మహాప్రస్థానం @75

Mahaprasthanam @75

Update: 2024-09-22 18:45 GMT

"నేనొక దుర్గం! నాదొక స్వర్గం!

అనర్గళం, అనితరసాధ్యం నా మార్గం;"

"1930 దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది. ఆ తర్వాత నుంచీ దాన్ని నేను నడిపిస్తున్నాను. తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు ఈ శతాబ్దం నాది" అంటూ తన అక్షర ప్రభావ ప్రస్థానపు ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు శ్రీ శ్రీ. ప్రపంచం ఆర్థిక మాంద్యంతో తల్లడిల్లి ఆకలితో అలమటిస్తున్న 1930-1940 మధ్యకాలంలో సామాన్యుల వ్యథలను నవీనత్వంతో వ్యక్తపరుస్తూ, సామాజిక వాస్తవికతకు దర్పణం పట్టేలా రాసిన శ్రీ శ్రీ మహాప్రస్థానం గేయాలు పుస్తక రూపం దాల్చింది 1950లో. ఆ పుస్తక ప్రభ, అందులోని కవిత్వపు శోభ 75 వసంతాలైనా ఇంకా నేటి ఆధునిక ప్రపంచానికి రిలవెంట్‌గానే వుంది.

నేటికీ శ్రీ శ్రీ పేరు మీద ఎన్నో సామాజిక, సాహిత్య స్వచ్ఛంద సంస్థలు నవసమాజ నిర్మాణం కోసం అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తూనే వుండటమే అందుకు తార్కాణం. మహాప్రస్థానంలోని గేయాలు కృత్రిమ మేధతో కూడిన ఇంగ్లిష్ మీడియం బోధన యుగంలో కూడా నేటి యువతరం నాలుకలపై అద్భుతంగా పలుకుతున్నాయి. కవిత్వం రాస్తున్న ప్రారంభ దశలో ఏ కవినైనా.. 'నువ్వేమన్నా శ్రీ శ్రీ అనుకుంటున్నావా' అని ఎవరైనా అంటే ముసిముసి నవ్వులు చిందిస్తూ పొంగిపోని వారు ఎవరుంటారు చెప్పండి ఇప్పటికీ..!... ఎప్పటికీ..! అలాంటి మహా ప్రవాహం కోసం పదండి ముందుకు మహాప్రస్థానం గేయాలను ఓసారి స్మరించుకుందాం..!

"కళ్ళంటూ ఉంటే చూసి, / వాక్కుంటే వ్రాసీ! / ప్రపంచమొక పద్మవ్యూహం! / కవిత్వమొక తీరని దాహం!" ప్రపంచవ్యాప్తంగా వచన కవిత్వం ఎలా రాయాలనే దానికి విభిన్న అభిప్రాయాలు వున్నా ...ఇలానే రాయాలనే నిబంధన ఏమీలేదు. గురజాడ అడుగుజాడలతో ఆరంభమైన సామాన్యుని భాషలోనే కవిత్వం శ్రీ శ్రీ తో విశ్వవ్యాప్తమైంది. పాండిత్యంతో సంబంధం లేకుండా సామాజిక సమస్యలపై స్పందించే ప్రతి సగటు మనిషికి కవిత్వం రాసే ప్రేరణ లభించింది. "ఇక్కడ నిలబడి నిన్ను / ఇవాళ ఆవాహనం చేస్తున్నాను! / అందుకో ఈ చాచిన హస్తం! / ఆవేశించు నాలో! ఇలా చూడు నీకోసం / ఇదే నా మహాప్రస్థానం!"అంటూ శ్రీశ్రీ తన మిత్రుడు కొంపెల్ల జనార్ధన్ రావుపై రాసిన "తలవంచుకు వెళ్లిపోయావా, నేస్తం!"అంకితం గేయంతో మనల్ని అడుగులు వేయిస్తుంది.. మహాప్రస్థానం!

నేటి స్వతంత్ర్య భారతావనిలో కూడా స్వతంత్ర్యం రాకముందే రాసిన మహాప్రస్థానం గేయాలు సమాజంలో సజీవమై ఇంకా అక్కడక్కడా అప్పుడప్పుడు కనిపిస్తూనే వున్నాయి. కన్నీటి సాక్షిగా కదిలిస్తూనే వున్నాయి. పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, వివక్షత, దౌర్జన్యం, అసమానతలు వంటి ప్రాపంచిక సమస్యలు మనకు నాగరిక ప్రజాస్వామ్య లౌకిక సమాజంలో కూడా తారస పడుతూనే వున్నాయి.

'ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ, / ఒక జాతిని వేరొక జాతీ, / పీడించే సాంఘిక ధర్మం / ఇంకానా?ఇకపై సాగదు '

"కూటి కోసం, కూలీ కోసం / పట్టణంలో బ్రతుకుదామని / తల్లిమాటలు చెవిని పెట్టక / బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం..!"

" ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరి"దని వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది!

విశ్వంతరాళంలో మనస్థాయి ఎంత? అంటూ అంతరిక్ష సరిహద్దులను దాటి ఆలోచిస్తున్న నేటి ఆధునిక మానవుని గురించి...

"ఆలోచనలు పోయేవాడా! / అనునిత్యం అన్వేషించే వాడా! / చెట్టూ, చెరువూ, గట్టూ, పుట్టా / ఆకసంలో,సముద్రంలో / అన్వేషించేవాడా! అని ఆనాడే మన భవిష్యత్తును రాశారు.)

"పొలాల నన్నీ, హలాల దున్నీ, / ఇలా తలంలో హేమం పిండగ - / జగానికంతా సౌఖ్యం నిండగ -

నాలో కదలే నవ్య కవిత్వం / కార్మికలోకపు కల్యాణానికి, / శ్రామికలోకపు సౌభాగ్యానికి / సమర్పణంగా, సమర్చనంగా -"

అంటూ సాగిన శ్రీ శ్రీ ప్రతిజ్ఞ నేటి శ్రామిక, కార్మిక,కర్షక లోకానికి నిలువెత్తు నిదర్శనం.

"మాకు గోడలు లేవు / గోడలను పగులగొట్టడమే మా పని. / అలజడి మా జీవితం / ఆందోళన మా ఊపిరి. /తిరుగుబాటు మా వేదాంతం."

అంటూ తన ధిక్కార స్వరాన్ని శాస్త్రీయ సాహిత్యప్రపంచం వైపు విప్లవ కాంతులతో మళ్లించాడు.

గెలుపోటములను పట్టించుకోకుండా ప్రయత్నాలు ఆపకుండా జీవన గమనం వుండాలని సమాజం ఎప్పుడూ సాపేక్షమే అని

"నిప్పులు చిమ్ముకుంటూ / నింగికి నే నెగిరిపోతే / నిబిడాశ్చర్యంతో వీరు- / నెత్తురు క్రక్కుకుంటూ / నేలకు నే రాలిపోతే, / నిర్దాక్షిణ్యంగా వీరె.."అంటూ వివరించారు.

"నే నేదో విరచిస్తానని, / నా రచనలలో లోకం ప్రతిఫలించి / నా తపస్సు ఫలించి, / నా గీతం గుండెలలో ఘూర్ణిల్లగ / నా జాతి జనులు పాడుకునే మంత్రంగా మ్రోగించాలని,..."

నేటికీ ప్రపంచ భాషలలో ఎక్కడా కూడా 'కవితా! ఓ కవితా!' వంటి అద్భుతమైన కవిత్వం రాలేదని మహాకవులు సైతం శ్రీశ్రీని అభినందించారు. బహుశా నోబెల్ బహుమతి స్థాయి సాహిత్యం ఇది.

"మెరుపు మెరిస్తే, / వాన కురిస్తే, / ఆకసమున హరివిల్లు విరిస్తే / అవి మీకె అని ఆనందించే కూనల్లారా!" అంటూ రాసిన శైశవ గీతి పిల్లలకు ఇవ్వాల్సిన స్వేచ్ఛ ప్రపంచపు విలువను తెలియజేస్తుంది. ఒత్తిడి లేని విద్యను పిల్లలకు సూచిస్తుంది.

ఇక చివరగా ఈ లోకం మీదేనండి!ఈ రాజ్యం మీరేలండి! అంటూ జగన్నాథుని రథచక్రాలు మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. మహాప్రస్థానం లాంటి కొన్ని పుస్తకాలు కొన్ని శతాబ్దాల పాటు కాలాన్ని నడిపిస్తూ భవిష్యత్తు తరాలకు మార్గదర్శనం చేస్తుంటాయి. మానవత్వపు రహదారిపై మనల్ని నడిపిస్తుంటాయి. ఏదేమైనా ఈ శతాబ్దపు సాహితీ ప్రయాణంలో శ్రీ శ్రీ మహాప్రస్థానం ఓ ధృవతార అనడంలో అతిశయోక్తి ఏమీలేదు.

"శ్రీ శ్రీ పుస్తకం కొని తీరికగా చదవండి, పద్యం పదిసార్లు చదవండి. ఏమీ అర్థం కాలేదా-ఏ యువకుడికో, భిక్షుకుడికో, death-bed present గా పంపండి. పారెయ్యకండి. అంతకన్నా దాచుకోకండి. తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించే అపూర్వ శక్తి మీ చేతులో పుస్తకం, pass it on" అంటూ చెలం దాదాపు 85 సంవత్సరాల కిందటే చెప్పారు..!

(మహాప్రస్థానం పుస్తక ప్రచురణకు 75 ఏళ్లు)

ఫిజిక్స్ అరుణ్ కుమార్

93947 49536

Tags:    

Similar News

పిల్లలంటే!