కల్గించిన ఈ ఘటనలో అప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు పర్యటించారు. పోలీసులు కూడా ఇరు వర్గాలకు చెందిన వారిపై కేసులు నమోదు చేశారు. గ్రామంలో పెద్ద ఎత్తున పికెట్లు ఏర్పాటు చేశారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదనే చెప్పాలి. వ్యక్తిగత కక్షలతో దాడులు చేసుకున్న సంఘటనలు ఉన్నా వాటికి రాజకీయ రంగు మాత్రం అంటలేదు.
ఉల్టాపల్టాగా నేటి పరిస్థితులు..
మంథనిలో నేడు ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఏ నేరం జరిగినా రాజకీయ రంగు పులుముకుంటోంది. ఇరుపార్టీల నాయకుల మధ్య వైరం రాష్ట్ర స్థాయిలో సంచనాలకు వేదికగా మారింది. హత్యలు, దాడులు నిత్యకృత్యంగా మారిపోయాయి. రాజకీయం మాటున వర్ణాల వారీగా లాబీయింగ్‌లు చేస్తున్నారు. మంథని మధుకర్ మరణమే అయినా, కవిరాజు ఆత్మహత్యే అయినా వామన్ రావు దంపతుల హత్యే అయినా ఏదైనా రచ్చకెక్కుతున్నాయి. ప్రతి విషయమూ రాష్ట్ర స్థాయిలో చర్చకు దారి తీస్తున్నాయి. ఒకప్పుడు మంథని అంటే మేథావుల పుట్టినిల్లు, రాజకీయ నాయకులను ఉన్నత స్థితికి చేర్చే గడ్డ అన్న పరిస్థితి నుంచి నేడు నేరమయ ప్రపంచానికి కేరాఫ్ అన్నట్టుగా మారిపోయింది. పార్టీల వారీగా విడిపోయి నేరాలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా సర్వసాధారణంగా మారాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ అంటూ కలివిడిగా ఉండాల్సిన సామాన్యులు విడివిడిగా జీవనం సాగిస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ నాయకులు మాటల యద్ధమే కొనసాగిస్తున్నారు. మంథనికి చెందిన నాయకుడు ‘దిశ’తో మాట్లాడుతూ ఆ ఫ్యాక్టరీలో పుట్టి ఈ కంపెనీలో ఉపాధి పొందుతున్న వారే ఇలా వ్యవహరిస్తుండడం సరికాదని అన్నారు. పెరిగిపోయిన కక్షలు కార్పణ్యాలకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు పోలీసులు నడుం బిగించాల్సిన అవసరం ఉంది. పోలీస్ పికెట్లను ఏర్పాటు చేయాలి. యువత రాజకీయాల్లోకి రావాలి. సమాజ చైతన్యానికి చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది.