సినిమా చరిత్ర కరదీపిక
భారతీయ చిత్రపరిశ్రమను, అంతకుమించి సంపూర్ణ దక్షిణ భారత సినిమా పయనించిన తొలి అడుగులను, 90 సంవత్సరాలకు పైగా మన సినిమా
భారతీయ చిత్రపరిశ్రమను, అంతకుమించి సంపూర్ణ దక్షిణ భారత సినిమా పయనించిన తొలి అడుగులను, 90 సంవత్సరాలకు పైగా మన సినిమా చరిత్రను పరామర్శించిన నిరుపమాన గ్రంథం 'మన సినిమా ఫస్ట్ రీల్'. సినిమా చరిత్ర పరిశోధక రాక్షసుడు, సీనియర్ జర్నలిస్టు మిత్రులు రెంటాల జయదేవ చేసిన పాతికేళ్ల సినీ పరిశోధనా కృషి ఫలితం ఈ పుస్తకం. ఒక బృహత్ సినీ పరిశోధనా గ్రంథమిది. ఈ గ్రంథాన్ని తడిమి చూసిన వారెవరైనా సరే... మన సినిమా చరిత్రను తేలికగా తీసుకోవడం ఇక అసాధ్యం.
90 సంవత్సరాలకు పైగా భారతీయ మూకీ, టాకీల చరిత్ర పొడవునా మనం చాలా సులువుగా మర్చిపోయిన, మర్చిపోతున్న అపూర్వ సినీ విశేషాలను పరిపూర్ణంగా సశాస్త్రీయంగా, ఆధార సహితంగా వెల్లడించిన గొప్ప రచన ఇది. దశాబ్దాల పొడవునా భారతీయ చిత్రరంగం సృష్టించిన కమనీయ చరిత్రను ఇంత మహత్తరంగా మన కళ్లముందు ఉంచిన పుస్తకం మరొకటి లేదని చెప్పడానికి సాహసిస్తున్నాను.
చిత్ర పరిశ్రమ చరిత్ర విశ్వరూపం
మిత్రులు జయదేవ్ భారతీయ చిత్రపరిశ్రమ చరిత్రపై తుఫాన్ లాంటి రచనతో వచ్చారు. తెలుగు సాహిత్య చరిత్రకారులకు సినిమా సంగతి పట్టలేదేం మనదైన సినిమా చరిత్రను ఇంతగా ఎందుకు విస్మరిస్తున్నారు అనే ప్రశ్నతో బయలుదేరిన జయదేవ్, మన చిత్ర పరిశ్రమ చరిత్ర విశ్వరూపాన్ని 570 పేజీలలో పెట్టి రేపటి చరిత్ర కోసం అందించారు. బాల్యంలో విజయవాడ హాల్స్‌లో తాను చూసిన వందలాది సినిమాలు, ప్రీమియర్స్ వీక్షణ ద్వారా పరిచయమైన చిత్ర పరిశ్రమ దిగ్ధంతుల సాంగత్యం, తర్వాత ఇండియా టుడే తెలుగు వార పత్రికలో రెండు దశాబ్దాలపాటు పనిచేసి సినిమాలపై సమీక్షలు, కథనాలు రాసిన విశేషమైన అనుభవం, సినిమా చరిత్రను ఆపోశన పట్టిన అద్వితీయ కృషికి, అరుదైన పరిశోధనకు అక్షరరూపం ఈ 'ఫస్ట్ రీల్'.
తెర వెనుక కథ ఏమిటి?
