టామ్ మోరీస్ రాసిన కథ ఒకటి ఈ మధ్య చదివాను. మన వనరుల ఉపయోగం గురించిన కథ అది. నాకు బాగా నచ్చింది. కథలో లాంటి వ్యక్తులు మనకు ప్రతి ఊర్లోనూ కన్పిస్తారు. ఒక ఊర్లో ఓ వ్యక్తి ఉండేవాడు. అతనికి ఆస్తిని జమ చేయడం చాలా ఇష్టం. బంగారం, వెండి, వజ్రాలు, విలువైన వస్తువులని జమ చేసేవాడు. ఆయన బెడ్‌రూంలో ఓ అటకని ఏర్పాటు చేసి అందులో వాటిని ఉంచేవాడు. విలువైన వస్తువులలో కత్తులు కటారులు లాంటివి కూడా ఎన్నో ఉండేవి. ప్రపంచమంతా తిరిగి వాటిని సేకరించి తన అటక మీద పెట్టుకునేవాడు. అతను సేకరించిన వస్తువుల బరువు ఎక్కువై అటక శబ్దం చేసేది. ఆ విషయాన్ని అతను పట్టించుకోలేదు. అదే విధంగా సేకరిస్తూ పోయాడు.
*
ఓ రోజు అర్ధరాత్రి అటక కూలి అతని మీద పడింది. ఆ బరువుకి అతనికి శ్వాస ఆడక వెంటనే మరణించాడు. అతను జమ చేసిన విలువైన వస్తువులు బంగారం, అన్నీ చెల్లాచెదురైపోయాయి. ఆ విలువైన వస్తువులని ఇంటిలో అలకరించుకొని అతను అనుభవించలేదు. బంగారం వెండితో ఆభరణాలు చేయించుకోలేదు. అవి అట్లా నిరుపయోగంగా ఉండిపోయాయి. అవి ఉపయోగించుకునే సామర్థ్యం ఉన్న వ్యక్తుల చేతులలో పడితే పరిస్థితి మరో రకంగా వుండేది. కానీ, అవి ఉన్నా లేని పరిస్థితిగా మారిపోయింది.
*
మనలోనూ కొన్ని వనరులు ఉంటాయి. అవి బంగారం, వెండి కాదు. మన శక్తి సామర్థ్యాలు. అవి మన వనరులు. వాటిని మనం జాగ్రత్తగా వాడుకుంటే, ఉపయోగించుకుంటే అవి వృథా కావు.
ఉపయోగించుకోకుంటే అవి వృథా అయిపోతాయి. అవి చనిపోయినట్టుగా భావించాల్సి వస్తుంది. అందుకే మనం మన శక్తిసామర్థ్యాలను గుర్తించాలి. వాటిని సక్రమంగా ఉపయోగించుకోవాలి.
మంగారి రాజేందర్ జింబో
94404 83001