కథా-సంవేదన: నొప్పి కథలు రెండు

కథా-సంవేదన: నొప్పి కథలు రెండు... katha samvedhana

Update: 2022-10-30 18:45 GMT

అతను చిన్నగా నవ్వి, 'మీకు సమాధానం తెలిసి అడుగుతున్నారు. అప్పుడు నొప్పి, బాధ ఇంకా ఎక్కువ అవుతాయి. బొమ్మలు వేయడం లేదన్న బాధ కన్నా బొమ్మలు వేస్తూ బాధపడటం మంచిదని బొమ్మలు వేస్తున్నాను' నిజమే! బతికి వున్నంత కాలం కళాకారుడు పని చేస్తూనే ఉంటాడు. పని చేయకపోతే తోచదు. కష్టం, బాధ, నొప్పి ఇవీ వుంటూనే ఉంటాయి. వాటిని అధిగమించి పని చేస్తూ ఉండాలి. నరేంద్రనాథ్‌ని కలిసిన తరువాత ఈ విషయం మళ్లీ ధ్రువపడింది నాలో.

మొదటి కథ

దాదాపు 28 సంవత్సరాల కిందటి మాట. పోలీస్ అకాడమీలో డిప్యూటేషన్ మీద పని చేసిన తరువాత హైదరాబాద్‌లో 17వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌గా పోస్ట్ చేశారు. మూడున్నర సంవత్సరాల తరువాత మళ్లీ మేజిస్ట్రేట్ ఉద్యోగానికి వచ్చాను. నేను జాయిన్ అయిన నెలలోనే మరణ వాంగ్మూలాలు నమోదు చేసే డ్యూటీ నాకు పడింది. నెలకి ఇద్దరు మేజిస్ట్రేట్‌లకి ఆ డ్యూటీ ఉంటుంది. సికిందరాబాద్ ప్రాంతానికి ఒకరు. హైదరాబాద్‌కి ఒకరు. హైదరాబాద్ ప్రాంతంలో మరణ వాంగ్మూలాలు నమోదు చేసే డ్యూటీ నాది.

ఒక్కోరోజు కనీసం పది నుంచి పదిహేను మంది మరణ వాంగ్మూలాలు నమోదు చేసేవాణ్ని. ఎక్కువగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో నమోదు చేసేవాణ్ని. రెండవ ఫ్లోర్, మూడవ ఫ్లోర్ సునాయాసంగా ఎక్కేవాడిని. నెల చివరి వరకు మోకాలు నొప్పులు వచ్చాయి. డాక్టర్ దగ్గరికి వెళ్లాను. ఆయన పరీక్ష చేసి అరుగుదల మొదలైందని చెప్పి కొన్ని ఎక్సర్‌సైజ్‌లు చెప్పాడు, కొన్ని మందులూ ఇచ్చాడు. కొంతకాలం తరువాత నొప్పి తగ్గింది.

*

ఆ సంవత్సరమంతా జాగ్రత్తలు తీసుకున్నాను. క్రింద కూర్చోవడం కాస్త తగ్గించాను. వెస్ట్రన్ కమోడ్ వాడటం మొదలుపెట్టాను. ఎక్కువ మెట్లు ఎక్కడం తగ్గించాను. నొప్పులు తగ్గాయి. మందులు వాడటం మానేశాను. ఆ తరువాత మామూలుగా అయిపొయాను. మరీ ఎక్కువ మెట్లెక్కినప్పుడు మాత్రం మోకాలు నొప్పులు వస్తున్నాయి. అంతే కానీ, తరచుగా కాదు. నొప్పిని తగ్గించుకోవడం కోసం ఆపరేషన్ చేయించుకోలేదు. జాగ్రత్తగా ఉండటం వల్ల నొప్పిని వాయిదా పడింది.

అన్ని నొప్పులని కాస్త వాయిదా వేస్తూ వుండాలి. ఈ విషయం అన్నింటికీ వర్తిస్తుంది. కొన్నిసార్లు బాధ తప్పనిసరి అవుతుంది. దాన్ని భరించాల్సిందే. తొలగించుకోవడం సాధ్యం కానప్పుడు, కాలాన్ని వృథా చేయడం అనవసరం. ఆ నొప్పిని వాయిదా వేసే పద్ధతిని మన అనుభవం ప్రకారం మనం కనుగొనాలి. అంతే!

