అవినీతి చేయడంలో మోడీ ఛాంపియన్.. కేరళలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

అవినీతికి ప్రధాని నరేంద్ర మోడీ చాంపియన్ అని ఆరోపించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన కామెంట్లను ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ పార్లమెంటు సెగ్మెంట్‌లో ప్రస్తావించారు.

Update: 2024-04-17 17:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అవినీతికి ప్రధాని నరేంద్ర మోడీ చాంపియన్ అని ఆరోపించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన కామెంట్లను ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ పార్లమెంటు సెగ్మెంట్‌లో ప్రస్తావించారు. రెండు రోజుల ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కేరళ వెళ్ళిన సీఎం రేవంత్.. కాబోయే ప్రధాని రాహుల్‌గాంధీ అని వ్యాఖ్యానించారు. వయనాడ్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూనే ఇరవై ఏండ్ల పాటు ఆయన ప్రధానిగా కొనసాగుతారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ అనే స్కీమ్ ప్రపంచంలోనే అతి పెద్ద దోపిడీ స్కీమ్ అని వ్యాఖ్యానించారు. ఇది పారదర్శకమైన విధానమని, అవినీతిని అంతమొందించే స్కీమ్ అని ప్రధాని గొప్పగా చెప్పుకుంటున్నారని, అదే నిజమైతే సుప్రీంకోర్టు దీన్ని ఎందుకు రద్దు చేసిందని ప్రశ్నించారు. ఆ స్కీమ్‌లో పారదర్శకత ఉన్న మాట నిజమే అయితే ఆ బాండ్లను కొన్నవారిని, బీజేపీకి డబ్బులు ఇచ్చినవారి పేర్లను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు.

బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలంటే ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించిన సీఎం రేవంత్.. ఈవీఎంలపై విపక్షాలతో పాటు ప్రజలకు కూడా నమ్మకం పోయిందన్నారు. అనేక దేశాలు పోలింగ్ విధానానికి బ్యాలెట్ పేపర్లు ఉపయోగిస్తున్నాయని, మన దేశంలో మాత్రం ఈవీఎంలను ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఓటు అడిగే కనీస హక్కు ఒక పార్టీగా బీజేపీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేదని అన్నారు. దక్షిణాదికి ఏమిచ్చారని ఆ పార్టీకి, మోడీకి ఓటు వేయాలని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలు భారత్‌లో అంతర్భాగమేనని, కానీ వాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల పంపిణీలో వివక్ష జరిగిందన్నారు. ఈ మధ్యకాలంలో మోడీ ఎందుకు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని ప్రశ్నించారు.

గుజరాత్‌కు కేటాయించిన బుల్లెట్ రైలును దక్షిణాదికి కూడా ఇస్తామని ఇప్పుడే ఎందుకు మేనిఫెస్టోలో పెట్టారని ప్రస్తావించి, దీని వెనక ఓటు బ్యాంకు పాలిటిక్స్, ప్రజలను తప్పుదారి పట్టించి ఓట్లు కొల్లగొట్టే కుట్ర ఉన్నదని ఆరోపించారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, హోం మంత్రి, రక్షణ మంత్రి. వంటి కీలక పదవుల్లో దక్షిణాది వ్యక్తుల్ని ఎందుకు ఎంపిక చేయలేదన్నారు. దక్షిణాది రాష్ట్రాలు బీజేపీని ఎప్పుడో నిషేధించాయన్నారు. బీజేపీ అభ్యర్థి సురేంద్రన్‌కు అండగా నిలిచారని విమర్శించారు. ‘అబ్ కీ బార్ 400 పార్’ అనేది స్లోగన్‌కు మాత్రమే పనికొస్తుందని, వినడానికి బాగానే ఉంటుందని, కానీ ఆ పార్టీకి ఈసారి అన్ని సీట్లు రాబోవన్నారు. పది సంవత్సరాల హయాంలో మన దేశాన్ని మోడీ భ్రష్టు పట్టించారని ఆరోపించారు. వయనాడ్‌లో పోటీలో ఉన్న ఎల్డీఎఫ్ అభ్యర్థికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎందుకు మద్దతు ఇవ్వట్లేదని నిలదీశారు.

Tags:    

Similar News