భళ్లున తెల్లవారిందో లేదో
ఘాతుకాల పుటలు కళ్లముందు
శత్రువెవరో.. మిత్రుడెవరో..
బంధువెవరో.. రాబంధువెవరో..
ఊసరవెల్లుల్లా క్షణం క్షణం
రంగులు మార్చుకుంటూ..
రాజ్యాలను ఏమార్చుకుంటూ..
కుబుసాలు వొదులుతూనే వున్నారు
యుద్ధాలే దోపిడైనప్పుడు
బ్రతుకోక సంధి కార్యమవుతోంది
బానిసత్వం ఏడుతరాల పీడ
నువ్వు నేను మనందరం
ఎన్నో నిట్టూర్పుల్ని వదులుతూనే
మరణశయ్యపై నిరీక్షణ
రేపటి సూర్యోదయం కోసం
మనిషి తనమంతా మృగ్యమైన చోట
మానవత్వాన్ని వెతకటం
వెర్రిబాగులతనమే కదా..
ఆర్థిక పరంపరల మధ్య
అనుబంధాలన్ని పేక మేడల్లా
కూలిపోతుంటే కుల్లిపోతుంటే
హృది గూళ్ళు ఎలా కట్టుకోవాలో
మది వత్తిళ్ళు ఎలా తట్టుకోవాలో
కాలం కోళ్లు కూస్తున్నాయి చూడు..!
డా. కటుకోఝ్వల రమేశ్
99490 83327