Also read: కథా-సంవేదన: విలువలు లేని...

రెండవ కథ

నాకు చాలామంది చిత్రకారులతో స్నేహం ఉంది. తోట వైకుంఠం, ఏలే లక్ష్మణ్, రాజేశ్వర్, ఆగాచార్యా, కప్పరి కిషన్ ఇట్లా చాలా మంది మిత్రులు ఉన్నారు. అట్లాంటి మరో మిత్రుడు కె. నరేంద్రనాథ్. ఆయన శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన వ్యక్తి. మంచి పెయింటింగ్స్ వేశారు. హకీంపేట కేంద్రీయ విద్యాలయంలో పని చేస్తున్నారు. నా కవిత్వం పుస్తకానికి, కథల పుస్తకానికి రెండు మంచి బొమ్మలు ముఖచిత్రంగా వేసి ఇచ్చారు నరేంద్రనాథ్. వాటి పేర్లు 'జమానత్'. చూస్తుండగానే జమానత్ అన్న కథల పుస్తకాన్ని శ్రీనివాసరెడ్డి ఇంగ్లిషులోకి అనువాదం చేశారు. ఈ రెండు పుస్తకాలే కాకుండా మా ఆవిడ హిమజ రాసిన 'ఆకాశమల్లే' కవిత్వం పుస్తకానికి కూడా ఓ అందమైన బొమ్మ వేసి ఇచ్చారు. ఆ మూడు బొమ్మలు మా ఇంటి గోడల మీద వేలాడుతున్నాయి.

*

ఈ మధ్య ఆయన పెయింటింగ్స్ చూద్దామని వాళ్లింటికి నేనూ మా ఆవిడా వెళ్లాం. ఆయన వేసిన పెయింటింగ్స్ అన్నీ చూశాను. కొత్తవి కన్పించలేదు. 'కొత్త పెయింటింగ్స్ వేయడం లేదా?' అని అడిగాను. 'చాలా తక్కువగా వేస్తున్నాను సార్! మెడలు నొప్పి పెట్టి తల దిమ్మెక్కిపోతోంది' జవాబు చెప్పాడు. 'మరి ఈ మధ్య బుద్ధుడి బొమ్మని నాకు వాట్సప్‌లో పంపించారు కదా! అది కొత్తది కాదా...' అడిగాను. 'కొత్తదే సార్! ఇప్పుడు ఐ పాడ్ మీద వేస్తున్నాను. తల పూర్తిగా వంచాల్సిన అవసరం లేదు. ఇది కాస్త తక్కువ నొప్పిగా ఉంటుంది' చెప్పాడు నరేంద్రనాథ్. ఆయనకు ఉద్యోగం ఉంది. అది వృత్తి. బొమ్మలు వేయడం ఆయన ప్రవృత్తి. 'అంతగా నొప్పి వుంటే మానెయ్యచ్చు కదా' అన్నాను.

అతను చిన్నగా నవ్వి, 'మీకు సమాధానం తెలిసి అడుగుతున్నారు. అప్పుడు నొప్పి, బాధ ఇంకా ఎక్కువ అవుతాయి. బొమ్మలు వేయడం లేదన్న బాధ కన్నా బొమ్మలు వేస్తూ బాధపడటం మంచిదని బొమ్మలు వేస్తున్నాను' నిజమే! బతికి వున్నంత కాలం కళాకారుడు పని చేస్తూనే ఉంటాడు. పని చేయకపోతే తోచదు. కష్టం, బాధ, నొప్పి ఇవీ వుంటూనే ఉంటాయి. వాటిని అధిగమించి పని చేస్తూ ఉండాలి. నరేంద్రనాథ్‌ని కలిసిన తరువాత ఈ విషయం మళ్లీ ధ్రువపడింది నాలో.

Also read: కథా-సంవేదన: సల్లగుండు సత్తెమ్మ / సత్తెవ్వ


మంగారి రాజేందర్ జింబో

94404 83001

Tags:    

Similar News

పిల్లలంటే!