నేలకు
ఎప్పుడు ఏది అవసరమో
చినుకుకు ఇట్టే తెలిసిపోతుంది
చెట్టుకు
చిరాయువు చినుకే అని
ఆకాశం ఇట్టే మబ్బుల్ని కమ్మేస్తుంది
ఏ ఆశలకైనా
చినుకే చిరునామగా నిలిచి
కొంత చరిత్రను లిఖిస్తుంది
ఆకలి కేకలకూ ఇంత బువ్వను సృష్టిస్తూ
చినుకే చిరస్థాయిగా నిలిచి నడిపిస్తుంది
చినుకు మాట్లాడుతుంది
కాడికీ, కర్షకుడికీ
వారధిలా నిలిచి
బతుకు పువ్వుల్ని గుభాలిస్తుంది
నిర్వీర్యం అయిన నది
చినుకు చేరికతో
నాలుగు పాదాలతో నడిచి
నింపాదిగా నవ్వుతుంది
శ్రమ చేతులకు
చినుకు తోడైతే
నేల నవ్వి , పంటలు ప్రమిదలై
సగటు బ్రతుకుల్లో
వెలుగులు విరజిల్లుతుంటే
శ్రమజీవితో చినుకు చుక్క
నిత్యం మాట్లాడుతూనే ఉంటుంది...!!
మహబూబ్ బాషా చిల్లెం
95020 00415