పాతికేళ్ళ పరిశ్రమతో వెలికితీసిన కొత్త అంశాలు... సినీ చరిత్రను మలుపు తిప్పే సరికొత్త సంగతులు.... శోధించి, సాధించి, సేకరించిన సాక్ష్యాధారాల సమాహారం 'ఫస్ట్ రీల్. మూకీల నుంచి టాకీల దాకా శతాధిక వసంతాల భారతీయ సినిమా పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి తొలి భారతీయ టాకీ 'ఆలమ్ ఆరా' తెర వెనుక కథ ఏమిటి? మనం వదిలేసిన మన తెలుగు సినిమా 'కాళిదాస్' చరిత్రేమిటి? వెండితెరపై వినిపించిన తొలి తెలుగు సినిమా పాటలు అచ్చమైన త్యాగరాయ కీర్తనలా? ఆఖరిరోజుల్లో అష్టకష్టాలు పడ్డ తొలి టాప్ హీరోయిన్ ఎవరు? తొలి పూర్తి తెలుగు సినిమా 'భక్త ప్రహ్లాద' అసలు రిలీజు తేదీ ఏమిటి? అలా ఎనభయ్యేళ్ళ తెలుగు సినీ చరిత్రను మార్చేసిన రెంటాల జయదేవ పరిశోధన ఏమిటి? పూర్తి టాకీల్లో తెలుగు తర్వాతే తమిళమని తెలుసా దక్షిణ భారతీయ టాకీ పిత హెచ్.ఎం. రెడ్డి కథ ఏమిటి? తొలి కన్నడ టాకీ తీసింది తెలుగువాడేనని తెలుసా? మలయాళ సినీ ఆరంభ, వికాసాలేమిటి? మన పాత్ర ఏమిటి? ఎన్నో ప్రశ్నలకు ఒకటే సమాధానంగా.. 2 వేలకు పైగా అపురూప ఛాయాచిత్రాలు... మనం చూడని అలనాటి పత్రికా ప్రకటనలు.. ప్రత్యక్ష సాక్షులైన ఆనాటి ప్రముఖుల ఇంటర్వ్యూలు.... ఆర్కైవ్స్ నుంచి తవ్వితీసిన అరుదైన సమాచారంతో... సమగ్ర పరిశోధన రెంటాల జయదేవ 'ఫస్ట్ రీల్'. సంపూర్ణ దక్షిణ భారతీయ సినిమా తొలి అడుగుల రికార్డుగా... అసలుసిసలు చరిత్రగా... సినిమా పుస్తకాల్లోనే ఈ 'ఫస్ట్ రీల్' అపూర్వం... అత్యంత ప్రామాణికం... ఆసక్తికరం. అందరూ కొని చదవాల్సినది... అల్మారాలో పదిలంగా దాచుకోవాల్సినది.
మన పరిశోధన శాపగ్రస్తం
రచయిత స్వయంగా చెప్పుకున్నట్లు, ఈ పుస్తకంలోని అరుదైన వ్యాసాల కూర్పు కోసం మద్రాస్, హైదరాబాద్, రాజమండ్రి, వేటపాలెం, పుణే, బొంబాయి, ఢిల్లీ.. ఇలా తాను తిరగని చోటు లేదు. వెతకని లైబ్రరీ లేదు. ఎన్నో నిద్రలేని రాత్రులు, నిశ్శబ్ద సాయంత్రాలు సరైన సమాచారం దొరకక నీరసపడ్డ రోజులు.. గ్రంథాలయాల దీనస్థితి, ఆర్కైవ్స్ లోని అరుదైన సమాచారాన్ని సైతం తస్కరించిన మన పరిశోధకుల చేతివాటం, పని చేయని మైక్రో ఫిల్మ్ రీడర్లు, అతి దారుణమైన బ్యూరోక్రసీ, రోజుల తరబడి నిరీక్షణ.. ఇన్ని కష్టాల మధ్య ఈ దేశంలో సిన్సియర్‌గా పరిశోధన చేయడం కూడా శాపమేనని రచయిత ఖండితాభిప్రాయం.
