వదిలి వెళ్ళిపోయిన ఏడాది కాలం
నేను సూర్యచంద్రులతో కలసి
ఏకాంత విరామాల మధ్య
పెనుగులాడుతూనే వున్నాను
కలలు చిగురు పెట్టే దశలో
ఒంటరి పర్వతాల మీద మంచు కురిసినట్లే
నిశిరాత్రి నెమ్మదించే సమయంలో
గట్టిపడిన గుండె గోడలు
ఒంటరిగీతం పాడుకుంటున్నాయి.
నిజాల్ని దారుణంగా తరిమేస్తూ
ఆవేదనపు నదిలో కలిసి
మూడు గదుల మౌనముద్రల మధ్య
జీవితం యథాతథంగా నడుస్తోంది..
యుద్ధమంటే శబ్ధం అనుకోవడం పరిపాటి
కానీ..అంతర్యుద్ధ ఆగ్రహావేశాల మీద
లక్షలాది లాక్షణికుల
కన్నీటి ప్రవాహాలు చూడవచ్చు..
ఎక్కడైనా చూడండి..
కష్టజీవులు అలవోకగా పాడగలరు
గతకాలపు కళాకారులు, రాజ్యాధికారులంతా
మట్టిలో కలిసిపోయినా
ఇపుడున్న తరాలు అలాంటివే!
అనుకుంటాం కానీ
నిశ్శబ్ధానికి, ఏకాంతానికి అక్షరాలే ఆనవాళ్ళు..
రెంటినీ భరించే హృదయానికే లిపి లేదు.
-శైలజామిత్ర