ప్రగ్యాసింగ్‌కు టికెట్ కట్.. తొలి జాబితాలో పలువురు సిట్టింగ్‌లకు షాకిచ్చిన బీజేపీ

గెలుపు గుర్రాలనే బరిలోకి దించుతోంది. ఏమాత్రం సందేహమున్నా పక్కనబెడుతోంది.

Update: 2024-03-02 16:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల సమరానికి బీజేపీ సిద్ధమైంది. హ్యాట్రిక్ కొడతామనే ధీమాతో ఉన్న బీజేపీ.. ఈసారి 370 సీట్లలో కాషాయ జెండా ఎగరాలనే లక్ష్యంతో ఎన్నికల్లోకి దిగింది. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. గెలుపు గుర్రాలనే బరిలోకి దించుతోంది. ఏమాత్రం సందేహమున్నా పక్కనబెడుతోంది. 195 మందితో శనివారం విడుదల చేసిన తొలి జాబితానే ఇందుకు నిదర్శనం. ఈ లిస్టులో ప్రధాని మోడీ మూడోసారి వారణాసి నుంచి పోటీ చేస్తుండగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి గాంధీనగర్‌ నుంచి బరిలోకి దిగుతున్నారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు మొత్తం 34 మంది కేంద్ర మంత్రులకు తొలి జాబితాలో చోటుదక్కింది. కానీ, ఇదే సమయంలో పలువురు సిట్టింగ్‌లను పార్టీ పక్కనబెట్టింది. వారి స్థానాన్ని మరొకరిని భర్తీ చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే మహిళా ఎంపీ ప్రగ్యాసింగ్ థాకూర్‌కు పార్టీ అధిష్టానం షాకిచ్చింది. ఆమె భోపాల్ స్థానాన్ని అలోక్ శర్మ అనే వ్యక్తికి కేటాయించింది. ప్రగ్యాతోపాటు మొత్తం 10మందికి తొలి జాబితాలో టికెట్ కట్ చేసింది.

తొలి జాబితాలో టికెట్ కోల్పోయిన ప్రముఖులు వీరే..

* భోపాల్ ఎంపీ సాధ్వీ ప్రగ్యాసింగ్ థాకూర్. ఈమె స్థానంలో అలోక్ శర్మ అనే నేతకు టికెట్ ప్రకటించింది.

* కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి. ఈమె న్యూఢిల్లీ నుంచి ఎంపీగా ఉండగా, తాజా జాబితాలో ఇక్కడి టికెట్‌ను బన్సూరి స్వరాజ్‌కు కేటాయించారు. ఈమె కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కూతురు. ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేయనున్నారు.

* సౌత్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ రమేశ్ బిధూరికి అధిష్టానం తొలి జాబితాలో మొండిచేయి చూపించింది. ఈయన స్థానాన్ని రామ్‌వీర్ సింగ్ బిధూరికి కేటాయించింది.

* ఢిల్లీ చాందిని చౌక్ సీటును సిట్టింగ్ ఎంపీ డాక్టర్ హర్ష వర్ధన్‌కు కాకుండా ప్రవీణ్ ఖండెల్వాల్‌కు ఇచ్చింది.

* పశ్చిమ ఢిల్లీ నుంచి పర్వేశ్ వర్మ స్థానాన్ని కమల్‌జీత్ సెహ్రవత్‌‌తో భర్తీ చేసింది.

* మధ్యప్రదేశ్‌లోని విదిశా స్థానంలోనూ సిట్టింగ్ ఎంపీ రమాకాంత్‌ భార్గవకు అధిష్టానం టికెట్ నిరాకరించింది. ఆయన స్థానంలో మాజీ సీఎం శివరాజ్ సింగ్‌ చౌహాన్‌ను బరిలోకి దించింది.

* మధ్యప్రదేశ్‌లోని గుణ స్థానం నుంచి ఇప్పుడు ఎంపీగా ఉన్న క్రిష్ణ పాల్ సింగ్ యాదవ్‌కు కాకుండా కేంద్రమంత్రి, రాజ్యసభ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాకు టికెట్ కేటాయించింది.

* తిరువనంతపురం సిట్టింగ్ ఎంపీ కుమ్మనం రాజశేఖరన్‌కు తొలి జాబితాలో టికెట్ దక్కలేదు. ఆయన స్థానంలో కేంద్రమంత్రి, రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్‌ను పోటీ చేయిస్తోంది.

* గౌతమ్ బుద్ధ నగర్(నోయిడా) ఎంపీగా ఉన్న పంకజ్ సింగ్‌కు టికెట్ నిరాకరించిన అధిష్టానం.. ఆయన స్థానాన్ని మహేశ్ శర్మకు కేటాయించింది.

* బెంగాల్‌లోని అలిపుర్‌ద్వార్ స్థానంలో సిట్టింగ్ ఎంపీ ‘అలిపుర్‌ద్వార్’ను కాకుండా మనోజ్ టిగ్గాను బరిలోకి దింపింది.


Tags:    

Similar News