కథా-సంవేదన: అవకాశాలు

katha samvedana

Update: 2022-12-18 18:45 GMT

మధ్య ఓ కథ చదివాను. పాల్ కొహెలో చెప్పిన కథ. ఇది అవకాశాల గురించి చెప్పిన కథ. నాకు బాగా నచ్చింది. ఇదీ ఆ కథ

ఓ ఊరిలో వున్న ఓ లైబ్రరీ అగ్ని ప్రమాదానికి గురైంది. దాదాపు అన్ని పుస్తకాలు కాలి బూడిదగా మారిపోయాయి. ఓ నాలుగైదు పుస్తకాలు అలా మిగిలిపోయాయి. అవి పెద్ద విలువైనవి కాదని వాటిని అక్కడ దగ్గరలో పడేసి వెళ్లిపోయాడు లైబ్రేరియన్. అందులోని ఒక పుస్తకాన్ని ఓ యువకుడు తీసుకున్నాడు. చదవడం ప్రారంభించాడు.

అది అతనికి ఎలాంటి ఆసక్తిని రేకెత్తించలేదు. కానీ, కొన్ని పేజీలు చదివిన తరువాత ఒక ఆసక్తికరమైన విషయం అతనికి కన్పించింది. అది పరుసవేది గురించిన అంశం. మామూలు లోహాన్ని అది బంగారంగా మార్చేస్తుంది. అది చూడటానికి మామూలు గులకరాయి మాదిరిగా ఉంటుంది కానీ, అది వేడిగా ఉంటుంది. మిగతా గులకరాళ్లు చల్లగా వుంటాయి. అది చదివినప్పటి నుంచి అతను గులకరాళ్ల వేటలో పడ్డాడు. రోజూ సముద్రపు ఒడ్డుకి రావడం గులకరాళ్లని పరీక్షించడం, అవి చల్లగా తగలగానే వాటిని సముద్రంలోకి విసిరివేయడం అతని దినచర్యగా మారిపోయింది. ఇలా చాలా రోజులు గడిచాయి.

కానీ అతనికి పరుసవేది లభించలేదు. అలా రోజులు గడిచాయి. వారం రోజులు, నెలలు గడిచాయి. కానీ, ఫలితం లేకుండా పోయింది. చివరికి, ఒక రోజు మధ్యాహ్నం పూట ఓ గులకరాయి దొరికింది. అది వేడిగా వుంది. ఆ సంగతి అతను గ్రహించేలోపు ఆ గులకరాయి అతని చేతిని దాటి సముద్రంలో పడిపోయింది. చేతికి అందిన రాయిని వెంటనే సముద్రంలోకి విసిరివేయడం అతను అలవర్చుకున్నాడు. అందువల్ల అలా జరిగింది. అవకాశాలు కూడా అలాంటివే. మనం ఎంతో జాగరూకతతో వుంటే తప్ప వాటిని గ్రహించలేం. అవి అలా చేజారిపోతూనే ఉంటాయి.

మంగారి రాజేందర్ జింబో

94404 83001


పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672.

Tags:    

Similar News

పిల్లలంటే!