ఒక అభినేత్రి జీవన రేఖ
ఒక అసాధారణమైన జీవిత దర్పణాన్ని అంతే అసాధారణంగా ఆవిష్కరించిన ఉత్తమ గ్రంథం 'స్వయంసిద్ధ'.
ఒక అసాధారణమైన జీవిత దర్పణాన్ని అంతే అసాధారణంగా ఆవిష్కరించిన ఉత్తమ గ్రంథం 'స్వయంసిద్ధ'. సినీ తెరమీద నిలిచే రెండక్షరాల సమ్మోహన శక్తి పేరు రేఖ కాగా ఆ రేఖ సమగ్ర జీవితాన్ని తెలుగు పాఠకులకు అందించిన మూడక్షరాల శక్తి శ్రీదేవి మురళీధర్. యావద్భారత దేశ మహిళా లోకం స్ఫూర్తి ప్రదాతగా ఆరాధించే రేఖ కథకు చివురులు తొడిగిన కలం ఆమెది.
వైజయంతిమాల, పద్మిని వంటి అద్భుత నటీమణుల కోవన దక్షిణాది నుంచి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి కోట్లాది ప్రేక్షకులను రంజింప చేసిన సహజ నటి రేఖ. ఆమె గత 20 ఏళ్లకు పైగా సినిమాల్లో పెద్దగా నటించింది లేదు. సమస్త మీడియా తళుకులకు, ప్రచారానికి ఆమె దూరమై ఇప్పటికి ముప్పై ఏళ్లు. ఇప్పుడామెకు డెబ్బై ఏళ్లు. కానీ ఆమె పేరుకానీ, ప్రస్తావన కానీ లేకుండా ఇప్పటికీ బాలీవుడ్‌కి పొద్దుపోదంటే అతిశయోక్తి కాదు.
బాలీవుడ్ కీకారణ్యంలో సౌందర్య రేఖ
చిన్నతనం నుంచి తమిళ, తెలుగు, తదితర దక్షిణాది చిత్రాల్లో నటించి లేలేత వయసులోనే బాలీవుడ్ కీకారణ్యంలో ప్రవేశించి నిలదొక్కుకున్న సౌందర్య రేఖ ఆమె. చిత్రసీమలో ప్రత్యేకించి బాలీవుడ్‌లో నిలదొక్కుకోవడానికి ఎంత వివక్షను భరించిందో.. అడుగడుగునా అవహేళనలను, మనస్తాపాన్ని వయస్సుకు మించిన సహనంతో భరించిన ధీర ఆమె. నాటికి, నేటికి కూడా దక్షిణాది నటీనటులను అనాగరికులుగా చిత్రించి, ఎద్దేవా చేస్తున్న హిందీ చిత్ర పరిశ్రమ అహంకారులకు ఆనాడే రేఖ అంటే ఒక హెచ్చరిక అయింది.
దక్షిణాది తారల విజయహాసం
నటనా సామర్థ్యంతో, ప్రతిభతో కాకుండా శరీరం రంగులో, శరీర భాగాల కొలతలతో విలువ కట్టే మనుషుల మధ్య ఆ విలువలకు పూర్తి విరుద్ధంగా స్వీయ వ్యక్తిత్వంతో స్థిరంగా నిలబడి నెగ్గుకొచ్చిన మేటి నటి. భారతీయ చిత్ర పరిశ్రమలో మహానటి పేరు సావిత్రికే కాదు రేఖకు కూడా దక్కిందని చెప్పాలి. మధుబాల, నర్గీస్ వంటి బాలీవుడ్ సృజించిన అతి గొప్ప నటీమణులకు కూడా దక్కని కీర్తిని ఈ ఇద్దరు దక్షిణాది తారలే దక్కించుకోవడం ఎంత గొప్ప విషయమో కదా..
పిడుగుపాటు లాగా కోరి స్వీకరించిన దాంపత్య జీవితం కొద్ది నెలల్లోపే అనుకోకుండా చెదిరిపోయి జీవితమే తలకిందులైన దుస్థితిని పదేళ్లు భరించిందామె. తీవ్రమైన ఒంటరితనం, సామాజిక బహిష్కరణ లాంటి స్థితిని అనుభవించిన ఒక స్త్రీ ఎలా తట్టుకుని నిలబడిందో తెలుసుకోవాలంటే ఈ స్వయంసిద్ధ పుస్తకం చదివి తీరవలసిందే.
