నుదిటిపై కసిని రాసారు వాళ్లు
అర్వాచీన లిపిలో నిన్న
ఇవ్వాళ వెతుక్కున్న కళ్లేమో
రక్తం కారుస్తున్నాయి
మెడబట్టి గెంటుకుంటున్న దేహాల మధ్య
పాలకులు పంచనామా చేసారు ఎప్పుడో
సిల్హౌట్‌లో పారిపోతున్న కేకలు
ఆయుధాల్లో వెంటాడుతూ వస్తున్న
దెబ్బల చావుల చరిత్ర ఆకారాలు
ఏడుపుల గాయాల గతం
ఆక్రోశ నిశ్శబ్ద దృశ్యాలై అన్నీ
పడిగాపులు గాస్తున్నట్టు
ఒక రైలుకట్ట మీద
ఎదపై రెండు మురికి చేతులు
కంపిస్తూ కలగంటున్నాయి
సూర్యుడు కొమ్మలమధ్య
కనురెప్పలను పొడుస్తూ
పొగలేపుతున్న ఎండ చిత్రాల్లో
క్షణికాలను తలపిస్తూ
చిన్న ప్రమాదాల నుంచి
భీకర యుద్ధాల దాకా ఇప్పుడిప్పుడే
భాష్యం అవగతమవుతున్న
ఆ బిగబట్టిన పెదాలకు
ఇంకా దాహపు ఏకాగ్రత ఎక్కువవుతుంది
పదార్థం లోపలికెళ్తూ ఎప్పుడూ
భావాలు కల్లోలం లేపుతూ ఎప్పుడూ
వ్యథలను ప్రసవించాయనుకుంటున్న
ఆ అపార్థపు రక్తమాంసానికి
వేరే ఊపిరి అవసరం కచ్చితంగా
అది ఎంతదూరం పోయినా
ఇదే గతితో ఉంటే మాత్రం
పరిణామం చేసేదేముంది
అసంతృప్తి ఖుషీని
సంతృప్తి కృషిలో వెతుక్కుంటూ
ఇంకా ఇంకా వెళ్ళడమేనేమో..!!
- రఘు వగ్గు
9603245215