ఈటల ఇలాఖాలో ఏం జరుగుతోంది..?
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఆలు లేదు సూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా తయారైంది అక్కడ. నాయకులు పోటాపోటీగా సమీక్షలు జరుపుతూ తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు. టీఆర్ఎస్ పార్టీలో హుజురాబాద్ కేంద్రీకృతంగా రాజకీయ సమీకరణాలు జరుగుతున్నాయి. ఇక ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోంది. గంగుల బీజీబీజీ… ఈటల రాజేందర్ ఎపిసోడ్ తరువాత టీఆర్ఎస్ అధిష్టానం తన ప్రత్యేక దృష్టినంతా కూడా హుజురాబాద్ పైనే సారించింది. జిల్లా మంత్రి గంగులకు హుజురాబాద్ […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఆలు లేదు సూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా తయారైంది అక్కడ. నాయకులు పోటాపోటీగా సమీక్షలు జరుపుతూ తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు. టీఆర్ఎస్ పార్టీలో హుజురాబాద్ కేంద్రీకృతంగా రాజకీయ సమీకరణాలు జరుగుతున్నాయి. ఇక ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోంది.
గంగుల బీజీబీజీ…
ఈటల రాజేందర్ ఎపిసోడ్ తరువాత టీఆర్ఎస్ అధిష్టానం తన ప్రత్యేక దృష్టినంతా కూడా హుజురాబాద్ పైనే సారించింది. జిల్లా మంత్రి గంగులకు హుజురాబాద్ బాధ్యతలను అప్పగించడంతో ఆయన అక్కడి కేడర్తో రోజూ సమావేశం అవుతున్నారు. ఇప్పటికే హుజురాబాద్, జమ్మికుంట మండలాలకు చెందిన సెకండ్ కేడర్ తో గంగుల సమావేశం అయి వారిని పార్టీకి అనుకూలంగా మల్చడంలో సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయా మండలాలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈటలకు వ్యతిరేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయనకు దూరం అవుతున్నారు. ఒక్కో అడుగు ముందుకేసుకుంటూ వెళుతున్న మంత్రి గంగుల కమలాకర్ ఈటలను ఒంటరి చేసే ప్రయత్నాల్లో మునిగి పోయారు. ఈటల రాజేందర్కు అత్యంత సన్నిహింతంగా ఉండే హుజురాబాద్ మునిసిపల్ ఛైర్ పర్సన్ గందె రాధిక కూడా తాను అధిష్టానం వెంటే ఉంటానని ప్రకటించారు.
ఈటల ఇంటి వద్ద సందడి…
మరో వైపు శామీర్ పేట్ లోని ఈటల రాజేందర్ ఇంటి వద్ద కూడా సందడి నెలకొంది. ఇల్లందకుంట మండల నాయకులు ఆయన్ని కలిశారు. ఆయన వెంట తాము ఉంటామని ప్రకటించారు. నియోజకవర్గంలోని వివిధ స్థాయిల్లో ఉన్న టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయనను కలిసి అండగా ఉంటామని చెప్తున్నారు. మంత్రివర్గం నుండి ఈటలకు ఉద్వాసన పలికిన తరువాత పెద్ద ఎత్తున కేడర్ ఆయనకు అండగా నిలిచింది. హుజురాబాద్ లో మూడు రోజుల పాటు మకాం వేసినప్పుడు కూడా వివిధ కుల సంఘాలు, పార్టీ కేడర్ అంతా కూడా రాజేందర్ కు సంఘీభావం తెలిపారు. ఇప్పుడు కూడ ఎదో ఒక మండలానికి చెందిన వారు ఈటలను కలిసేందుకు శామీర్ పేట్ వెళ్తున్నారు. దీంతో హుజురాబాద్ లో టీఆర్ఎస్ వర్సెస్ ఈటల అన్న పరిస్థితి తయారైంది.
రాజీనామా చేయక ముందే…
ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తారా లేదా అన్న ఊగిసాలట కొనసాగుతున్న క్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. దీంతో ఒక్కసారిగా నియోజకవర్గంలో పరిస్థితులు ఎన్నికల వాతావారణాన్ని తలపిస్తున్నాయి.