'మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ జనునె తరంగిణులకు
లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల జేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం బరుగునే సాంద్ర నీహారములకు
అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త
చిత్తమే రీతి నితరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల'
ప్రఖ్యాత చరితుడా! వినవయ్య నా మాట. ఎన్నో మాటల్లో చెప్పటం అనవసరమయ్య. ఎవని నాభి యందు సృష్టికర్త పుట్టిన పద్మం జనించిందో ఆ విష్ణుదేవుని దివ్యమైన పాదపద్మాలను ధ్యానించటంలోనే, ఆ అమృతం ఆస్వాదించటంలోనే సదా పరవశిస్తు ఉంటుంది నా మనస్సు. మరి మందార పూల మకరందంలోని మాధుర్యం మరిగిన తుమ్మెద ఉమ్మెత్తపూల వైపు పోదుగదా. స్వచ్చమైన ఆకాశగంగా తరంగాలపై విహరించే రాజహంస వాగులు, వంకల దరి చేరదు కదా. తియ్య మామిడి లేత చిగుర్లు తిని పులకించి పాటలుపాడే కోకిల కొడిసిచెట్ల పైకి వెళ్ళదు కదా. నిండు పున్నమి వెన్నెలలో విహారాలు చేసే చకోర పక్షి దట్టమైన మంచు తెరల మాటుకి పోదుకదా. అలాగే ఇతర విషయాలపైకి నా చిత్తం వెళ్లదు సుమా!
'పలికెడిది భాగవతమట
పలికించు విభుండు రామభద్రుండట నే
పలికిన భవహరమగునట
పలికెద వేరొండు గాథ పలుకగ నేలా!
భాగవతం తనంతట తనే పలుకుతుంది. నేను సాధనం మాత్రమే. భద్రత ఒసగేవాడు భగవంతుడు శ్రీరాముడే పలికిస్తుంటే చిలకలా నే పలుకుతా అంతే. స్వయంభూగా పలకబోతున్న సాక్షాత్ భగవత్ స్వరూపం వ్యక్తం కావటంలోని నిమిత్త పాత్రత మోక్షాన్ని ఇస్తుంది కదా. అంతకన్నా కావలసిందేం ఉంది. అందుకే మిగతావన్నీ పరిత్యజించేస్తాను. ఈ పని మాత్రమే చేస్తాను.
- పోతన భాగవతము నుంచి