శివరాత్రికి పది రోజుల ముందు నుంచే మా వూర్లో హడావుడి మొదలయ్యేది. శివరాత్రి అయిపోయిన తరువాత వారం రోజులకి ఆ హడావుడి తగ్గేది. మా జాతర గ్రౌండ్‌లో కొత్త కొత్తవి ఎన్నో దర్శనం ఇచ్చేవి. జైంట్ వీల్, అద్దాల ప్రదర్శన, కరెంట్ అమ్మాయి, సైకిల్ మోటార్ ఫీట్లు చేసే స్టాల్ ఇట్లా ఎన్నో అక్కడ ఏర్పాటు చేసేవారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సర్కస్ అనేది మరొక ఎత్తు. అన్నీ మా పిల్లలని ఆకర్షించేవి. మరీ ముఖ్యంగా సర్కస్ మమ్మల్ని విపరీతంగా ఆకర్షించేది. ఏనుగులను, ఒంటెలను తీసుకొని మా ఊరు చుట్టూ తిప్పి సర్కస్‌ని ప్రచారం చేసేవాళ్లు. ఇవే కాకుండా సర్కస్‌లో ఎన్నో జంతువులు వుండేవి. వాటి విన్యాసాలు వుండేవి.
ఆడా, మగా చేసే ప్రదర్శనలు వాళ్ల ప్రజ్ఞాపాటవాలను చూసి తీరాల్సిందే కానీ, చెప్పడానికి వీలు కాదు. వీరందరితో బాటూ బుడ్డర్‌ఖాన్ (జోకర్) హస్యాలు మమ్మల్ని ఆనందంలో ముంచెత్తేవి. సింహాలు, పులులు రింగ్ మాస్టర్ చెప్పినట్టు వినడం చూసి మేం ఆశ్చర్యపోయేవాళ్లం. అంత పెద్ద ఏనుగు ఆ మాస్టర్ చెప్పినట్టు వినడం చూసి ఆశ్చర్యంతో బాటూ ఆనందం కూడా వేసేది. ఏనుగులను మా వూరు చుట్టూ తిప్పినప్పుడు పిల్లలమే కాదు పెద్దవాళ్లు కూడా ఇండ్లల్లో నుంచి బయటకు వచ్చి వాటిని చూసేవారు. కొంతమంది వాటికి కొబ్బరి కాయలను అందించేవాళ్లు. అది తన తొండంతో ఆ కొబ్బరి కాయను నోట్లోకి తీసుకొని మింగేది. ఏనుగును చూసినప్పుడు నాకు భయం వేయకపోయేది. ఆనందం వేసేది. దాని మీద కూర్చుని మా వూరిని చూడాలని అన్పించేది. కానీ, అది అప్పుడు తీరని కోరిక.
కొంతకాలం తరువాత నా గొంతులో టాన్సిల్స్ వచ్చాయి. అప్పుడు మా రఘుపతన్న హైదరాబాద్ వచ్చాడు. కొంచెం బుద్ధి తెలిసిన తరువాత నగరాన్ని చూడటం మా సర్కస్‌ని చూసిన దాని కన్నా ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. నన్ను తీసుకొని ఉస్మానియా దవాఖానాకు తీసుకుని వెళ్లాడు. లిఫ్ట్‌లో పైకి తీసుకెళ్లి డాక్టర్‌కు చూపించాడు. లిఫ్ట్ లో ప్రయాణం చేయడం అదే మొదటిసారి అయినా, ఏదో గమ్మత్తుగా విచిత్రంగా అన్పించింది. మా రఘుపతన్నవాళ్లు ఉండేది విద్యానగర్‌లో.
హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి అఫ్జల్‌గంజ్ దగ్గర బస్సు ఎక్కాం. అది 'బస్సు వెనుక బస్సు' రెండవ బస్సులో మేం ఎక్కాం. అందులో డ్రైవర్ లేడు కండక్టర్ మాత్రమే ఉన్నాడు. డ్రైవర్ సంగతి మా రఘుపతన్నని అడిగాను అది 'బస్సు వెనుక బస్సు' అని దాని గురించి వివరంగా చెప్పాడు. మా బస్సు కోఠి దగ్గరకు వచ్చినప్పుడు మరో బస్సు కన్పించింది. అది 'బస్సు మీద బస్సు' ఆ బస్సు నన్ను బాగా ఆకర్షించింది. అందులో ఎక్కి ప్రయాణం చేయాలని అనిపించింది. అదే విషయం మా రఘుపతన్నకి చెప్పాను.
ఆ బస్సులు మన రూట్ లో వుండవని చెప్పాడు. నేను అందులో ఎక్కాలని గట్టిగా అడిగాను. రేపు వెళ్దాం అని చెప్పాడు. చెప్పినట్టుగా నన్ను అందులో తీసుకొని హైదరాబాద్ తిప్పినాడు. దాన్ని 'బస్సు మీద బస్సు' అనరు. అది 'డబుల్ డెక్కర్' అని చెప్పాడు. ఆ డబుల్ డెక్కర్ బస్సులో హైదరాబాద్‌ని చూడటం నాకు గొప్ప అనుభూతిని ఇచ్చింది. ఆ ఇనుప మెట్లను ఎక్కి పైన కూర్చొని ఆ కిటికీ నుంచి హైదరాబాద్ చూడటాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేదు. ఆ భవనాలని, క్రింద వెళ్తున్న వాహానాలని చూసి నాలో నేనే నవ్వుకున్నాను.
గట్టిగా నవ్వాను కూడా. ఉస్మానియా దావాఖానాలోని లిఫ్ట్ లో ప్రయాణం చేసిన దాని కన్నా డబుల్ డెక్కర్ ప్రయాణం గొప్పగా అన్పించింది. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా డబుల్ డెక్కర్ లో ప్రయాణం చేయాల్సిందే. మా వూరికి వచ్చిన సర్కస్ లోని ఏనుగు మీద ఎక్కినట్టు ఈ డుబుల్ డెక్ లో నేను ఫీలయ్యాను. మా ఊరిలో ఏనుగు మీద ఎక్కి తిరగలేకపోయాను. కానీ అంతకన్నా పెద్దదైన డబుల్ డెక్కర్ లో దర్జాగా తిరిగాను. పెద్దగా అయిన తరువాత విమానంలో తిరిగినా కూడా ఆ డబుల్ డెక్కర్ ప్రయాణంలోని అనుభూతి రాలేదు.
మంగారి రాజేందర్ జింబో
94404 83001