తెలుగు సాహితీ మాగాణంలోకి తరలివచ్చిన అనేక అన్యదేశ ప్రక్రియల్లో "నానీ" ఒకటి, వచ్చిన వేళా విశేషమో!! చేరదీసి పెంచి పోషించిన వాటి నాన్న గోపి గారి కృషి ఫలితమో!! కానీ తెలుగులో ప్రాచుర్యం పొందిన పరదేశి ప్రక్రియలన్నిటిలో నానీలది అగ్రస్థానమనడంలో అతిశయం ఎంత మాత్రం లేదు. ప్రక్రియలోని ప్రతిష్ట, వాటిని వ్రాస్తున్న వారిలోని ప్రతిభల సాయంగా ఇవి దినదిన ప్రవర్థ మానంగా వర్ధిల్లుతున్నాయి. మినీ కవిత్వంకు మించిన సౌలభ్యం పాఠకులకు ఇందులో ఉంది. అంతేకాక చివరిగా కనిపించే మెరుపు చదివిన వారికి బోలెడు సంతృప్తిని పంచుతుంది.
ఇక ఈ వర్ధమాన నానీల కవయిత్రి లహరి "నానీల తీరాన" ఆవిష్కరణకు చేసిన అక్షర కృషి అంతా ఇంతా కాదు...!! కారణం నానీల నాన్నగారు స్వయానా పెదనాన్న కావడం. అంతటి అంకుఠిత అధ్యయనం వల్లే తొలి ప్రయత్నంలోనే అద్వితీయమైన నానీలను అందించగలిగారు. లహరి కవనక్షేత్రంలో కవయిత్రిగా పాదం మోపి "అక్షర నేత్రాలు" అందించి "నానీల తీరాన" చేరింది. ఇందులోని వస్తువులన్నీ సామాజిక, మానవ, సంబంధాలకు చెందినవే విషయాలు కొత్తవేమి కాదు. కానీ పాత విషయాలనే కొత్తగా అందించడంలో తనదైన సృజన జోడించి ఉత్తమోత్తమ నానీలు పండించడంలో శత శాతం విజయం సాధించింది. విద్య యొక్క విశిష్టతను ఆవిష్కరిస్తూ సాహిత్యానికి అన్వయించుకుని విలువైన వజ్రాల కన్నా విద్య గొప్పది అని చెబుతుంది.
సుతిమెత్తని చురకలు వేస్తూ..
పల్లె గాలి/ పులకింపజేస్తుంది/ అచ్చం అమ్మ చేతిస్పర్శలా... అంటూ పల్లెల పారవశ్యాన్ని చెబుతూ.. ‘పల్లె తల్లి వంటిది పట్టణం ప్రియురాలు లాంటిది’ అన్న కృష్ణశాస్త్రి మాటలు గుర్తు చేస్తుంది. తనదైన నవ్య నానీ ద్వారా, "ప్రయత్నిస్తే ప్రతి విద్యార్థి ప్రతిభావంతుడే" అన్న చందంగా ప్రశ్నించడం ద్వారానే ప్రతిభ రాణిస్తుంది అనే చక్కని సందేశాన్ని భావితరం విద్యార్థి లోకానికి అందిస్తూ.. ఇప్పుడతడు /గొప్ప శాస్త్రవేత్త/ మరి బాల్యంలో/ క్వశ్చన్ బ్యాంక్, అంటూ భలే చమత్కరిస్తారు. తాను ఎన్నుకున్న అనేకనేక సామాజిక అంశాలలో రాజకీయాలను సైతం వదలకుండా అటు పాలితులకు ఇటు పాలకులకు చక్కని చురకలు వేశారు లహరి.. ఏకులా వచ్చి మేకులా తయారయ్యాడు అన్న పాతకాలపు సామెతను గుర్తు చేస్తూ.."ఒకే ఒక్క ఛాన్స్/ నేతల వేడుకోలు/ గెలిచాడా/ చచ్చేదాకా అతడే" అంటూ ప్రస్తుత ఆధునిక రాజకీయాల్లోని కుళ్ళు కుటుంబ పాలనలను ఎండగట్టారు. పుట్టుకకు చావుకు మధ్య గల చిన్న జీవితంలో ఈజీవుడు చేసే ఆకృత్యాలను అసహ్యించుకుంటూ సుతిమెత్తని చురకలు వేస్తూ... వంద లెకరాలు/ సంపాదించాడు/ ఆఖరికి పట్టా /ఆరడుగుల జాగాకే.. అంటూ అసలైన జీవన సూత్రం అద్భుతంగా ఆవిష్కరించారు.
