N Chandrababu Naidu: ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఏపీ సీఎం

Update: 2024-08-17 09:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఏపీ పరిస్థితులను వివరించేందుకు కేంద్ర పెద్దలతో భేటీ అవుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రమంత్రులతో చర్చించనున్నారు. ఇందులో భాగంగానే ఇవ్వాళ ఉదయం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తో భేటీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్రంలో విమానయాన రంగ అభివృద్దిపై అధికారులతో చర్చించారు. అలాగే ఏపీలో కొత్త ఎయిర్ పోర్టుల ఏర్పాటు ప్రతిపాదనలపై అధికారులకు ప్రజెంటేషన్ ఇచ్చారు.

అలాగే ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. దీని తర్వాత సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమై రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను వివరించనున్నారు. అలాగే ఏపీలో వెనుకబడిన జిల్లాలకు కొత్త రుణాలతో పాటు బడ్జెట్ లో అమరావతికి ప్రత్యేక సహాయంగా ప్రకటించిన 15 వేల కోట్ల నిధుల విడుదలపై చర్చించనున్నారు. అనంతరం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రానికి సంబందించిన పలు అంశాలపై సమావేశం నిర్వహించనున్నారు. వీలైతే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి సంబందించిన అంశాలపై చర్చించనున్నారు.

జగన్ హయాంలో తీసుకున్న రుణాలను రీషెడ్యూల్ చేయాలని ప్రధానిని సీఎం కోరనున్నట్లు తెలిసింది. అంతేగాక పోలవరం సహా నదుల అనుసందానానికి సంబందించిన అంశాలపై భేటీలో వివరణ ఇవ్వనున్నారు. కాగా రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. పర్యటనలో భాగంగా తొలిరోజు ఏపీ నీటిపారుదల మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. ఇందులో పోలవరం నిర్మాణ పనులపై జలశక్తి శాఖ అధికారులతో గంటకు పైగా సమావేశం అయ్యారు. ఈ భేటీ పోలవరం నిర్మాణ పనులను ప్రస్తుతం నిర్వహిస్తున్న సంస్థకే ఇవ్వాలని, పోలవరం కొత్త డయాఫ్రాం వాల్ నిర్మాణం సహా పలు పెండింగ్ పనులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.      

Tags:    

Similar News