కథా-సంవేదన: ఉగల్‌దాన్
మా చిన్నప్పుడు మా ఇంటిలో ఓ రెండు వస్తువులు బాగా ఆకర్షించేవి. అవి పాన్‌దాన్, ఉగల్‌దాన్. పాన్‌దాన్ ఇత్తడితో చేసినది. ఉగల్‌దాన్ స్టీలుది. ఇవి రెండూ
మా చిన్నప్పుడు మా ఇంటిలో ఓ రెండు వస్తువులు బాగా ఆకర్షించేవి. అవి పాన్‌దాన్, ఉగల్‌దాన్. పాన్‌దాన్ ఇత్తడితో చేసినది. ఉగల్‌దాన్ స్టీలుది. ఇవి రెండూ కాకుండా మా బాపు దవాఖానాలో కూడా మరో ఉగల్‌దాన్ ఉండేది. పాన్‌దాన్ చాలా ఆకర్షణీయంగా వుండేది. దాంట్లో రెండు అరలు వుండేవి. కింది అరలో తమలపాకులు తడి బట్టలో చుట్టి పెట్టేవారు. మొదటి అరలో ఐదారు విభాగాలు వుండేవి. ఒక దాంట్లో బాగం వక్కలు, మరొక దాంట్లో కాసు డబ్బా, పుదీనా డబ్బా ఇంకా ఇతర సుగంధ ద్రవ్యాలు కూడా వుండేది.
ఇవి కాకుండా ఓ చిన్న గాజు సీసాలో ఇంట్లో చేసిన జర్దా వుండేది. బాగాలు కూడా రెండు రకాలైనవి వుండేవి. తెల్లవి, నల్లవి వీటిని కత్తిరించడానికి చిన్నచిన్న ముక్కలు చేయడానికి అడకత్తెర కూడా వుండేది. ఇలాంటి అడకత్తెరనే పెళ్లిలో పెళ్లికొడుకు పట్టుకునేవాడు.
పాన్‌దాన్ అంటే పిల్లలకి భలే సరదాగా వుండేది. అందులోని పుదీనా నోట్లో వేసుకుంటే చల్లదనం వచ్చేది. సుగంధ ద్రవ్యాలు కూడా ఆకర్షించేవి. పిల్లలు వీటిని ముట్టుకుంటే పెద్దవాళ్లు గద్దిరించేవారు. ఎవరూ లేనప్పుడు పిల్లలు పాన్‌దాన్ దగ్గరికి వెళ్లేవాళ్లు. ఉగల్‌దాన్ జోలికి ఎవరూ వెళ్లేవాళ్లు కాదు. అది వంటింటి దగ్గర వున్న అరుగు మీద మూలకి వుండేది. అదే దాని స్థానం కాదు. మారుతూ వుండేది. మా బాపు కచేరీలో కూర్చుంటే అది కచేరీలో వుండేది.
నడుమ అర్రలో వుంటే అది అక్కడ దర్శనం ఇచ్చేది. ఎక్కువ శాతం అది మా వంటింటి అరుగు మూల మీదే వుండేది. ఆ కాలంలో ఎక్కడబడితే అక్కడ ఇన్ని వాష్ బేసిన్లు ఉండేది కావు. నల్లాలు కూడా వుండేవి కాదు. అందుకని ఉగల్‌దాన్ అవసరం ఎక్కువగా వుండేది. అది చాలా గమ్మత్తుగా వుండేది. పై భాగం, కింది భాగం వెడల్పుగా, నడుమ భాగం సన్నగా ఉండేది.
మా బాపు పాన్ అలవాటు మా అమ్మకి కూడా వచ్చింది. కానీ, తక్కువగా తినేది. మా అమ్మ ఉగల్‌దాన్‌ని ఉపయోగించేది కాదు. మా బాదాం చెట్టు కింద వున్న మోరీ దగ్గరకు వెళ్లి ఊసేది. ఆ తరువాత నీళ్లు పోసేది. మేం ఏదైనా తప్పు చేసినప్పుడు వెంటనే ఇంట్లోకి వచ్చేవాళ్లం కాదు. అమ్మ, బాపు పాన్లు వేసుకొని కన్పిస్తే ఇంట్లోకి వచ్చేవాళ్లం. అప్పుడు వాళ్లు ప్రశాంతంగా వుండి మమ్మల్ని ఏమీ అనకపోయేవాళ్లు.