జీవితాలపై తీర్పులు చెబితే ఎలా?
యాసిన్ ఉస్మాన్ రేఖ జీవిత చరిత్ర గురించి రాసిన పుస్తకానికి శ్రీదేవి మురళీధర్ చేసిన సుమధుర అనుసృజన ఈ స్వయంసిద్ధ. అనువాదమైనప్పటికీ స్త్రీ కోణంలో రేఖను కొత్తగా అర్థం చేసుకుని మూలంలో ఆమెను అవమానించే, తనకు నచ్చని విషయాలను కూడా తొలగించి తీర్చి దిద్దిన పుస్తకం ఇది. రేఖ జీవితం, ఆమె బాల్యం పట్ల దు:ఖం, సానుభూతి ఒకవైపు, ఆమె కృషి, వ్యక్తిత్వం పట్ల గర్వంతో అభిమానం ఒకవైపు నిలిచిన తన్మయత్వంతో ఈ పుస్తకం తెలుగులోకి తెచ్చారీమె. అనువాదం మొత్తంలో ఆమె పెట్టుకున్న గీత ఏమిటంటే ఎవరమూ మరొకరి జీవితాల మీద తీర్పులు చెప్పకూడదనే. జీవితం ఒకే ఒక క్షణంలో అల్లకల్లోలమైన పరిస్థితులను రేఖ ఎలా నెగ్గుకొచ్చిందో దాని ఆధారంగానే ఈ పుస్తకం అనువాదం తయారైంది. ఒక నటి జీవిత చరిత్రను రాయడంలో స్త్రీ పురుష దృక్పథాలలో ఉండే తేడాని ఈ తెలుగు పుస్తకంలో చూడవచ్చు. కానీ ఒక మహిళ జీవిత చరిత్రను మహిళ రాస్తే అందులో ఆవిష్కృతమయ్యే అనుభూతిని మనం ఈ పుస్తకంలో చూడవచ్చు.
కళ్లముందే కలలు చెదిరిపోతే...
ఈ పుస్తకంలోని తొలి రెండు అధ్యాయాలు 'బసేరా', 'బంధ విచ్ఛేదనం' ఆరు నెలల్లోపే రేఖ, ముఖేష్ అగర్వాల్ మధ్య దాంపత్య బంధం ఎలా పటాపంచలయిందో నిరామయంగా విప్పి చెబుతాయి. 1990 మార్చి 4న ఇద్దరి మధ్యా ఏర్పడిన పెళ్లి బంధం అక్టోబర్ 2న ముఖేష్ ఆత్మహత్యతో ఎలా ముగిసిందో ఈ అధ్యాయాలు నిష్పక్షపాతంగా తెలుగు పాఠకులకు తెలిపాయి. ఆరోగ్య సమస్యలను దాచి పెట్టి పెళ్లి కోసం తపించే ప్రతి ప్రయత్నం పురుషుల కంటే స్త్రీల జీవితాలను ఎలా చెదరగొడుతుందో ఈ రెండు అధ్యాయాలూ విప్పిచెప్పాయి. సినిమాలు, నటజీవితం అన్నీ వదులుకుని దాంపత్య జీవితాన్నే ఎంచుకోవాలని ఆమె కన్న కలలు ఎలా మూడునెలల లోపే ఎలా విరిగిపోయాయో చెబుతాయివి.
