'నీ రెండవ భర్తను హత్య చేశావని నీ పైన నేరారోపణ నమోదు చేశాం. నువ్వు నేరం చేశావా? చెయ్యలేదా? నీ కేసు విచారణ చేయమని అంటావా?' ప్రశ్నించాడు జడ్జి సునీతను. సునీతను జైలు నుంచి తీసుకుని వచ్చి కోర్టు ముందు హాజరు పరిచారు పోలీసులు. ఆమె వయస్సు ముప్పై అయిదు సంవత్సరాలు ఉంటాయి. మనిషి అందంగా వుంటుంది. అందం కన్నా ఆకర్షణీయంగా వుంటుందని చెప్పవచ్చు. ఆరు నెలలుగా జైల్లో వుండటం వలన బలహీనంగా కన్పిస్తున్నది. 90 రోజులలోగా చార్జిషీట్ ఫైల్ చెయ్యని కారణంగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ, కోర్టు కోరిన మొత్తంలో జామీనుని ఆమె తండ్రి ఇవ్వలేకపోవడంతో ఆమె జైలులోనే వుండిపోవాల్సి వచ్చింది.
*
చివరికి పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఆమె కేసు మేజిస్ట్రేట్ కోర్టు నుంచి సెషన్స్ కోర్టుకి వచ్చింది. ఆమె విచారణలో ఉన్న ఖైదీ కాబట్టి ఆమె కేసును త్వరగా పరిష్కరించాలని సెషన్స్ జడ్జి అనుకున్నాడు. అందుకని ఆమె మీద నేరారోపణని నమోదు చేసి ఆమెను ప్రశ్నించాడు. జడ్జి నుంచి ఆ ప్రశ్నను ఆమె ఊహిస్తున్నదే. సమాధానం చెప్పడానికి తలపైకెత్తి జడ్జి వైపు చూసింది. జడ్జి ఆమె వైపు చూశాడు. 'అవును సార్! నిజమే నేను నా రెండవ భర్తను చంపాను' సమాధానం చెబుతూ ఒక్క క్షణం ఆగింది. ఆమె జవాబుని జడ్జి రాసుకున్నాడు. 'నాకు ఓ ఐదు నిమిషాలు సమయం ఇవ్వండి నేను ఎందుకు చంపానో చెబుతాను' అంది. అలా అంటూనే ఆమె తన కథను చెప్పడం మొదలు పెట్టింది.
*
'నా కొడుక్కి ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడు నా మొదటి భర్త అనారోగ్యంతో చనిపోయాడు. ఆయనకేమీ ఆస్తిపాస్తులు లేవు. అందుకని మా అమ్మ వాళ్లింటికి వచ్చాను. నేను వాళ్లకి భారం కావద్దని మా అమ్మ వాళ్లింటికి దగ్గరలో ఉన్న స్కూల్‌లో ఆయాగా చేరాను. నా కొడుకు కూడా అదే స్కూల్‌లో చదివేవాడు. ఆ స్కూల్ లో పనిచేస్తున్న సైన్స్ టీచర్ నా వైపు నా కొడుకు వైపు ఆసక్తిగా చూసేవాడు. అతనికి యాభై సంవత్సరాలుంటాయి. అతని భార్య చనిపోయింది. పిల్లలు లేరు ఎలాంటి బాదరబందీ లేదు. ఒకరోజు మా తండ్రి దగ్గరికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. నన్ను విచారించి చెబుతానని మా తండ్రి అతనితో చెప్పి పంపించాడు. ఆ తరువాత నా వైపు సాలోచనగా చూశాడు మా తండ్రి. నేను వద్దని చెప్పాను. అతనికి ఉద్యోగం ఉంది. మంచి జీతం వస్తుంది. ఎలాంటి బాదరబందీ లేదు. చేసుకొమ్మని మా మేనత్త చెప్పింది. ఆమె మా తండ్రి దగ్గరే ఉంటుంది. ఆమె భర్త కూడా చనిపోయాడు. నేనేమీ మాట్లాడలేదు. పిల్లాడి భవిష్యత్తు బాగుంటుందని అందరూ చెప్పారు. ఆ మాట నా మీద బాగా పనిచేసింది. వాడి కోసం రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను.'
