కథా-సంవేదన: కొత్త

katha samvedana

Update: 2023-01-01 18:45 GMT

మా ఇంట్లో దసరా పండుగ వచ్చినప్పుడు ఒక రకమైన వాతావరణం, సంక్రాంతి వచ్చినప్పుడు మరో రకమైన వాతావరణం ఉండేది. బతుకమ్మ పలారాలు, దసరా మాంసాహారాలు ఉండేవి. సంక్రాంతి రోజులలో అరిసెలు, సకినాలు ఎక్కువగా చేసేవాళ్లు. బతుకమ్మ పండగని సామూహికంగా చేసుకునేవాళ్లు. మా ఇంటిలో కిరాయకు వున్న వాళ్లేకాదు, మా వాడకట్టులో ఉన్నవాళ్లు అందరూ మా ఇంటికి వచ్చి ఆడుకున్న తరువాత వాగుకి వెళ్లేవారు. సంక్రాంతి పండగ వస్తుందంటే మాకు అదోరకమైన సరదా వుండేది. అరిసెలు, సకినాలు చాలా వుండేవి. మా ఇంటిలో కిరాయకు వున్న అమ్మాయి వదిన, హెడ్మాస్టర్ సార్ భార్య ఇట్లా చాలా మంది వచ్చి సకినాలు చేసేవారు. మా అమ్మా వదినలు కూడా వాళ్ల ఇళ్లలోకి పోయి సకినాలు పోసేవారు.

*

సంక్రాంతి తరువాతనో, సంక్రాంతి ముందో మా అనుపురం పొలం నుంచి మా చిన్నమ్మ కొడుకులు, లక్ష్మిరాజం వాళ్ళు వడ్లని తీసుకొని వచ్చేవాళ్ళు. మా బాదం చెట్టు దగ్గరలో ఒ రేకుల షెడ్డు వుండేది. అందులో రెండు గుమ్ములు వుండేవి. బండ్లల్లో తెచ్చిన వడ్లని ఆ గుమ్ములలో పోసేవారు. ఆ గుమ్ములు కర్రతో చేసిన గడంచ మీద వుండేది. గుమ్ములో పోసిన తరువాత గుమ్మి మీద మంచి మూతపెట్టి కుట్టేవాళ్ళు ఎండు గడ్డిని మా కొట్టం దగ్గర పెట్టేవాళ్ళు. పచ్చగడ్డి దొరకనప్పుడు ఎండు గడ్డిని మా బర్రెలకు వేసేవాడు మా మల్లయ్య.

*

ఉగాది పండగ కన్నా ముందు ఆ వడ్లని తీసుకొని వచ్చి మా అరుగు మీద పోసేవాళ్ళు. ఆ వడ్లలో వున్న చెత్తని రాళ్ళని ఏరడానికి కొంతమంది ఆడవాళ్ళు వచ్చేవారు. వాళ్ళు మా కులస్తులే. మున్నూరు కాపు వాళ్ళు. జల్లెడతోని, చాటలతోని వాటిని చెరిగే వాళ్ళు. వడ్లని శుభ్రపరిచిన తరువాత అవసరం ఉన్న మేర గిర్నికి తీసుకొని పోయేవాళ్ళు. వాళ్ళని దంపడం వాళ్ళు అని పిలిచేవాళ్ళు. గిర్ని దగ్గర మోసం జరగకుండా వుండటానికి ఎవరైనా పెద్దవాళ్ళు దంపకం వాళ్ళ వెంట వెళ్ళేవాళ్ళు నేనూ, మా గుణక్క సరదాగా పోయేవాళ్ళం.

*

గిర్ని నుంచి తెచ్చిన బియ్యాన్ని గోనె సంచులలో పోసి కుట్టిపెట్టోవాళ్ళు. దంపకం వాళ్ళకి సాలెడో, మానెడో వడ్లని మా అమ్మ ఇచ్చేది. వాళ్ళు చేసిన పనిని బట్టి వాళ్ళకు వడ్లను ఇచ్చేది. బియ్యంలో వచ్చిన నూకలని కూడా వాళ్ళకే ఇచ్చేది మా అమ్మ. ఒక మంచి రోజు చూసి మా ఇంట్లోకి వచ్చిన బియ్యంతో కొత్త పెట్టేది మా అమ్మ. కొత్త పెట్టె రోజు అందరూ తలస్నానం చేసేవాళ్ళు. కొత్త బియ్యాన్ని తీసి ఓ పెద్ద గంజులో వేసి కట్టెల పొయ్యి మీద పెట్టి వండేది మా అమ్మ. ఆ వండిన బియ్యంతో పరమాన్నం చేసేది. కొంత పప్పు వేసి పప్పన్నం చేసేది.

