గోండు గూడాల్లో అంబరాన్నంటిన సంబురాలు
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గోండు గూడాల్లో దండారీ ఉత్సవాలు జోరుగా సాగుతున్నాయి.. ఆకాడితో ప్రారంభమై దీపావళి తర్వాత రెండ్రోజులకు నిర్వహించే కోలబోడి వేడుకలతో ముగుస్తాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో దండారీ సంబురాలతో ఆదివాసీ గూడెంలు మారుమోగుతున్నాయి. డప్పుల చప్పుళ్లు.. గజ్జెల సవ్వళ్లు.. పాటల సందడి.. సాంప్రదాయ నృత్యాలతో అందరినీ అలరిస్తున్నాయి.. దండారీ ఉత్సవాలకు పర్రా, పెట్టి, గుమ్మెలా, తుడుం, డప్పు మొదలైన వాయిద్యాల చప్పుళ్లతో ఘల్లు ఘల్లుమనే గజ్జెల చప్పుళ్లతో గోండు […]
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గోండు గూడాల్లో దండారీ ఉత్సవాలు జోరుగా సాగుతున్నాయి.. ఆకాడితో ప్రారంభమై దీపావళి తర్వాత రెండ్రోజులకు నిర్వహించే కోలబోడి వేడుకలతో ముగుస్తాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో దండారీ సంబురాలతో ఆదివాసీ గూడెంలు మారుమోగుతున్నాయి. డప్పుల చప్పుళ్లు.. గజ్జెల సవ్వళ్లు.. పాటల సందడి.. సాంప్రదాయ నృత్యాలతో అందరినీ అలరిస్తున్నాయి.. దండారీ ఉత్సవాలకు పర్రా, పెట్టి, గుమ్మెలా, తుడుం, డప్పు మొదలైన వాయిద్యాల చప్పుళ్లతో ఘల్లు ఘల్లుమనే గజ్జెల చప్పుళ్లతో గోండు గూడాలు పండగ చేసుకుంటున్నాయి.
గోండులు ఆషాడ మాసంతో ఆకాడిపేన్ దేవతకు పూజలు నిర్వహిస్తారు. ఆషాడ మాసం పౌర్ణమి రోజు ఈ పూజలు జరుపకపోతే దసరా తర్వాత జరిపి ఉత్సవాలు ప్రారంభిస్తారు. దండారీలో ఆటపాటలకు ఉపయోగించు పర్రా, పెట్టె, తుడుం, డప్పు, పిప్రి మొదలైన సంగీత పరికరాలను, నెమలి ఈకలతో కుంచె కట్టిన గుస్సాడీ కిరీటాలు, ఇతర వస్తు సామాగ్రిని గూడెం గ్రామ పటేల్ ఇంటి ముందుంచి సాంప్రదాయ రీతిలో పూజలు చేసి జంతుబలి ఇస్తారు. దేవతల అనుగ్రహం పొందామని సంతప్తి చెందాక గూడెంలలో గుస్సాడీ నృత్యాలు ప్రారంభిస్తారు. దీపావళి ముందు నుంచి పండగ రెండు రోజుల తర్వాత వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఒక్కో ఏడాది ఒక గూడెంకు చెందిన వారు మరో గూడెంకు వెళ్లి అతిథి మర్యాదలు స్వీకరించే సమయంలో గుస్సాడీ, చచోయి నృత్యాలు చేస్తారు. ఇలా సంబురాలు నిర్వహించటాన్ని దండారీ అంటారు. గోండులు ప్రతిష్టించిన మేత్మసర్ పేన్ (దేవతలు)ను ఆరాధించే క్రమంలో జరుపుకునే సంబురాలే దండారీ ఉత్సవాలని వారి పూర్వీకులు చెబుతుంటారు.
దండారీ ఉత్సవాలు ముగిసే వరకు నియమ నిష్టలతో పండగ ముగిసేంత వరకు ఒకేచోట ఉంటారు. నృత్యాలు చేసేవారు శరీరం నిండా బూడిద, మసి పూసుకొని ప్రత్యేక పేర్లతో ఉన్న మాలలు ధరిస్తారు. కుడిచేతిలో మంత్రదండం ధరిస్తారు. తలపై నెమలి ఈకలతో తయారు చేసిన కుంచె(కిరీటం) ధరించి.. చిన్న చిన్న అద్దాలతో అలంకరించి ఉంటుంది. కాళ్లకు గజ్జెలు కట్టుకొని.. వాయిద్యాల చప్పుళ్లకు అనుగుణంగా లయబద్ధంగా నృత్యాలు చేస్తారు. ‘‘చచోయి ఇట్ కోలారా, దేనే దేనేరా.. చచోయి ఇట్ కోలారా దేనే దేనేరా..’’ అంటూ తమ పూర్వీకులను కొలుస్తూ పాట పాడుతూ నృత్యం చేస్తారు. ఒక గూడెం నుంచి మరో గూడెం బయల్దేరే సమయంలో గడ్డిని ముడి వేయటంతో ఆ గూడెంకు ఎలాంటి కీడు జరుగదని నమ్మకం. ముడి వేసిన గడ్డిపై పప్పు, బెల్లం చల్లి తామొచ్చే దాకా చల్లగా కాపాడాలంటూ పూజలు చేసి ‘‘చుక్డా గర్క లక్టు దేవతర్’’ అంటూ ప్రత్యేక పాట పాడి వేరే గూడెంకు బయలుదేరుతారు.
