బెంగాల్‌లో దీదీ వర్సెస్ ఈసీ

కోల్‌కతా : పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. శనివారం జరిగిన నాలుగో దశ పోలింగ్‌లో తలెత్తిన హింసాకాండపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఇది ఎన్నికల కమిషన్ తో పాటు కేంద్ర ప్రభుత్వ వైఫల్యమని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించగా.. ఆమె రెచ్చగొట్టడం వల్లే అల్లరి మూకలు రెచ్చిపోయి కాల్పులకు దారితీశాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అంతేగాక ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్-ఎంసీసీ)ని […]

Update: 2021-04-11 10:55 GMT

కోల్‌కతా : పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. శనివారం జరిగిన నాలుగో దశ పోలింగ్‌లో తలెత్తిన హింసాకాండపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఇది ఎన్నికల కమిషన్ తో పాటు కేంద్ర ప్రభుత్వ వైఫల్యమని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించగా.. ఆమె రెచ్చగొట్టడం వల్లే అల్లరి మూకలు రెచ్చిపోయి కాల్పులకు దారితీశాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అంతేగాక ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్-ఎంసీసీ)ని ఈసీ ‘మోడీ కోడ్ ఆఫ్ కండక్ట్’గా పేరు మార్చుకోవాలని దీదీ ఎద్దేవా చేశారు.

నాలుగో రోజైనా వెళ్తా

నాలుగో దశ పోలింగ్ సందర్భంగా శనివారం కూచ్‌బెహర్ లోని సీతల్‌కుచిలో చోటుచేసుకున్న హింసాకాండ నేపథ్యంలో మూడు రోజుల పాటు రాజకీయ నాయకులెవరూ అక్కడికి వెళ్లకూడదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సిలిగురిలో మమత విలేకరులతో మాట్లాడారు. దీదీ స్పందిస్తూ.. నాలుగో రోజైనా అక్కడికి వెళ్తానని, బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని స్పష్టం చేశారు. తాను రాయల్ బెంగాల్ టైగర్ అని, బెంగాళీలను కలవడానికి తనకు ఎవరి పర్మిషన్ అక్కర్లేదని స్పష్టం చేశారు. శనివారం నాటి ఘటనను ‘దారుణ హత్యాకాండ’గా అభివర్ణించారు. అది అప్పటికప్పుడు జరిగిన ఘటన కాదని, కేంద్ర బలగాలు ఉద్దేశపూర్వకంగానే నలుగురిని కాల్చి చంపాయని మండిపడ్డారు. చంపాలనే ఉద్దేశం లేకుంటే కాళ్లపైనో, మరెక్కడైనా కాల్చవచ్చుగానీ మెడ, ఛాతి మీద ఎందుకు కాల్చాల్సి వచ్చిందని ప్రశ్నించారు. వాస్తవాలు బయటకు రాకుండా ఉండేందుకే అక్కడ మూడు రోజుల పాటు నిషేధం విధించారని దీదీ ఆరోపించారు. దేశంలో అసమర్థ ప్రధాని, హోంమంత్రి బెంగాల్‌ను దక్కించుకోవడానికి చూస్తున్నారని, అందులో భాగంగానే ఈ కుట్రలు పన్నుతారని మండిపడ్డారు. బెంగాల్ లో నాలుగు దశల్లో జరిగిన పోలింగ్ లో తాము ఓడిపోతామని బీజేపీకి తెలిసొచ్చే ఈ తరహా హింసాదాడులకు తెరతీసిందని విమర్శించారు. వాళ్లు (బీజేపీ) ఉప‌యోగించిన బుల్లెట్‌ల‌పై మ‌నం బ్యాలెట్‌తో ప్రతీకారం తీర్చుకుందామ‌ని ఓటర్లకు పిలుపునిచ్చారు.

అంతా దీదీ వల్లే : షా

బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ రెచ్చగొట్టడం వల్లే సీతల్‌కుచిలో కాల్పులు చోటు చేసుకున్నాయని అమిత్ షా ఆరోపించారు. భద్రతా బ‌ల‌గాల‌ను ఘెరావ్ చేయాలని మ‌మ‌త కొద్దిరోజులుగా టీఎంసీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని దాని పర్యావసానమే శనివారం నాటి ఘటన అని వివరించారు. కాగా, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలన్న దీదీ వ్యాఖ్యలకు ఘాటైన కౌంటర్ ఇచ్చారు. తనను ఎవరో రాజీనామా చేయమంటే చేయమని, ప్రజలు అడిగితే తప్పకుండా చేస్తానని.. మే 2 న ఆమె (మమతా బెనర్జీ)కు రాజీనామా తప్పదని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ హింసకు చరమగీతం పాడతామని షా తెలిపారు.

Tags:    

Similar News