*

మా వంటింటిలో ఓ మూలకి ఎత్తైన ప్రదేశంలో అందంగా అలంకరించిన రెండు కుండలు వుండేవి. వాటిని చూస్తే గొప్ప భక్తి భావం కలిగేది. అవి కూరాడు కుండీలు. వాటిని కూరాడు కుండలనే వాళ్ళం. అందులో ఒకటి కూరాడు కుండ. రెండవది నీరాడు కుండ. కూరాడు కుండని శుభ్రపరిచి అందులో కొన్ని బియ్యం వేసి రవికబట్ట పెట్టి, రూపాయి బిల్ల, ఓ చిన్న బంగారు ముక్కని వేసి వుండేవాళ్ళు. రెండవది నీరాడు కుండ అందుకే ముందు నీళ్ళు వుంచేవాళ్ళు. కానీ, ఆ పద్దతని ఆపేసింది మా అమ్మ. అందులో కూడా బియ్యం, రవిక బట్టని వేసి ఉంచేది. కొత్త పెట్టుకున్న రోజున వాటిని తడిపి శుభ్రపరిచి, అలంకరించి పెట్టేది మా అమ్మ వాటి ముందు దీపం వెలిగించి, తయారు చేసిన పరమాన్నాన్ని పప్పన్నాన్ని వాటి ముందు పెట్టేది. అందరూ దండం పెట్టే వాళ్ళు అలా పెట్టిన పరమాన్నాన్ని, పప్పన్నాన్ని అందరి కంచంలో వేసి తినమనేది మా అమ్మ.

*

కొత్త పెట్టుకున్న రోజు మా అమ్మ మా వదినెలు, మా అక్కలు కొత్త బట్టలు కట్టుకునే వాళ్ళు. ఆ కూరాడు కుండీలు లక్ష్మీదేవికి, మా రాజరాజేశ్వరీ దేవికి ప్రతీకలని అనేవాళ్ళు. పరమాన్నాన్ని మా ఇంట్లో కిరాయకు వుండే అందరికి పంపించేది మా అమ్మ. ఇదంతా అయ్యేవరకు మధ్యాహ్నం రెండయ్యేది. సెలవు రోజు అయితే మేం ఇంట్లోనే వుండేవాళ్ళం. సెలవు రోజు కానప్పుడు మేం మధ్యాహ్నం భోజనంకి వచ్చేవాళ్ళం. ఆ రోజు మా పిల్లలందరికీ పెద్దవాళ్ళు చెప్పే ఒకే ఒక్క మాట. ఒక్క మెతుకు కూడా వృథా చేయకుండా తినాలని దాదాపు అట్లాగే వుండేవాళ్ళం. తింటున్నప్పుడు ఒకటో రెండో మెతుకులు క్రిందపడేవి. పెద్దవాళ్ళు వస్తుంటే మరీ ముఖ్యంగా మా బాపు వస్తుంటే ఆ క్రిందపడిన అన్నం మెతుకులని కంచం క్రింద దాచే ప్రయత్నం చేసేవాళ్ళం.

*

కొత్త పుట్టిన రోజు మా ఇంట్లో పండుగ వాతావరణం ఉండేది. అది గుర్తుకు తెచ్చుకుంటేనే మనస్సు ఆనందంతో పులకరించి పోతుంది. ఉద్యోగరీత్యా వేములవాడని వదిలి పెట్టాను. అమ్మా, బాపు చనిపోయారు. ఒక్కొక్కరం ఒక్కో దగ్గర స్థిరనివాసం ఏర్పరచుకున్నాం. అయినా అందరి దగ్గరా కురాడు కుండలు ఉన్నాయి. అదే వాతావరణం అందరి ఇండ్లల్లోనూ వుంది. అన్నం వృథా చేయడం విషయంలో మేం జాగ్రత్తగానే వున్నాం. కానీ, ఇప్పటి తరం అంతగా పట్టించుకోవడం లేదు.ఇప్పుడు మా పొలాల నుంచి ముందు మాదిరిగా వడ్లు రావడం లేదు. కౌలు డబ్బులు మాత్రం వస్తున్నాయి. కానీ కొత్త పెట్టుకోవడం మాత్రం కొనసాగుతూనే ఉంది.

*

ఫిబ్రవరి మొదటి వారంలో ఓ రెండు బియ్యం బస్తాలు బయట షాప్ నుంచి వస్తాయి. ఓ మంచి రోజున కొత్త బియ్యంలో కొత్త పెడుతుంది మా ఆవిడ. అప్పటి మాదిరిగా చాలా మందిమి ఇప్పుడు లేం వున్న వాళ్ళమేనా కలుస్తాం. మా వేములవాడలోని మా ఇంటి వాతావరణాన్ని పూర్తిగా తీసుకొని రాలేం. కానీ ఆ స్ఫూర్తి కొనసాగుతూనే ఉంటుంది. అదే పరమాన్నం, అదే పప్పన్నం, అదే స్ఫూర్తి, అదే మనస్సు కొన్న బియ్యం అయితే నేమి పొలం నుంచి వచ్చిన వడ్లతో వచ్చిన బియ్యం అయితేనేమి ఆ కొత్త వారసత్వాన్ని కొనసాగించుకోవడానికి రెండు చేయాలని కూరాడు కుండలకి పరమాన్నానికి దండం పెట్టడానికి మనస్సు కదా ముఖ్యం కొత్త ఎప్పుడూ కొత్తే.


మంగారి రాజేందర్ జింబో

94404 83001

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672


Also Read...

కవిత: నిత్యబాలింత కాలం


Tags:    

Similar News

పిల్లలంటే!