తెలుగు కథకు 'ముల్కనూరు' నీరాజనం

mulkanuru inviting telugu kathalu and giving price money to winners

Update: 2023-07-16 19:00 GMT

పుస్తక పఠనం మనిషి సంస్కారాన్ని పెంచే ఔషధం. సాహిత్యం సామాజిక చరిత్రను తెలిపే దీపస్తంభం. కథలు వింటూ, చెబుతూ సంఘజీవిగా ఎదిగిన మనిషి కాగితంపై కథలను చదవడం మొదలెట్టాడు. ఆ అలవాటు ప్రకారం వారానికి ఒక్క కథైనా చదివేవాళ్ళు లక్షల్లో ఉన్నారు. దానిని అభ్యాసంగా అలవరచుకొన్నవారు వేలల్లో ఉన్నారు. కథలు సృష్టించేవారు వందల్లో ఉన్నారు. కథలను పోషించేవారు మాత్రం ఈ రోజుల్లో పదుల్లో కూడా లేరు.

కథలు వాలేందుకు కొమ్మగా

ప్రధాన తెలుగు కథల పత్రికలు మూతబడినాక కథల పోటీలే రచయితలకు ఊతం, ఉత్ప్రేరకం అయ్యాయి. చిన్న పత్రికలు ‘స్మారక’ కథల పోటీలు నిర్వహించి చేతనైన కృషి చేస్తున్నా వాటికి లభిస్తున్న ప్రాచుర్యం, ఆదరణ అంతంతే అనుకోవాలి. చివరకు కొన్ని కథల పోటీలు ఓ ప్రహసనంగా కూడా మారాయని చెప్పవచ్చు. ఇలాంటి దశలో కథపై అవ్యాజ్యమైన ప్రేమతో, కథను నిలబెట్టాలనే సత్సంకల్పంతో ఓ మారుమూల గ్రామం ముందడుగు వేసింది. పట్టణ సంస్థలను సవాలు చేసేలా కథల పోటీలు నిర్వహించి కథకులను తట్టి లేపింది. మీరు రాయండి, మీకు తోడుగా మేముంటామని హామీ ఇచ్చింది. ఆ సంస్థ పేరు ముల్కనూరు సాహితీ పీఠం. ఇప్పటికే ముల్కనూరులో వీరు నిర్వహిస్తున్న ప్రజా గ్రంథాలయానికి తోడుగా సాహిత్యసేవ కోసం ఈ సాహితీ పీఠంను ఏర్పాటు చేశారు.

కథలు వాలేందుకు కొమ్మలు లేని దుస్థితికి విరుగుడుగా గత నాలుగేళ్లుగా కథల పోటీలు నిర్వహించి వందల కొత్త కథలకు ఈ సంస్థ పచ్చని చెట్టయింది. రచయితకు కాకుండా కథకే గుర్తింపునిచ్చి ఎందరో నవ యువ కథకులను ఈ అక్షర యజ్ఞంలోకి రాబట్టింది. ఇలా పోటీలు నిర్వహించి కథలు రాయించడానికి ముందుకొచ్చిన ముల్కనూరు సాహితీ పీఠంకు ఓ దినపత్రిక తోడై ఎంపికైన కథలను తమ ఆదివారం మ్యాగజైన్‌లో వరుసగా ప్రచురిస్తోంది. ఈ కథలు రాసిన వారికి నగదు బహుమతితో పాటు తమ కథ ఓ ప్రధాన పత్రికలో రావడం ఎంతో సంతృప్తినిచ్చే అంశం. అంతే కాకుండా ప్రతి ఏడాది బహుమతి పొందిన కథలన్నింటిని పుస్తకంగా తెచ్చి రచయితలకు ఒక కాపీని ఉచితంగా అందజేస్తోంది. నగదు బహుమతులు, పుస్తకముద్రణ అంతా కలిసి లక్షల్లో ఖర్చవుతుంది. ఇన్ని ప్రత్యేకతలున్నందువల్ల ముల్కనూరు సాహితీ పీఠం నిర్వహించే కథల పోటీ రచయితల్లో ఓ నూతనోత్సాహంగా మారిపోయింది. రాయడం ఆపేసిన వాళ్ళు రాస్తున్నారు, కథలు చదివేవారు రాసేందుకు ప్రయత్నిస్తున్నారు, యువకులు తన సృజనశక్తిని పరీక్షించుకుంటున్నారు. ఇలా ఏటా సుమారు వేయి మందిని తమ కలాలకు పదును పెట్టే పని కల్పిస్తోంది ఈ సాహితీ పీఠం.

నాలుగేళ్లు పూర్తి చేసుకొని..

2019లో మొదలైన ఈ కథల పోటీ నిర్వహణ 2022తో నాలుగేళ్లు పూర్తి చేసుకొంది. ప్రతి ఏడాది చివరి నెలల్లో కథలను ఆహ్వానించి మరుసటి యేడు మార్చి - ఏప్రిల్ మాసాల్లో ఫలితాలు ప్రకటిస్తోంది. తొలిసారి ప్రయోగపూర్వకంగా 2019లో కేవలం 22 కథలు ఎంపిక చేసుకొన్నా ఏడాదికేడాది కథల సంఖ్య పెంచుతూ పోవడం గొప్ప విషయంగానే చెప్పుకోవాలి. 2020లో 50 కథలు, 2021లో 64 కథలు, 2022లో 70 కథలు నగదు బహుమతులకు ఎంపికయ్యాయి. 2019 నుండి ప్రథమ బహుమతి పొందిన కథకు రూ.50 వేల నగదు బహుకరిస్తున్నారు. తెలుగు కథకు ఇంత సొమ్ము ప్రైజ్ మనీగా రావడం ఒక అద్భుతంగానే భావించాలి. వరుసగా పెద్దింటి అశోక్ కుమార్ ‘విత్తనం’, కె. ఆనందాచారి ‘గస్సాల్’, స్ఫూర్తి కందివనం ‘డిమ్కీ’, హుమాయూన్ సంఘీర్ ‘ఇబ్లీస్’ అనే కథలు అగ్రస్థానాన్ని అందుకున్నాయి. రెండో బహుమతిగా ఇద్దరికీ రూ.25 వేలు, తృతీయ బహుమతిగా ముగ్గురికి రూ.10 వేలు, ఇలా కథా స్థాయి క్రమంలో నగదు మొత్తం తగ్గుతూ చివరి 20 కథలకు వేయి రూపాయల బహుమతి లభిస్తుంది. ప్రతి యేడు బహుమతి ప్రధానోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. మొదటి మూడేళ్లు ముల్కనూరులో నిర్వహించి ఈ సారి ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేశారు. దూర భారాలతో రెండు రాష్ట్రాల నుండి వచ్చిన కథకులను సకల మర్యాదలతో ఆహ్వానించి సాదరంగా సాగనంపారు. ముల్కనూరు సాహితీపీఠం ఇప్పుడు కథలకు కల్పవృక్షం, కథకులకు కామధేనువు. వేముల శ్రీనివాసులు సారథ్యంలో ఉన్నత ఆశయాలు గల ముల్కనూరు స్థానిక మిత్ర బృందం గణనీయ ఫలితాలను సాధిస్తోంది. ఆయనకు వెన్నుదన్నుగా ఉన్న సాహితీప్రియుల తోడుతో సాహితీ పీఠం మొక్కవోని సేవ అందించాలని తెలుగు సాహితీ లోకం కోరుకుంటోంది.

-బి.నర్సన్

9440128169

Tags:    

Similar News

పిల్లలంటే!