ఘోరావమానం, సామాజిక బహిష్కరణ
ముఖేష్ ఆత్మహత్యకు ఎన్ని కారణాలున్నా బాలీవుడ్, బాబే, ఢిల్లీ సంపన్న సమాజాలు మొత్తంగా రేఖనే నిందితురాలిని చేసి ఘోరంగా అవమానించాయి. అంతకు ముందే మానసిక సమస్యలతో ఎన్నో సార్లు ముఖేష్ ఆత్మహత్య ఆలోచనలకు లోనయ్యాడనే సత్యాన్ని 30 ఏళ్లుగా ప్రపంచానికి తెలియనీయకుండా చేసిందా సమాజం. ఇంత ఘోరావమానం నుంచి, బహిష్కరణ నుంచి, నిందల నుంచి తట్టుకోవడం మానవ మాత్రులకు సాధ్యం కాదు. ఈ అన్ని విపరిణామాలకు తట్టుకుని నిలబడింది రేఖ. 2004లో సిమీ గరేవాల్ టీవీ షోలో రేఖ చెప్పిన మాటలు ఆమె జీవితాన్ని యధాతథంగా ప్రతిబింబిస్తాయి. 'నేను ఒంటరిని కానే కాదు. నాకు కావాల్సిన వాళ్లు నా ఇంటికి వచ్చి పోతారు. నా అంత అదృష్టవంతులు ప్రపంచంలో లేరు. నాకు కావలసిన విధంగా జీవిస్తున్నాను. కావలసిన చోటికి వెళ్లగలుగుతున్నాను. వెళ్లవద్దనుకుంటే మానుకోగలను. నా మీద ఎటువంటి ప్రతిబంధకాలూ లేవు. నా జీవితం మీద పూర్తి నియంత్రణ కలిగి ఉన్నాను.'
గ్లామర్ శిఖరాగ్రం వరకు ప్రయాణం
చివరగా ఆమె ఉనికిని నిరసించిన సమాజంలోనే తన శరీరాన్ని, వ్యక్తిత్వాన్ని ఏకకాలంలో, అద్భుతంగా మలచుకుని ఒక ఉన్నతమైన గుర్తింపును సాధించింది రేఖ. సాధారణత్వం నుంచి గ్లామర్ శిఖరాగ్రం వరకు ఆమె చేసిన అసాధారణ ప్రయాణం సినీ పరిశ్రమలోనే కాకుండా దాని వెలుపల కూడా ఎందరికో స్ఫూర్తినిచ్చిందని స్వయంసిద్ధ పుస్తకం అనుసృజన కర్త శ్రీదేవి మురళీధర్ రాసిన మాటలు అక్షర సత్యాలు.
బాలీవుడ్‌లో పొడసూపిన కాంతి'రేఖ'
మొత్తం 27 అధ్యాయాలుగా రూపొందిన 'స్వయంసిద్ధ' పుస్తకం బాల్యం నుంచి ఇప్పటిదాకా రేఖ 50 సంవత్సరాల నటజీవితంలో ఆమె చూసిన ఎత్తుపల్లాలు, అనుభవించిన అవమానాలు, ఎదుర్కొన్న వివక్ష, తూట్లు పొడుస్తున్న సమాజంపై సాటిలేని గుండె ధైర్యంతో ప్రదర్శించిన ధిక్కరణను అక్షరాక్షరంగా వివరించింది. ఆకలిదప్పులతో అలమటించిన బాల్య జీవితం నుంచి సినీ పరిశ్రమను మొత్తంగా తనవైపుకు తిప్పుకున్న నటిగా ఆమె ఎదుగుదలను, ఉమ్రావ్‌జాన్ సినిమాలో నటిగా ఆమె సాధించిన పరిపూర్ణతను వివరించిన సర్వ సమగ్ర దర్శనం 'స్వయంసిద్ధ' బాలీవుడ్ చీకటి వెలుగుల మధ్యే పొడసూపుతున్న కాంతి'రేఖ'లను గురించి తెలుసుకోవడానికి ఈ పుస్తకం కంటే మించింది మరొకటి లేకపోవచ్చు.
ప్రతులకు
స్వయంసిద్ధ - ఒక అభినేత్రి జీవనరేఖ
తెలుగు సేత : శ్రీదేవీ మురళీధర్
'రేఖ- ది అన్‌టోల్డ్ స్టోరీ'కి అనుసృజన
పేజీలు : 250
వెల: 350
ప్రచురణ: వంగూరి ఫౌండేషన్, అమెరికా
శ్రీదేవి మురళీధర్
99081 32166
పరిచయకర్త
రాజశేఖరరాజు
73964 94557