కథా-సంవేదన: విలువలు లేని...

చిన్నప్పుడు విన్న కొన్ని కథలు బాగా గుర్తుండిపోతాయి. ఈ కథ కూడా అలాంటిదే. ఏది న్యాయమో, ఏది అన్యాయమో కొన్నిసార్లు అర్థం కాదు. స్వేచ్ఛకి, ఆహారానికి

Update: 2022-10-16 18:45 GMT

చిన్నప్పుడు విన్న కొన్ని కథలు బాగా గుర్తుండిపోతాయి. ఈ కథ కూడా అలాంటిదే. ఏది న్యాయమో, ఏది అన్యాయమో కొన్నిసార్లు అర్థం కాదు. స్వేచ్ఛకి, ఆహారానికి ఒక విలువ ఉంటే ఎలా ఉంటుంది?

ఇక కథలోకి వెళ్దాం. ఇది చాలా సింపుల్ కథ. పూర్వ కాలంలో ఓ గురువు ఉండేవాడు. అతనికి ఓ శిష్యుడు కూడా ఉండేవాడు. వాళ్లు తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి దేశాలు తిరిగేవారు. ఒక్క చోట స్థిరంగా ఉండకూడదన్నది గురువు సిద్దాంతం. కొంతకాలం వుండి తమ ప్రయాణాన్ని కొనసాగించాలి.

ఆగిపోతే జ్ఞాన సముపార్జన వుండదని శిష్యుడికి చెప్పేవాడు గురువు. కొన్ని సంవత్సరాల తరువాత వాళ్లిద్దరూ ఒక రాజ్యానికి వచ్చారు. అక్కడ అన్నీ ఒకే ధరకి లభించడం చూసి గురుశిష్యులు ఇద్దరూ ఆశ్చర్యపోయారు. కూరగాయలు అయినా బంగారం అయినా అన్ని ఒకే ధరకి ఆ రాజ్యాంలో లభించేవి. అక్కడ కొంతకాలం వుండిపోయారు. వాళ్లకి ఇష్టమైన ఆహారాన్ని తినేవారు.

*

కొద్ది రోజులు గడిచిన తరువాత గురువు ఒక్క రోజు శిష్యుడితో చెప్పాడు. 'ఈ రాజ్యంలో ఎక్కువ కాలం ఉండటం శ్రేయస్కరం కాదు. మనం ఇక్కడి నుంచి వెంటనే బయల్దేరుదాం' గురువు మాటలు విన్న శిష్యుడు ఆందోళన చెందాడు. స్వర్గలోకం లాంటి రాజ్యాన్ని వదిలి వెళ్లడం శిష్యుడికి ఇష్టంగా లేదు. అక్కడే వుండి పోదామని గురువును ఒప్పించే ప్రయత్నం చేశాడు. కానీ, ఫలితం లేకపోయింది. ఆ రాజ్యంలో ఎక్కువ కాలం ఉండటం మంచిది కాదని గురువు శిష్యుడితో చెప్పాడు.

గురువు చెప్పే మాటలు వినే పరిస్థితిలో శిష్యుడు లేడు. చివరికి గురువుతో వెళ్లడానికి శిష్యుడు ఇష్టపడలేదు. శిష్యుడిని అదే రాజ్యంలో వదిలిపెట్టి గురువు మరో రాజ్యానికి బయల్దేరాడు. అన్నింటికి ఒకే విలువ వున్న రాజ్యంలో వుండటం హానికరమని శిష్యుడికి వెళ్లేముందు చెబుతాడు.

*

గురువు వెళ్లిపోయిన తరువాత ఓ గుడి ముందు ఉన్న ఖాళీ స్థలంలో తన నివాసాన్ని ఏర్పరచుకుంటాడు శిష్యుడు. చాలా తక్కువ ధరకే లభించే విలువైన ఆహారాన్ని రోజూ తింటూ అక్కడ సుఖంగా వుంటాడు. కొద్ది రోజులకి అతను బాగా లావెక్కుతాడు. అలా ఆనందంగా కొన్ని నెలలు గడుస్తాయి. ఒకరోజు ఉదయం రాజ భటులు వచ్చి, మంచి నిద్రలో వున్న శిష్యున్ని లాక్కొని తీసుకుని వెళతారు. శిష్యుడికి ఏమి అర్థం కాదు. అతన్ని ఉరికంబం దగ్గరికి తీసుకుని వెళతారు.

అతనికి ఉరిశిక్ష విధించే ముందు చివరి కోరిక ఏమైనా ఉందా చెప్పమని అడుగుతారు. అత్యంత క్రూరంగా శిష్యుని జీవితం ముగిసే సమయం ఆసన్నమైంది. తనను ఎందుకు ఉరితీస్తున్నారో తెలుసుకోవాలని శిష్యునికి అన్పించి కారణం చెప్పమని అక్కడ వున్న భటులని కోరుతాడు. తాను ఎలాంటి నేరం చేయనప్పటికీ తనకి ఇంత పెద్ద శిక్షని ఎందుకు విధిస్తున్నారో చెప్పమని వేడుకుంటాడు.

*

అతని ప్రశ్నలకు జవాబు ఇలా వస్తుంది. 'నువ్వు ఎలాంటి నేరం చేయలేదు నిజమే! కానీ, రాజుగారి ధనాగారంలో దొంగతనం జరిగింది. ఆ దొంగని మేం పట్టుకోలేకపోయాం. ఎవరినో ఒకరిని ఉరి తీయాలని రాజుగారి ఆజ్ఞ. న్యాయం అమలు చేయడంలో ఎలాంటి ఆలస్యం జరగడానికి వీల్లేదని రాజుగారు చెప్పారు. బాగా లావుగా వున్న వ్యక్తివి నువ్వే కనిపించావు. మా ఉరి నీ గొంతుకు బాగా సరిపోతుంది. అందుకని నిన్ను ఉరి తీస్తున్నాం. న్యాయాన్ని అమలు పరుస్తున్నాం'

*

దేనికి విలువ లేని రాజ్యంలో బతకడం ఎంత ఆపాయకరమో ఈ కథ వివరిస్తుంది. వ్యక్తి జీవితానికి ఆహారానికి ఒకే విలువని ఇచ్చే దేశంలో పరిస్థితులు ఇలాగే ఉంటాయి. మన దేశం కూడా అలాంటి రాజ్యమేనా? జైళ్లలో వున్న ఖైదీలు ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలి. లేదా రాజు గానీ, ఆయన భటులు కానీ సమాధానం చెప్పాలి.

మంగారి రాజేందర్ జింబో

94404 83001

Tags:    

Similar News

పిల్లలంటే!