ఒక గూడెం నుంచి మరో గూడెం వెళ్లే క్రమంలో ఆ గూడెం పొలిమేరలో ఆథిత్యం స్వీకరణకు తుడుం మోగిస్తారు. ‘‘సివర్ బోవన్ ఆకి మార్కెయి’’ అంటూ గుస్సాడీలకు దిష్టి తీసి వందనం చేసి కాళ్లు కడుగుతారు. వారి చేతులు పట్టుకుని మర్యాద పూర్వకంగా స్వాగతం పలికి ‘రాం.. రాం..’ చేస్తారు. తమ గ్రామానికి ఎంతమంది వచ్చారనేది లెక్కించేందుకు బీడీలు ఇస్తారు. ఇందుకు అనుగుణంగా భోజనాలు ఏర్పాటు చేస్తారు. గుస్సాడీల చచోయి-చాహోయి, మహిళలు చేసే నృత్యాలు, గుమ్మెలాటలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. కొందరు విజయ సూచికగా పుతికట్లు(పొత్తి) ధరిస్తారు. ఆథిత్యానికి వచ్చిన వారు తిరిగి వెళ్లే సమయంలో చిక్కు, కుశల ప్రశ్నలతో తికమక పెడతారు. ఓడిపోయిన వారు దక్షిణ(కట్నం) చెల్లించాల్సి ఉంటుంది. ఇలా అతిథి మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవటం వల్ల మానవ సంబంధాలు బలంగా ఉంటాయని.. కొత్త బంధుత్వాలు ఏర్పడుతాయని గోండు పెద్దలు అంటుంటారు.
గోండులు దండారీ ఉత్సవాల్లో రకరకాల నాటికలు ప్రదర్శిస్తారు. ఉమ్మడి కుటుంబం విడిపోతే కష్టాలు, నష్టాలు, కలిసుంటే లాభాలు, తగువుల పరిష్కారం గురించి నాటికలు వేస్తారు. గుస్సాడీల నృత్యాల్లో కోలాటాలు నాలుగు రకాలుండగా.. మన్కోల, చేటికోల, కోడల్ కోల, సదర్ కోల ఉంటాయి. నృత్యాల్లో నాలుగు రకాలుండగా.. నాలుగు వంశాలకు చెందిన వారు కలిసి చేసే నృత్యాలు, అయిదు రకాల వారు చేసే అయిదు గమ్మెల, ఆరు వంశాల వారు చేసేది కోడల్ నృత్యాలు, ఏడు వంశాల వారు చేసే టప్పల్ నృత్యాలు.. ఇలా రకరకాల వంశాలకు చెందిన వారి నృత్యాలు కనువిందు చేస్తుంటాయి. తమ గూడెంకు వచ్చిన అతిథులు రెండు రోజుల పాటు నృత్యాల్లో పాల్గొన్నాక.. తిరిగి ప్రత్యేకంగా సాగనంపుతారు. ఈ సందర్భంగా గుస్సాడీలు సార్ కోల (సాగనంపే), నల్ వల్ కోల(మర్యాదలు), కలువ కోల (వీడ్కోలు) అనే రకాల నృత్యాలు చేస్తారు. అతిథులను తమ గ్రామం పొలిమేర వరకు సాగనంపుతారు.
దీపావళికి ముందు ప్రారంభమై.. తర్వాత రెండు రోజులకు కోలబోడి పండగ నిర్వహించటంతో ముగుస్తాయి. ఆదివారం రోజున గుస్సాడీల దండారీ ఉత్సవాలు ముగియనున్నాయి. అతిథి మర్యాదలు స్వీకరించేందుకు వెళ్లే సమయంలో ముడి వేసిన గడ్డిని విప్పేసి.. పొలిమేరలో ఉండే భీమల్ దేవర వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సమీప నీటి వనరుల వద్ద వారంతా స్నానాలు చేసి.. భీమల్ దేవర వద్ద ప్రత్యేక పూజలు చేసి సహపంక్తి భోజనాలు చేస్తారు. సంబురాలు నిర్వహించిన చోట వాయిద్యాలకు, గుస్సాడీలకు, అలంకరణ సామాగ్రికి దిష్టి తీస్తారు. గుస్సాడీ అలంకరణ, ఇతర వస్తు సామాగ్రిని ఒక దగ్గర చేర్చి ఉయ్యలలో పెట్టి జోల పాడుతారు. గూడెం పెద్ద ఇంట్లో భద్రపరచటంతో దండారీ ఉత్సవాలు ముగుస్తాయి.