బతుకులను ఛిద్రం చేసిన ఎల్‌ఆర్ఎస్
దిశ, తెలంగాణ బ్యూరో: ఎల్ఆర్ఎస్ రాష్ట్ర ప్రజల ఆర్ధిక స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. లక్షలాది మంది బతుకులను ఛిద్రం చేస్తోంది. ప్రాణప్రదమైన ఆస్తికి విలువ లేకుండా చేయడంతో వారంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెలంగాణలో ఉత్పాదక రంగాలు పెద్దగా లేకపోవడంతో భూమి మీదనే పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య అధికం. ప్రతి మధ్య తరగతి కుటుంబం భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పైసా పైసా సంపాదించి భూమి కొనుగోలు చేస్తుంది. ఇప్పుడా భూమి ఆపదలోనూ ఆదుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కరోనా […]
దిశ, తెలంగాణ బ్యూరో: ఎల్ఆర్ఎస్ రాష్ట్ర ప్రజల ఆర్ధిక స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. లక్షలాది మంది బతుకులను ఛిద్రం చేస్తోంది. ప్రాణప్రదమైన ఆస్తికి విలువ లేకుండా చేయడంతో వారంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెలంగాణలో ఉత్పాదక రంగాలు పెద్దగా లేకపోవడంతో భూమి మీదనే పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య అధికం. ప్రతి మధ్య తరగతి కుటుంబం భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పైసా పైసా సంపాదించి భూమి కొనుగోలు చేస్తుంది.
ఇప్పుడా భూమి ఆపదలోనూ ఆదుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కరోనా కారణంగా ఎనిమిది నెలలుగా రియల్ ఎస్టేట్ రంగం రంగం కుదేలైంది. అంతోఇంతో మిగిలిన వ్యాపారాన్ని ఎల్ఆర్ఎస్ ఊడ్చేసింది. క్రయవిక్రయాలు లేక, కమీషన్లు రాక లక్షలాది మంది రోడ్డున పడ్డారు. ఉపాధి లేక చేయడానికి మరో పని దొరకక సతమతమవుతున్నారు. లాక్ డౌన్ తర్వాత వ్యాపారం పుంజుకుంటుందని భావించారు. సంసారం సాగుతుందనుకున్నారు. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకాన్ని తెర పైకి తెచ్చి వారి ఆశలపై నీళ్లు చల్లింది.
తప్పెవరిది? శిక్ష ఎవరికి?
ఊరికి దగ్గరగా ఇంటి స్థలాలు కొంటే అవసరంలో ఆదుకుంటాయని బావిస్తారు. వెంచర్ కు అనుమతి ఉందా? లేదా? అన్నదానికంటే ఎంత తక్కువకు దొరుకుతుందనే అంశానికే చాలా మంది ప్రాధాన్యం ఇస్తారు. అందుకే వారంతా దశాబ్దాల క్రితం భూములు కొనుగోలు చేశారు. ఆ వెంచర్లన్నీ అక్రమమేనని సర్కారు ఇప్పుడు ప్రకటించింది. మరి ఇన్నాండ్లుగా వాటి రిజిస్ట్రేషన్లు ఎందుకు నిలిపివేయలేదన్నది సామాన్యుడి ఆవేదన. ఒక్కో ప్లాటు పది మంది వరకు చేతులు మారింది.
పదిసార్లు స్టాంపు డ్యూటీ ప్రభుత్వ ఖజానాకు చేరింది. అప్పుడెందుకు తిరస్కరించలేదని తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ గౌడ్ ప్రశ్నిస్తున్నారు. ఆ వెంచర్లను అమ్మిన యజమానులపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? ప్లాట్లు కొనుగోలు చేసినవారిది తప్పా? రిజిస్ట్రేషన్ చేసిన అధికారుల బాధ్యత లేదా? స్టాంపు డ్యూటీతో ఖజానాను నింపుకున్న ప్రభుత్వం అప్పుడే అక్రమాలను ఎందుకు గుర్తించలేదు? అంటూ నిలదీస్తున్నారు. తప్పులు చేసిందొకరైతే శిక్ష మరొకరికి వేస్తూ నాలుగు నెలలుగా ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదని అంటున్నారు.
