సాహితీ ప్రక్రియలలో సమాదరణ కలది 'వ్యాసం' చూపునకు సులభంగా కనిపించినా, రాయడంలో అనుకున్నంత సులభం కానే కాదు అన్నది నిజం. ఇటువంటి ప్రక్రియను ఎంచుకుని తన సాహితీ అనుభవం అధ్యయనం జోడింపులతో 27 సాహితీ వ్యాసాలను 'లహరి' పేరిట సంపుటిగా ప్రచురించారు చామర్తి అరుణ. 19 వ్యాసాలు అచ్చంగా తెలుగు సాహితీ మూర్తుల జీవితం, సాహిత్యం, వంటి వివరాలు వెల్లడి చేయగా, మరో ఎనిమిది వ్యాసాలు గిరిజన తెగలు, జానపద భిక్షుకులు, ఎల్లమ్మ, రేణుక , కొర్రాజుల కోపు తదితర జానపద పరిశోధనలకు చెందిన ఆసక్తిదాయకమైనవి.
వ్యాసం అంటేనే విషయ ప్రాధాన్యత సంతరించుకొని లోతైన చూపుతో తెలియని నూతన అంశాలు వెల్లడించడం, అక్షరాలా అరుణ చేసిన కృషి అలాంటిదే. వ్యవహారిక తెలుగు భాష ఉద్యమకర్త గిడుగు రామ్మూర్తి జన్మ తేదీని అక్కిరాజు రమాపతిరావు, గిడుగు సీతాపతిరావు వేరువేరుగా ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ పరిశోధకులకు పని చూపించారు. రాయప్రోలు వారి జీవిత విశేషాలు వివరిస్తూనే వారి గురించి విశ్లేషణ సూక్ష్మంలో మోక్షంగా చక్కగా చేశారు. మరో వ్యాసంలో ఆయనలోని అమలిన శృంగార భావాలను ఆవిష్కరిస్తూ ప్రేమ పవిత్రత గురించి అందంగా ఆవిష్కరించారు.
ఇక ప్రాచీన కవులు శ్రీనాథుడు, పోతన సాహిత్య శ్రమను వైభవాన్ని సరళమైన భాషతో ఆవిష్కరించే ప్రయత్నం చేసి విజయం సాధించారు. ఆధునిక తరానికి చెందిన శ్రీశ్రీ మొదలు రాళ్లబండి వరకు గల తెలుగు సాహితీమూర్తుల అక్షర కృషిని ఆసక్తిదాయకంగా, విజ్ఞానాత్మక విషయాల మేళవింపుతో వివరించారు. జానపద సాహిత్య వ్యాసాల విషయంలో కూడా అరుణ అక్షర కృషి, లోతైన పరిశీలన, స్పష్టమవుతాయి.
ఎల్లమ్మ, జమదగ్ని భార్య రేణుక ఇద్దరు ఒకటేనా? అంటూ, జానపదుల కథలను ఉటంకిస్తూ చివరికి ఇద్దరూ ఒక్కరే అనే అభిప్రాయంతో ముగిస్తారు. రామాయణంలోని జాంబవంతునికి, జానపదులు సృష్టించుకున్న జాంబ పురాణం'లోని జాంబవంతునికి సంబంధం లేదంటారు. 'డక్కలి' అనే పేరు ఎలా వచ్చిందో, దానికి జాంబవంతునికి గల సంబంధం సమగ్రంగా అందించారు.
'పెరిక' కుల ఆవిర్భావం, జానపదుల మాత్రారాధనలో గల గ్రామదేవతల వివరాలు, గిరిజనుల జానపద గాథ 'పద్మనాయక వృత్తాంతం' గురించి సమగ్రంగా ఆవిష్కరించారు. ఇందులో ప్రతి వ్యాసం పరిశోధకులకు ఒక ఆలోచన కిరణంగా ఉంటుంది అనడంలో అతిశయం లేదు.
ప్రతులకు:
చామర్తి అరుణ
2-2-143, 2ఎ, భద్రకాళి టవర్స్
నయీంనగర్, హన్మకొండ- 506 001
90006 83826,
పేజీలు: 124, ధర రూ.100
సమీక్షకులు
డా. అమ్మిన శ్రీనివాసరాజు
7729883223