‘ఉపా’, మనీలాండరింగ్ చట్టాలను రద్దు చేస్తాం: సీపీఎం మేనిఫెస్టో ప్రకటన

Update: 2024-04-04 17:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం ‘కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా’-మార్కిస్ట్ (సీపీఎం) గురువారం తమ మేనిఫెస్టోను ప్రకటించింది. పార్టీ సీనియర్ నేతలు ప్రకాశ్ కరాత్, బ్రిందా కరాత్, నీలోత్పాల్ బసు సమక్షంలో ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ పార్టీని గెలిపిస్తే బీజేపీ తీసుకొచ్చిన కిరాతకమైన ‘పౌరసత్వ సవరణ చట్టం’(సీఏఏ), ‘ఉపా’, మనీలాండరింగ్ నిరోధక చట్టాల(పీఎంఎల్ఏ)ను రద్దు చేస్తామని హామీనిచ్చారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశ చరిత్ర ప్రమాదంలో ఉంది. భారతదేశం సెక్యులరిస్టిక్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. ఈ చరిత్రను తుడిచిపెట్టి, ఫాసిస్టు నియంతృత్వంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని ఆపాల్సిన అవసరం ఉంది. దేశాన్ని రక్షించాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకోసం మోడీని, బీజేపీని అధికారంలోకి రాకుండా ఆపాలి’’ అని అన్నారు.

సీపీఎం మేనిఫెస్టోలోని కీలకాంశాలు:

* రాజ్యాంగం ప్రసాదించిన లౌకిక సూత్రాన్ని, ప్రజాస్వామిక హక్కుల రక్షణ.

* రైతులు తమ ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు విక్రయించే హక్కును అమలు చేయడం. ఇది మొత్తం ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50 శాతం ఎక్కువగా ఉండాలి.

* కార్మికులకు చట్టబద్ధమైన కనీస వేతనం(నెలకు రూ.26వేలకు పైగా) అమలు.

* నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి

* ఉచిత ఆరోగ్య సంరక్షణ హక్కు కల్పించడం.

* కులగణన, నియోజకవర్గాల పునర్విభజనతో సంబంధం లేకుండా చట్ట సభల్లో మహిళలకు తక్షణమే మూడింట ఒకవంతు రిజర్వేషన్ అమలు.

* జాతీయ విద్యావిధానం రద్దు

* జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ‘ఆర్టికల్ 370’ పునరుద్ధరణ.


Tags:    

Similar News