*
'అట్లా నా రెండవ పెళ్లి జరిగింది. నేనూ నా కొడుకూ ఆయన ఇంటికి మారిపోయాం. ఓ నెల రోజులు అంతా మామూలుగానే ఉంది. అతను నన్ను బాగానే చూసుకునేవాడు. నా కొడుకుని బాగానే చూసుకునేవాడు. ఆ తరువాత పరిస్థితులు మారిపోయినవి. హుషారుగా వుండే నా కొడుకు అదో రకంగా అయిపోయినాడు. భయపడుతున్నట్టుగా వుండేవాడు. ఎందుకు అలా అయినాడో నాకర్థం కాలేదు. నా రెండవ భర్త వాడి దగ్గరకు రాగానే వాడిలో భయం ఎక్కువ అయ్యేది. వాడికి కావాల్సిన బొమ్మలు అవీ అతను తెచ్చి ఇచ్చేవాడు. అయినా వాడు అతనికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేసేవాడు. అలా రెండు నెలలు గడిచాయి. వాడు ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు అడిగినా ఏమీ చెప్పలేదు. ఎవరి కోసమైతే నేను రెండవ పెళ్లి చేసుకున్నానో వాడే భయంలో ఉంటే నా వివాహానికి ఉపయోగం ఏమిటి? అని నాలో నేను చాలాసార్లు అనుకున్నాను. ఎన్నిసార్లు అడిగినా వాడి దగ్గరి నుంచి జవాబు లేదు. వాడు చెప్పింది ఒక్క మాట 'తాత వాళ్లింటికి పోదాం' అంతే.
*
'అక్కడికి పోతే ఎవరూ మెచ్చరు. నేను రెండవ పెళ్లి చేసుకోవడం వలన వాడు అలా అయినాడేమోనని అనుకున్నాను. కానీ, అంతగా ఆలోచించే వయస్సు కాదు వాడిది. తండ్రికి చెప్పినా అర్థం చేసుకోలేదు. అమ్మకి అర్థం చేసుకునే పరిస్థితి అంతకన్నా లేదు. విషయం నేనే తేల్చుకోవాలని అనుకున్నాను. ఆ రోజు, నా రెండవ భర్త, నా కొడుకు బడికి వెళ్లిపోయారు. బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. వాళ్లిద్దరినీ ఇంట్లో వుంచి విషయం తెలుసుకోవాలని అనుకున్నాను. ఇంటి వెనక వైపు తలుపు గొళ్లెం పెట్టకుండా వదిలేసి వుంచాను. ఇంటి ముందు తాళం వేసి, బడికి వెళ్లి తాళం చెవి నా రెండవ భర్తకి ఇచ్చి మా అమ్మకు ఆరోగ్యం బాగా లేదని తెలిసింది. చూసి రేపు వస్తానని చెప్పాను.'
*
'అతను ఏమీ అనకుండా తాళం చెవి తీసుకున్నాడు. నేను నా ఇంటి పరిసర ప్రాంతాలలోనే వున్నాను. సాయంత్రం ఐదున్నరకి నా కొడుకుని తీసుకుని ఇంటికి వచ్చాడు. తాళం వేసే వరకు నేను ఇంట్లో లేనన్న విషయం వాడికి తెలియదు. భయం భయంగా వాడు లోపలికి వెళ్లాడు. అతను గొళ్లెం పెట్టేశాడు. అది చూసి నేను ఓ అరగంట తరువాత ఇంటి వెనక నుంచి ఇంట్లోకి వెళ్ళాను. బెడ్ రూంలో వాళ్లిద్దరు. వాడి బట్టలు విప్పేసాడు. వాడు భయంతో వణికిపోతున్నాడు. అరుద్దామని కూడా వాడికి తోచినట్టు లేదు. అతను కూడా బట్టలు విప్పి వాడిని మంచం మీదకు లాక్కున్నాడు.'
*
'నాకు విషయం అర్థమైంది. కోపంతో వూగిపోయాను. వంటింట్లో వున్న రోకలి బండను తీసుకుని అతని తల మీద రెండు దెబ్బలు వేశాను. అతని తల ముక్కలైపోయింది. అతడు ప్రాణాలు వదిలాడు. నా కొడుకు బిక్కచచ్చిపోయాడు. వాడికి బట్టలు వేసి మా అమ్మవాళ్లింటికి పంపించాను. వాడు వణుకుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నేను పోలీస్ స్టేషన్‌కి వెళ్లి విషయం చెప్పాను. అవును నా రెండవ భర్తని చంపాను. మీరు ఏ శిక్ష వేసినా పర్వాలేదు. నా కొడుకు క్షేమంగా ఉంటే చాలు. ఆమె మాటలు విన్న జడ్జికి ఏమి శిక్ష వేయాలో తోచలేదు. ఏం చేయాలో అంతకన్నా పాలుపోలేదు. చెమటలు తుడుచుకుంటూ కేసు వాయిదా వేసి, బెంచీ దిగిపోయాడు.
మంగారి రాజేందర్ జింబో
Also Read...