ఆధునిక కాలంలో అభ్యుదయ తెలుగు సాహిత్యంలో సమాజ హితం కోసం రాసే కవితలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈలాంటి సాహిత్యం రాయాలంటే మొదటగా కవి హృదయంలో సమాజాన్ని ప్రేమించే గుణం ఉండాలి, వారి కష్టాలను తనవిగా భావించే విశాల మనస్తత్వం కలిగి ఉండాలి. ఎదుటి వారి కన్నీళ్ళని తన హృదయంలో నింపుకోగలగాలి. అప్పుడే ఆ కవి తన కలం ద్వారా అక్షర సైనికుడై సమస్యల వలయంలో ఉన్న వారిని రక్షించడానికి బయలుదేరుతాడు. అలాంటి అభ్యుదయ, విప్లవ కవిత్వం రాస్తున్న కవి దొంతం చరణ్. "ఊహ చేద్దాం రండి" అంటూ తన రెండో కవితా సంపుటితో మన ముందుకు వచ్చాడు.
ఈ పుస్తకాన్ని చెరబండరాజుకి,వరవరావుకి, జననాట్యమండలికి అంకితం ఇచ్చాడంటేనే అర్థం చేసుకోవచ్చు, కవి హృదయాలోచన ఏంటని, తాను ఎటు వైపు అడుగులు వేస్తున్నాడో అని. రాసే అక్షరాలన్నీ పీడితవర్గం వైపే పయనించేలా, తన కలం సిరా చుక్కల పిడికిళ్లు జన కోసం అని కవి చరణ్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు తన కవిత్వంలోకి వెళ్దాం.. "ఊహ చేయడమే హెచ్చరిక" కవితలో..
వరిగింజల్లో పిడికిళ్లున్నాయని/ రాలుతున్న వరిపొట్టులోంచి / పిట్టలు పైకెగురుతున్నాయని/ సృజన చేసిన మెదళ్లను కూల్చడానికి/ ఏ బుల్డోజరూ సరిపోదు ప్రస్తుతం మనం చూస్తున్నాం బుల్డోజర్ సంసృతిని. అది చేస్తున్న వినాశానాల్ని. కానీ ఆలోచన చేసే మెదడులను బుల్డోజర్ ఎలా కూల్చగదు? శ్రమజీవుల కోసం పోరాడే మెదళ్లకు ఎప్పటికి చావు లేదు. విశ్వశ్రేయస్సు కోసం తహ తహలాడే మండే సూర్యుడు, వెలిగే చంద్రునికి అంతమెలాగూ లేదో అదేవిధంగా ప్రజా పోరాట యోధులకు కూడా లేదని చెప్పవచ్చు. పైన ఉన్న కవిత్వపాదాలు జి.ఎన్. సాయిబాబాకి, గ్రాంసీ, వరవరావు, లియొనార్డ్ పెల్టియార్‌కి సరిగ్గా సరిపోతుంది. వారిని జైల్లో పెట్టగలిగారే కానీ వారి ఆలోచనలను జైలు గోడల మధ్య బంధించలేకపోయారు.
వివక్షపై సంధించిన కవిత
అదే విధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 'కోల్' తెగకు చెందిన ఆదివాసీపై కుల వివక్షతో అతని మీద మూత్రం పోసిన వ్యక్తి గురించి చెప్పుతూ హృదయాలపైన / ఉచ్చపోసే వాడికేం తెలుస్తుంది / ఊపిరి పరిమళమేమిటో అని చెబుతూ రైతుల మీద ఉచ్చ పోసే అగ్రవర్గాలకి అన్నం ముద్దలో చందమామలెలా కనిపిస్తాయంటూ వారి మానసిక స్థితిని తెలియజేస్తూ ఆదివాసులంటే అడవి బిడ్డలని, వారికి భూగోళమంతా ప్రేమ ఉంటుందంటూ ఆదివాసులకు మద్దతు తెలిపే కవిత ఇది.
చరణ్ కవిత్వం అర్థం చేసుకోవాలంటే కొంచెమైనా గుండెల్లో బాధని దిగమింగి ఉండాలి లేదా నలుగురి కన్నీళ్లను తుడిచే మనస్తత్వం ఐనా కలిగి ఉన్నపుడే కవిలోని ఆవేదనను, అంతర్గత సంఘర్షణను చూడగలుగుతాము. ప్రపంచంలోని ఎక్కడైనా మనిషి అన్యాయానికి గురైతే అక్కడినుండే కవి కలం నుండి అక్షర యాత్ర మొదలవుతుంది. "నా భాష" కవితలో ఇలా చెపుతున్నాడు తన కవిత్వం ఎలా రాస్తాడు అనేది నిశ్శబ్దం నా భాష కాదు/ గాలిలో దీపం నా భాష కాదు/ కొడవలితో రాస్తాను కవిత్వం.../ ఇలా సాగుతుంది చరణ్ కవిత్వం.
అన్యాయంపై గురితప్పని ఈటె
తన కలం ఊరికే నిశ్శబ్దంగా ఉండదు, ప్రశ్నిస్తుంది, నిరాశ్రయులకు అండగా ఉంటుంది. జరిగిన సంఘటనను సృజనాత్మకతను జోడించి కవితగా మలిచి ప్రపంచం మీదికి గురితప్పని ఈటలుగా వదులుతాడు, అన్యాయాలను తన కవిత్వం ద్వారా బద్దలు కొడతాడు. తనలో రగిలే వేలాది ప్రశ్నలతో సమాజాన్ని నిలదీస్తాడు. "Poetry is the shortest way of saying something. It lets us express a dime’s worth of ideas, or a quarter’s worth of emotion, with a nickel’s worth of words." John P. Grier. చెప్పినట్టు భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి కవిత్వం ఒక బలమైన సాధనం. అందుకే చరణ్ తాను కవిత్వాన్ని సాధనంగా చేసుకొన్నాడు.
ఈ పుస్తకం నిండా బలమైన గొంతుకై బాధితుల పక్షాన నిలబడ్డాడు, ప్రజావ్యతిరేక పాలనపై తనదైన రీతిలో నిస్సంకోచంగా నిర్భయంగా కవితలు రాసిన తీరును ఎంతో అభినందించవలసిందే. మునుముందు ఇంకా అనేక సాహితీ సంకలనాలు వెలువరించాలని అభిలాషిస్తూ...
పుస్తకం : ఊహ చేద్దాం రండి
కవి : దొంతం చరణ్
పేజీలు : 112
వెల: రూ. 100
ప్రతులకు: 90002 15466
లభ్యం: అన్ని ప్రచురణ సంస్థలు
సమీక్షకులు
గాజోజి శ్రీనివాస్.
99484 83560