ఇవన్నీ అనుభవైక అక్షరసారాలు
అయినవారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో వడ్డించే అపాత్రా దానవంతులు మనలో అనేకమంది అగుపిస్తారు. ఆ తత్వం విధిగా వీడాలి అనే గొప్ప సత్యం చాటిన లహరి ఆ భావాన్ని తన నానీలో ఎంత అందంగా ఆవిష్కరించిందో... "నక్షత్రాల హోటల్లో /టిప్పు సుల్తాన్లు/ కూరలవ్వతో/ కొసరి బేరాలు". అంటూ ఇలా అనేకనేక జీవిత సత్యాలు అత్యవసరంగా ఆచరించాల్సిన జీవన సూత్రాలు లహరి నానీల నిండా అగుపిస్తాయి. అన్ని వర్గాల వారిని అన్ని కోణాల నుంచి పరిశీలిస్తే తప్ప ఈ స్థాయి సృజన సాధ్యం కాదు అన్నది అక్షర సత్యం. అన్ని భావాలకు, వాదాలకు, ఆధారమైన "మానవతావాదం" మనిషి తత్వం, మరుగున పడిపోతున్నదన్న ఆందోళన లహరి నానీలదే కాదు అందరిదీ అవ్వాలి. మానవత్వం లేనప్పుడు మనిషి ఎంత సాధించినా? ఎంత ఎదిగినా అవి అన్ని వృధానే!! అస్తిపంజరానికి అందమైన రూపం వంటి చర్మ సౌందర్యపు "మానవతా గుణం" ను అందరం అందంగా అలంకరించుకొని మన మనిషితనం నిరూపించుకునే వేళ ఆసన్నమైంది. అందరం ఆ దిశగా అడుగులు వేయాలి అనే సుతిమెత్తని హెచ్చరికలు సైతం లహరి నానీల్లో ఉన్నాయి. అత్యంత విలువైన "అనుబంధం" ద్వారానే మానవ సంబంధాలు ముడిపడి ఉన్నాయనే నగ్న సత్యం ఆవిష్కరిస్తూ... "అనుబంధం/ విలువ తెలియదు/ తనలోకి చూసుకోడు/ ఏకాకి మనిషి" అంటూ.. నాటి ఉమ్మడి కుటుంబ సమాజాల లోని ఉన్నతిని, హాయిని, విడిచిన ఆధునిక మనిషి, ఏకాకి జీవితాల ద్వారా ఎంతటి ఒంటరితనం అనుభవిస్తున్నాడో!! తద్వారా అతనిలోని మానసిక స్థితి ఎలా దిగజారి పోతుందో?? చక్కగా ఆవిష్కరిస్తూ.... ఐకమత్యంలోని ఆనందం లాభం గురించి అనేక కోణాల్లో ఆవిష్కరించారు. అవి అన్ని కేవలం ఊహాజనిత కల్పనలు కానే కావు, అనుభవైక అక్షరసారాలు.
హాయిగా సాగే నానీల ప్రయాణం..
కాలంతో పాటు మనిషి మారాలి కానీ అది ఏటికి ఎదురీతల కారాదు అనే గొప్ప సత్యాన్ని మన పెద్దలు ఏనాడో చెప్పారు. అది అందరికీ శిరోధార్యం కూడా!! "కాలంతోపాటు/ సంస్కృతి మారుతుంది/ ప్రవాహానికి/ అభిముఖం కుదరదు" అనే నానీ ద్వారా.. గొప్ప సత్యాన్ని ఆవిష్కరించడంలో రచయిత్రి ప్రతిభ ఏపాటిదో ఇట్టే అర్థం అవుతుంది. కవికి ఉండే నిష్పక్షపాత ధోరణి ఆ కవి యొక్క ఉన్నతిని శిఖరాయమానం చేస్తుంది. అచ్చంగా లహరి కూడా అటువంటి పారదర్శకత చూపిస్తుంది తన నానీల పరదాలలో... శాస్త్రవేత్తలు రహస్యాలు ఛేదిస్తారు/ ఆడవారి మనసు/ లోతుల్ని తప్ప.... అనే నానీ మచ్చుకు ఒకటి మాత్రమే తనలోని పక్షపాతలేమికి సాక్ష్యం. ఇది కోవకు చెందిన... కడుపు మంట/ అజీర్తి కాదు/ పక్కింటి ఆవిడ/ పట్టు చీర కొన్నది ... వంటి నానీల విరజాజులు అనేకం ఇందులో కనిపిస్తాయి. ఎదిగిన కొద్ది ఒదిగి ఉండాలనే గొప్ప మానవతా గుణం అణువణువునా నింపుకున్న లహరి, "ప్రశంస నీక్కాదు/ నీ నానికి /ఎగిసి పడకు/ జారిపడ తావు" అంటుంది ఇది ప్రతి రచయిత అన్వయించుకోదగ్గ విలువైన అక్షరాలతునక. ఇలా ప్రతి నానీ లో మానవత్వపు మధనం అగుపిస్తుంది చదివిన కొద్ది చదవాలి అనిపిస్తూ.... హాయిగా సాగే ఈ నానీల ప్రయాణం నిజంగా సాగర తీరాన లభించే ఆనందపు జావళీలకు సమానం.
నానీల తీరాన (నానీ ల సంపుటి),
రచన:- ఎన్. లహరి,
పేజీలు:90,
ధర:150/- రూ,
ప్రతులకు: 9885535506.
సమీక్షకుడు
డా:అమ్మిన శ్రీనివాసరాజు,
77298 83223