జనాభా లెక్కించకపోవడం వెనుక బీజేపీ భారీ కుట్ర.. CM రేవంత్ సంచలన వ్యాఖ్యలు
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా అసిఫాబాద్‌లో సభ నిర్వహించారు.
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా అసిఫాబాద్‌లో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని అన్నారు. అధికారంలోకి రాగానే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం అభివృద్ధి కోసం నిధులు కేటాయించామని గుర్తుచేశారు. ఆదిలాబాద్‌లో సీసీఐ మూతపడినా ఏనాడూ ప్రధాని మోడీ, కేసీఆర్ పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. అధికారంలో ఉన్న పదేళ్లలో ఆదిలాబాద్‌కు మోడీ, కేసీఆర్ చేసిందేమీ లేదని విమర్శించారు.
తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేశామని చెప్పారు. తప్పించుకునే ప్రయత్నం తాము చేయలేదని.. బాధ్యతగా భావించి ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని అన్నారు. బలహీన వర్గాల కులగణను చేస్తున్నట్లు ప్రకటించారు. కుల గణన చేస్తేనే బీసీలకు రిజర్వేషన్లు పెంచడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ చూస్తోందని ఆరోపించారు. 1881 నుంచి ప్రతి పదేళ్లకోసారి దేశంలో జనాభా లెక్కలు తీస్తూ వస్తున్నట్లు తెలిపారు. 2021లో జనాభా లెక్కించాల్సి ఉన్నా బీజేపీ లెక్కించకుండా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఈ కుట్రలో అమిత్ షా సూత్రధారి అన్నారు.
రిజర్వేషన్లను రద్దు చేయాలనే అజెండాతోనే 2021లో జనాభాను లెక్కించలేదని తెలిపారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు కావడం ఖాయమని అన్నారు. బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్ల రద్దును అంగీకరిస్తున్నట్లే అని ఓటర్లకు సూచించారు. దీనిపై మాట్లాడుతున్నందుకే నాపై ఢిల్లీ పోలీసులతో కేసు పెట్టించారని అన్నారు. ఇలాంటి కేసులకు తాను భయపడను అన్నారు. అందుకే 8 రాష్ట్రాలను బీజేపీ బలవంతంగా లాక్కుందని ఆరోపించారు. రిజర్వేషన్లు పెరగాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు. దేశంలో 15 రాష్ట్రాలు ఆమోదిస్తే రిజర్వేషన్లు రద్దు చేయొచ్చు అని చెప్పారు. ఆ కుట్రలో భాగంగానే 8 రాష్ట్రాలను లాక్కుందని అన్నారు.
Read More..