ఉక్కిరిబిక్కిరి..
ఉప్పుగూడకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి తుర్కయంజాల్ లో ఓ ప్లాటును అమ్మేశాడు. అక్కడ రూ.25 లక్షలు తీసుకొని హైటెక్ సిటీ దగ్గర ఓ ఫ్లాట్ కు అడ్వాన్స్ చెల్లించాడు. ఆర్నెళ్లయ్యింది. ప్లాటు కొన్న వ్యక్తి రిజిస్ట్రేషన్ చేస్తేనే మిగతా డబ్బు ఇస్తానంటున్నాడు. ఇక్కడ మిగతా సొమ్ము కట్టేందుకు గడువు ముగియడంతో బిల్డర్ అడ్వాన్సు కూడా తిరిగిచ్చేది లేదంటున్నాడు. ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నాడు. ఎవరిని కలవాలి? ఎంత కట్టాలి? తెలియక అయోమయానికి గురవుతున్నాడు.
రూ.25 లక్షలు పోగొట్టుకునే పరిస్థితి. దిల్ సుఖ్ నగర్ లోని ఓ కార్పొరేట్ కళాశాలలో పనిచేసే శ్రీనివాస్ ఉద్యోగం కరోనాతో ఊడింది. స్నేహితుల దగ్గర రూ.20 లక్షల అప్పు తెచ్చి ప్లాట్లల్లో పెట్టారు. ఎల్ఆర్ఎస్ పిడుగు పడింది. వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. అత్తాపూర్ కు చెందిన రాజిరెడ్డికి చిన్న కంపెనీ ఉంది. మిత్రుడు బతిమిలాడితే రూ.10 లక్షలు ఇచ్చాడు. ఇంతలో కరోనా వచ్చింది. ప్లాట్లు అమ్మలేకపోయారు. ఇప్పుడేమో ఎల్ఆర్ఎస్ ఉంటేనే కొంటామంటున్నారు. రాజిరెడ్డి కంపెనీ దివాలా తీసింది. డబ్బులు తీసుకున్న మిత్రుడేమో ప్లాట్ అమ్ముడుపోలేదంటున్నాడు. ఏ రియల్ ఎస్టేట్ ఆఫీసు ముందు కాసేపు కూర్చున్నా ఇలాంటి ఉదాహరనలు వందలాదిగా కనిపిస్తాయి.
20 శాతం కూడా ఉండవు
ఆమోదం పొందిన లే అవుట్లు, అనుమతి పొందిన ఇండ్లు 20 శాతం కూడా ఉండవని రియల్టర్లు చెబుతున్నారు. హెచ్ఎండీఏ, డీటీసీపీ ఆమోదం పొందిన లే అవుట్లు ఊరికి దూరంగా ఎక్కడో ఉంటాయి. అనధికార లే అవుట్లు గ్రామానికి దగ్గరగా, ఇప్పటికిప్పుడు ఇండ్లు కట్టుకొని ఉండేటట్లుగా ఉంటాయని నారగోని ప్రవీణ్ కుమార్ గౌడ్ ‘దిశ’కు వివరించారు. రియల్ ఎస్టేట్ రంగం మీద ఆధారపడి బతికేవారు లక్షల సంఖ్యలో ఉన్నారు. వారి నోట్లో మట్టి కొట్టారని విమర్శిస్తున్నారు.
ఎల్ఆర్ఎస్ కు 25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు వాటిని అధికారులు ముట్టుకోలేదు. అవసరానికి అమ్ముకోవాలనుకున్న యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ నాలుగు నెలల నుంచి ఎల్ఆర్ఎస్ అక్రమమని ఉద్యమం చేస్తోంది. పెద్ద సంస్థలు మంత్రి కేటీఆర్ తో సత్సంబంధాలు ఉండడంతో బహిరంగంగా ఉద్యమం చేయలేదు. ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో టీఆర్ఎస్ మీద దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలలో తీవ్ర ప్రభావం పడిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.