పాతికేళ్ల పరిశోధనా కృషికి ప్రతిఫలం
రచయిత దశాబ్దాల శ్రమను, కన్నీళ్లను పక్కన బెట్టి చూస్తే, కాపీ టేబుల్ బుక్‌లాగా మనం జీవితం చివరిదాకా దాచుకుని భద్రపర్చుకోవలసిన సినీ జ్ఞాన కరదీపిక ఇది. సినిమా గురించిన మన పరిజ్ఞానాన్ని ఖచ్చితంగా పెంచగల రచన ఇది. అనాలోచితంగా, అప్రామాణికంగా, గతానుగతికంగా సినిమా గురించి మనం నమ్ముతున్న, లేదా చెప్పుకుంటూ వస్తున్న అనేక అసత్యాల బండారాన్ని బట్టబయలు చేసిన గ్రంథం ఇది. పాతికేళ్ల నిరంతర పరిశోధనా కృషిలో రచయిత జన్మ సార్థకం చేసిన మేటి పుస్తకం 'ఫస్ట్ రీల్'.
కళ్లముందు రీళ్లు తిరిగిన గతం
ఈ పుస్తకానికి రచయితతో పాటు మరో నలుగురు ప్రముఖులు రాసిన 35 పేజీల నిడివి లోని ముందుమాటలు మన సినిమా చరిత్రను ఎందుకు చదవాలో తెలిపే గొప్ప పాఠాలు. ఒక మూకీ సినిమాతో సహా హిందీలో, దక్షిణాది భాషలన్నింటిలో సినిమాలు రూపొందించిన జగమెరిగిన అలనాటి దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 'కళ్లముందు రీళ్లు తిరిగిన గతం' పేరుతో రాసిన ముందుమాట 90 ఏళ్ల మన సినిమా చరిత్రను విప్పి చెప్పింది. మొదట బాంబేలో పుట్టిన భారతీయ సినిమా తర్వాత దక్షిణ భారతదేశంలో ఎలా అంకురించి, ఎదిగింది వంటి చాలా సూక్ష్మ వివరాలతో జయదేవ మనముందుంచారని, ఒక్కమాటలో చెప్పాలంటే తాము తీసిన సినిమాలకంటే వంద రెట్లు ఎక్కువ ఉత్సుకతతో కూడిన రచన చేశారని రచయితకు ఇచ్చిన కితాబు ఒక్కటి చాలు 'మన సినిమా.. ఫస్ట్ రీల్' పుస్తకం గొప్పదనాన్ని చెప్పడానికి.
సినిమా చరిత్రపై పరిపూర్ణ జ్ఞానం
దాదాపు 570 పేజీలతో, 2 వేలపైగా సినీ ఇమేజీలతో తటిల్లున మెరుస్తూ మన ముందుకొచ్చిన 'మన సినిమా ఫస్ట్ రీల్' పుస్తకం మన వద్ద లేకుంటే భారతీయ, దక్షిణాది సినిమా శతాబ్ది చరిత్రపై మనకున్న అవగాహన ఇక ఎన్నటికీ సంపూర్ణం కాదని మాత్రమే చెప్పగలను. సినిమా చరిత్రపై మన జ్ఞానాన్ని పరిపూర్ణం చేయగలిగిన చేవ గల పుస్తకం. 'మన సినిమా ఫస్ట్ రీల్' పుస్తకం కలిగించే మహదానుభూతిని ఎవరైనా స్వయంగా అనుభూతి చెందాల్సిందే మరి. పెట్టిన ప్రతి పైసాకూ రెట్టింపు విలువను ఇవ్వగల ఈ పుస్తకాన్ని ప్రతి సినీ ప్రేమికులూ హృదయంలో పొదవుకోవలసిందే. భారతీయ సినిమా చరిత్ర రచనలో ఇలాంటిది నభూతో... అని మాత్రమే చెప్పగలం.
పుస్తకం: మన సినిమా ఫస్ట్ రీల్
రచయిత: రెంటాల జయదేవ
పేజీలు 570 (వందలాది అపురూప చిత్రాలతో సహా)
వెల: రూ. 750
ప్రచురణ: ఎమెస్కో బుక్స్ ప్రై. లిమిటెడ్
అన్ని ఎమెస్కో బుక్ స్టాల్స్‌లో, ఆన్లైన్‌లోనూ లభ్యం.
సమీక్షకులు
రాజశేఖరరాజు
73964 94557