మా ఇంట్లో బాపు దవాఖాన కోసం కషాయం బట్టీలు, మా రేకుల షెడ్డు కింద కాలుతూ వుండేవి. అప్పుడప్పుడు జర్దా తయారు చేయడం కోసం కూడా ఓ బట్టీ కన్పించేది. దాని నుంచి వచ్చే సువాసనల కోసం పిల్లలం అందరం అక్కడికి చేరుకునేవాళ్లం. ఒకసారి ఎవరూ లేనప్పుడు పాన్‌దాన్ తెరిచి అందులో వున్న పుల్లతో జర్దా తీసుకొని నోట్లో పెట్టుకున్నా. నోరంతా చేదు. ఏమీ రుచించలేదు. కక్కొచ్చినంత పనైంది. అప్పటి నుంచి ఎన్నడు కూడా పుదీనా కోసం కూడా పాన్‌దాన్ తెరవలేదు.
పాన్‌ని చాలా అందంగా తయారు చేసేది మా అమ్మ. తమలపాకు ఒకటి పెద్దది తీసి, దాని తొడిమను తుంచి, దాని మీద మరో చిన్న లేత తమలపాకు పెట్టేది. వాటి మీద సున్నం రాసేది. ఆ తరువాత కాసు రాసేది. దాంతో రంగు మారి పోయేది. భాగాలు ఇతర సుగంధ ద్రవ్యాలు, పుదీనా వేసి చివరగా సన్నటి పుల్లలతో జర్దా రాసి మా బాపుకి ఇచ్చేది. దాన్ని ఆయన నములుతూ వచ్చిన లాలాజలాన్ని ఉగల్‌దాన్‌లో వూసేవారు. ఆ ఉగల్‌దాన్ నిండితే లేదా నిండినట్టు అన్పించినా దాన్ని తీసి వేసి మరోదాన్ని మా బాపు దగ్గర పెట్టేది మా అమ్మ. నిండిన ఉగల్‌దాన్‌ని మా బావి దగ్గర వున్న మోరీలో పారబోసి దాన్ని మంచి నీళ్లతో కడిగి పెట్టేది.
మా బాపు దావాఖానాకి పోతున్నప్పుడు ఓ రెండు తమలపాకులను అందంగా తయారు చేసి ఓ చిన్న డబ్బాలో పెట్టి ప్యాంట్ జేబులో పెట్టేది మా అమ్మ. దవాఖానాకి పోకముందే పాన్ తినేవారు బాపు. ఆ తరువాత మళ్లీ తీరిక దొరికినప్పుడు దవాఖానాలో పాన్ వేసుకునేవారు మా అమ్మా, బాపులకు పాన్ తినే అలవాటు వున్నప్పటికి, ఇంటిలో ఎవరికీ పాన్ వేసుకోవడం అలవాటు కాలేదు. మా బాపుకి 85 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు డాక్టర్ల సలహా మేరకు పాన్ మానేశాడు. అమ్మ మానేసింది. పిల్లలకి అందంగా కన్పించే పాన్‌దాన్ ఇపుడు కనిపించకుండా పోయింది. దానికి ప్రాధాన్యం లేకుండా పోయింది. అవి అతిధులకి కూడా అందుబాటులో లేకుండాపోయాయి.
మా అమ్మ. బాపు చనిపోయిన తరువాత వాటి ఉనికి పూర్తిగా ప్రశ్నార్ధకం అయిపోయింది. వాళ్ల జ్ఞాపకంగా పాన్‌దాన్‌ని మా పెద్ద వదిన తీసుకుంది. ఉగల్‌దాన్‌లు ఏడ పోయినయో తెలియదు. కొన్ని వస్తువులు వాటిని వాడిన మనుషులతోబాటూ అదృశ్యమైపోయాయి. మరికొన్ని వారి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ఉగల్‌దాన్ అదృశ్యమైంది. పాన్‌దాన్ జ్ఞాపకంగా మిగిలింది. నిజానికి అవి రెండూ మా మనస్సులలో అలాగే వున్నాయి .మా అమ్మ బాపు మాదిరిగా.
Also Read : అంతరంగం: అర్థం పర్థం వదిలిన నామం
మంగారి రాజేందర్ జింబో
94404 83001