కథా-సంవేదన: ఆత్మగౌరవం

Update: 2022-08-28 19:30 GMT

ఆ కోర్టుకి కొత్తగా మేజిస్ట్రేట్ బదిలీ అయి వచ్చాడు. అతను యువకుడు. 35 సంవత్సరాల లోపు వయసు. ఆ కోర్టులో కేసుల సంఖ్య ఎక్కువ. వాటిని ఎలా తగ్గించాలోనని ఆలోచిస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో కోర్టు సూపర్నెంట్ అతని దగ్గరకు వచ్చాడు. ఆ రోజు శనివారం కాబట్టి కోర్టు పని లేదు. 'విచారణ ఖైదీల కేసులు ఎక్కువగా ఉన్నాయి. వాటిని త్వరగా పరిష్కరించమని జైలు సూపర్నెంట్ కోరుతున్నాడు. ఓ పూట మిమ్మల్ని వచ్చి కలుస్తానంటున్నాడు' అన్నాడు మేజిస్ట్రేట్‌తో. ఎన్ని కేసులు వున్నాయి? అడిగాడు మేజిస్ట్రేట్. 50 దాకా వుండవచ్చు సార్. అన్నీ చిన్న కేసులేనని చెప్పాడు.

*

ఆ ఫైల్స్ నా ముందు పెట్టమని చెప్పు. ప్రతి శనివారం కొన్ని కేసులని పరిష్కరిద్దాం. జైలు సూపర్నెంట్‌కి కూడా చెప్పు అన్నాడు మేజిస్ట్రేట్. సరేనని వెళ్లిపోయాడు అతను. వచ్చే శనివారానికి ఓ పది కేసులని పోస్ట్ చేశాడు మేజిస్ట్రేట్. ముద్దాయిలు ఏడాది నుంచి జైలులో ఉన్నారు. వారి నేరాల గురించి కూడా కోర్టు ప్రశ్నించలేదు. అలాంటి కేసులనే ఎంపిక చేశాడు. శనివారం రానే వచ్చింది. ఉదయం 11 గంటలకు ముద్దాయిలను కోర్టుకి తీసుకొచ్చారు. అన్ని కేసులలో నేరారోపణ పత్రాలు సిద్ధం చేసి ఉంచాడు స్టెనోగ్రాఫర్.

బెంచీ క్లర్క్ ఫైల్స్‌తో పాటు సిద్ధంగా ఉన్నాడు. మొదటి కేసుని పిలిచారు. బేడీలు తొలగించి అతడిని కోర్టులో ప్రవేశపెట్టారు. అతని మీద ఉన్న ఆరోపణ సైకిల్ దొంగతనం. నేరం చేశావా? కేసు నడిపించుకుంటావా? అడిగాడు మేజిస్ట్రేట్. దొంగతనం చేశానని అతడు ఒప్పుకున్నాడు. ముద్దాయి జైలులో ఉన్న కాలం మటుకు మాత్రమే జైలు శిక్షను విధించారు మేజిస్ట్రేట్. అతను సంతోషంతో రెండు చేతులు జోడించి బయటకు వెళ్లిపోయాడు.

*

ఆ తరువాత మరో కేసును పిలిచారు. జేబు దొంగతనం చేశాడని ఆరోపణ. మేజిస్ట్రేట్ అడగగానే నేరాన్ని ఒప్పుకున్నాడు. అతను జైలులో ఉన్న కాలం వరకు జైలు శిక్షను విధించారు. ఆ విధంగా మరో ఐదు కేసులని పరిష్కరించారు. వాళ్లు జైలులో ఉన్నకాలం వరకే శిక్ష విధించారు. ముద్దాయిలందరూ జైలు నుంచి విడుదల అవుతారు. అందరిలోనూ ఆనందం. కేసులను పరిష్కరిస్తున్నందుకని మేజిస్ట్రేట్‌కు కూడా ఆనందంగానే వుంది. ఎనిమిదవ కేసుని పిలిచారు. ముద్దాయి మహిళ. పేరు శకుంతల. చీరెను దొంగతనం చేసిందని ఆరోపణ.

ఆమె పని చేస్తున్న ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. మీరు చీరెను దొంగతనం చేశారా? ప్రశ్నించాడు మేజిస్ట్రేట్. ఎలాంటి దొంగతనం చేయలేదని చెప్పింది. మేజిస్ట్రేట్ ఆశ్చర్యపోయాడు. ఆమెకు సరిగ్గా అర్థమైందో లేదోనని వివరంగా మళ్లీ చెప్పాడు. తిరిగి అదే సమాధానం వచ్చింది. కోర్టులో ఉన్న న్యాయవాదులు, పోలీసు కానిస్టేబుల్‌తో పాటు అందరూ ఆమె సమాధానం విని ఆశ్చర్యపోయారు. చేసేదేమీ లేక కేసుని వాయిదా వేశాడు మేజిస్ట్రేట్. వచ్చే వాయిదాకి సాక్షులని తీసుకురావాలని పోలీసులను ఆదేశించాడు.

*

మిగిలిన రెండు కేసులలోనూ దొంగతనం చేశామని ఒప్పుకున్నారు. వాళ్లు ఎంతకాలం జైలులో ఉన్నారో అంతే శిక్షను వాళ్లకి విధించాడు మేజిస్ట్రేట్. శకుంతల తన కేసుని ఎందుకు ఒప్పుకోలేదో అతనికి అర్ధం కాలేదు. ఆమెతో మాట్లాడాలని అన్పించింది. వెంటనే ఆమెను చాంబర్‌లో హాజరు పరచమని ఆదేశించాడు. కాసేపటికి ఇద్దరు మహిళా పోలీసులు ఆమెను తీసుకొని చాంబర్‌కు వచ్చారు.

నేరాన్ని ఎందుకు ఒప్పుకోలేదమ్మా? ఒప్పుకుంటే జైలులో వున్న కాలం వరకే శిక్షని వేసేవాడిని కదా? అడిగాడు మేజిస్ట్రేట్. 'సార్ ఆ విషయం నాకు అర్థమైంది. కానీ, నా మనస్సు అంగీకరించలేదు. ఎందుకంటే, నేను ఆ దొంగతనం చేయలేదు. ఎందుకు ఒప్పుకోవాలి సార్? బయటకు దొంగగా పోవడం నాకిష్టం లేదు' ప్రశాంతంగా జవాబు చెప్పింది.

*

మీకెవరూ లేరా? 'పిల్లలు లేరు. భర్త నన్ను వదిలిపెట్టి వెళ్లిపోయాడు. పాచి పని చేస్తూ బతుకుతున్నాను. అనుమానం మీద కేసు పెట్టారు. ఆ చీరెను నేను ఎప్పుడు చూడలేదు కూడా' చెప్పింది. ఇంకా ఎలాంటి ప్రశ్నలు అడగాలని మేజిస్ట్రేట్‌కు అనిపించలేదు. కేసుని త్వరగా పరిష్కరించాలనుకున్నాడు. ఆ కేసునే కాదు, సాధ్యమైనంత వరకు అన్ని కేసులని త్వరగా పరిష్కరించాలనుకున్నాడు. ఆమె జవాబులో న్యాయం ఉందని అనిపించి శకుంతలకి రెండు చేతులతో నమస్కారం చేశాడు. స్వేచ్ఛా? ఆత్మగౌరవమా? ఆత్మగౌరమే అనిపించింది మేజిస్ట్రేట్‌కు.

మంగారి రాజేందర్ జింబో

94404 83001

Tags:    

Similar News

పిల్లలంటే!