కథా-సంవేదన: జవాబు లేని సందేహం
ఈ విశ్వం అనంతం. మనకు తెలిసిన విషయాల కన్నా తెలియని విషయాలే ఎక్కువ. మనిషి మెదడు కూడా అలాంటిదే. దాని శక్తిని మనం
ఈ విశ్వం అనంతం. మనకు తెలిసిన విషయాల కన్నా తెలియని విషయాలే ఎక్కువ. మనిషి మెదడు కూడా అలాంటిదే. దాని శక్తిని మనం అంచనా వేయలేం. కొన్ని విషయాలు అయితే మనం విశ్వసించం. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనిషి మెదడు రాబోయే ప్రమాదాన్ని ముందుగానే గుర్తిస్తుందని అనిపిస్తుంది. అట్లాగే, ఆ వ్యక్తికి తెలియకుండా అతని మరణాన్ని కూడా అది ఊహిస్తుందేమో! గుర్తిస్తుందేమో!! ఇది విశ్వసించడం కష్టం. కానీ, ఒక్కొక్కరి అనుభవాలు ఒక్కో విధంగా ఉంటాయి. దీన్ని 'కో-ఇన్సిడెన్స్' అని కూడా కొంతమంది అనవచ్చు. అట్లా అనుకోవడానికి అవకాశం వుంది.
ఈ మధ్య ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. కొద్ది రోజుల క్రితం ఓ మిత్రుడు ఫోన్ చేశాడు. అతను నా కన్నా వయస్సులో పెద్దవాడు. ఓ ముప్పై సంవత్సరాల క్రితం అతను తీవ్ర సమస్యలో ఇరుక్కున్నాడు. క్రిమినల్ కేసే కాదు. అతని ఉద్యోగానికీ ప్రమాదం ఉంది. అలాంటి సమయంలో అతనికి నా సహాయం అవసరమైంది. ఆ సమస్య నుంచి ఎలా బయట పడాలో చెప్పాను. అవసరమైన న్యాయ సహాయం చేశాను. అతను ఆ సమస్య నుంచి బయటపడ్డాడు. నా దృష్టిలోనే కాదు అతని దృష్టిలో కూడా అది గొప్ప సహాయం.
ఆ తరువాత మేము చాలా సార్లు కలిశాం. కానీ, ఆ విషయం మా ఇద్దరి మధ్య ఎప్పుడూ ప్రస్తావనకు రాలేదు. నిజానికది ప్రస్తావనకు రావాల్సిన విషయం. అతను ఎప్పుడూ ఆ విషయాన్ని చెప్పలేదు. అలా చెప్పాలని అనుకోవడం సరైనది కాదేమో! అయినా, కొత్తలో ఒకటి రెండు సార్లు ఆ విషయం గుర్తుకొచ్చేది. ఆ తరువాత అది నా స్ఫురణలోంచి కూడా బయటకు వెళ్లిపోయింది. ఓ వారం రోజుల క్రితం అతను ఫోన్ చేశాడు. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అవి రాజకీయాలు కావొచ్చు. సాహిత్యం కావొచ్చు. అతను, నేను మామూలుగా మాట్లాడుకునే విషయాలే. ఈ విషయాలలో సంబంధం లేని విషయం అతను ప్రస్తావించాడు. అదే ఓ ముప్పై సంవత్సరాల క్రితం నేను చేసిన సహాయం గురించి. 'నేను ఎప్పటికీ మర్చిపోను. అప్పుడు నువ్వు ఆ సహాయం చెయ్యకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో? రిస్క్ తీసుకుని నాకు ఆశ్రయం ఇచ్చావు. గొప్ప సహాయం చేశావు' అని ప్రత్యేకంగా, ప్రముఖంగా గుర్తుచేశాడు.
అతనితో మాట్లాడటం అయిపోయిన తరువాత నేను ఆలోచనలో పడ్డాను. ఇన్ని సంవత్సరాలుగా ఆ విషయాన్ని ప్రస్తావించని మిత్రుడు ఇపుడు అంత ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించాడో నాకు అర్థం కాలేదు. ఇదే విషయాన్ని ఈ విషయంలో సంబంధం ఉన్న మరో సన్నిహిత మిత్రుడికి చెప్పాను. అతనూ ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఇది జరిగిన వారం రోజుల తరువాత ఓ మిత్రుడు ఫోన్ చేసి అతని మరణ వార్త చెప్పాడు. దిగ్భ్రాంతికి లోనయ్యాను. మా మిత్రుడికి ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవు. అంత అకస్మాత్తుగా అతను ఎలా చనిపోయాడో అర్థం కాలేదు. వారం రోజుల క్రితం అతను ఫోన్ చేసిన విషయం గుర్తుకొచ్చింది. అతను ప్రస్తావించిన సహాయం గుర్తుకొచ్చింది. మనిషికి అతనికి తెలియకుండానే అతని మరణం గురించి తెలుస్తుందా? ఏమో! ఇది జవాబు తెలియని ప్రశ్న. (దొరకని ప్రశ్న కూడా) అలా తెలిసి ఆ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తారా? మా మిత్రుడు ఇన్ని సంవత్సరాల తరువాత ఆ విషయాన్ని గుర్తుచేసి కృతజ్ఞతలాంటి భావాన్ని చెప్పడం అలాంటి పనేమో!?
మంగారి రాజేందర్ జింబో
94404 83001