రాజుకి కోపంగా వుంది. అందరిని మంచిగా చూస్తునప్పటికీ, అక్కడక్కడ కొంత మంది తన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దాన్ని ఆయన భరించలేకపోతున్నాడు. ఉచిత బియ్యం ఇస్తున్నాను. ఆ బంధూ, ఈ బంధూ ఇస్తున్నప్పటికీ తనని విమర్శించేవాళ్లు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. అందుకు రాజుకి విసుగ్గా ఉంది. కోపంగా ఉంది. తనని విమర్శించేవాళ్లని నరికి వేయాలన్నంత కసిగా ఉంది. చివరికి భటున్ని కేకేసి పిలిచాడు. 'చెప్పండి మహప్రభూ' అన్నాడు భటుడు చేతులు కట్టుకొని వినయంగా. 'వెంటనే మహామంత్రిని ఇక్కడ హాజరు పరుచు' అని అజ్ఞాపించాడు. భటుడు తలవూపి రాజుకి నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఓ పదిహేను నిమిషాల తరువాత భటుడు రాజు దగ్గరికి వచ్చాడు. అతని వెనకే మహామంత్రి వచ్చి రాజుకి నమస్కారం చేసి చేతులు కట్టుకొని నిల్చున్నాడు. 'కూర్చోండి మహామంత్రీ' అన్నాడు రాజు. మహామంత్రి కూర్చోలేదు. మహారాజు తిరిగి గట్టిగా అన్న తరువాత అక్కడ వున్న చిన్న ఆసనం మీద కూర్చున్నాడు. 'మహామంత్రీ గమనిస్తున్నారా ప్రజలని' ప్రశ్నించాడు మహారాజు. మహారాజు ఏ విషయం గురించి అడుగుతున్నారో అర్థం కాక, జవాబు చెప్పలేక తల గోక్కున్నాడు మహామంత్రి. 'మాట్లాడరేమిటీ మహామంత్రీ, ప్రజల గొంతులని గమనించడం లేదా? రోజురోజుకీ ప్రభుత్వాన్ని విమర్శించేవాళ్ల సంఖ్య పెరిగిపోయింది' అన్నాడు గట్టిగా మహారాజు.
విషయం అర్థమైంది మహామంత్రికి. 'రాజా, అది విమర్శ కాదు. భిన్నాభిప్రాయాలు అంతే' !అన్నాడు గొంతు నిండా వినయం నింపుకొని. 'ప్రజలు రాజ్యం గురించి, రాజు గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మీకు భిన్నాభిప్రాయాల మాదిరిగా అనిపిస్తోందా? మీ మెతక ధోరణి చూసే ప్రజలు ఆ విధంగా మాట్లాడుతున్నారు' అన్నాడు మహారాజు కోపంగా. తాను పొరపాటు మాట్లాడానన్న విషయం మహామంత్రికి అర్థమైంది. 'క్షమించండి మహారాజా, కొంత మంది ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు' అన్నాడు సర్దుకొని. 'అలా మాట్లాడుతున్న వ్యక్తుల లిస్ట్ తయారు చేసి నాకు ఇవ్వండి. అందులో ఎవరెవరిని ఏ రోజు, ఎలా ఎన్‌కౌంటర్ చేయాలో నేను చెబుతాను' అన్నాడు రాజు.
మహామంత్రికి ఎన్‌కౌంటర్లంటే భయం. ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు తప్ప ప్రభుత్వాన్ని సీరియస్‌గా విమర్శించడం లేదు. కొన్ని విషయాల మీద తమ అభిప్రాయాలని వ్యక్తపరుస్తున్నారు. అందుకని రాజుతో 'మహారాజా, వాళ్లు తీవ్రవాదులు కాదు. రేపిస్టులు కూడా కాదు. గూండాలు కూడా కాదు. వాళ్లని మనం ఎన్‌కౌంటర్ చేస్తే ప్రజలలో తిరుగుబాటు వచ్చే అవకాశం వుంది. వేరే విధంగా వాళ్లను నియంత్రిస్తే బాగుంటుందేమో' అన్నాడు భయపడుతూ మహామంత్రి.
మంత్రి మాటలతో రాజు ఆలోచనలో పడ్డాడు. మంత్రి చెప్పిన మాటల్లో కొంత వాస్తవం వున్నట్టు అన్పించింది రాజుకి. 'వాళ్ల మీద రాజద్రోహం కేసులు పెట్టి జైళ్లల్లో పెడదామా?' అడిగాడు మంత్రిని. 'అది కూడా బాగుండదేమో మహారాజా! చాలా మంది విమర్శిస్తున్నారు. వాళ్లని జైళ్లలో పెడితే మన జైళ్లు కూడా సరిపోవేమో' అన్నాడు మహామంత్రి. ఇంతలో సేవకుడు వచ్చి మంత్రికి ఏదో పానీయం అందించాడు. మహారాజు సూచన మేరకు పానీయం తాగి, కాసేపు ఆలోచించి రాజుతో ఇలా అన్నాడు.
'మహారాజా, మన రాజ్యంలోని ప్రజల గృహాలు చాలా వరకు అనుమతి లేకుండా కట్టినవే. అనుమతి తీసుకొని కట్టినవాళ్లు కూడా మనం ఏర్పరచిన నియమాలని అతిక్రమించి కట్టినవే. మనం ఇచ్చిన అనుమతి ప్రకారం కట్టిన ఇళ్లు మన రాజ్యంలో లేవనే చెప్పవచ్చు' 'అయితే?' అన్నాడు మహారాజు. 'ఎవరైతే మన పాలనని విమర్శిస్తున్నారో, అందులో ముఖ్యులని ఎంపిక చేసి మన బుల్డోజర్లతో వాళ్ల గృహాలని కూల కొడదాం. అలా ఒకరిద్దరివి కూల కొడితే మిగతావాళ్లు భయపడతారు. తమ ఇండ్లు కూడా ఎక్కడ కూలిపోతాయోనని భయపడతారు. ఎవరూ కూడా గొంతు ఎత్తరు. విమర్శ కాదు కదా మాట్లాడానికే భయపడతారు' సవినయంగా రాజుకి చెప్పాడు మంత్రి.
రాజుకి ఈ సలహా నచ్చింది. వెంటనే సేనాధిపతిని పిలిచి నాలుగు బుల్డోజర్లు తెప్పించాడు. వేగులని పిలిచి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నలుగురు వ్యక్తులను గుర్తించమన్నాడు. వాళ్ల గృహాలను కూలగొట్టే బాధ్యత మహామంత్రికి, సేనాధిపతికి అప్పగించాడు. ఆ రకంగా ఆ రోజు నుంచి ఆ రాజ్యంలో బుల్డోజర్ పాలన మొదలైంది. గొంతు పెగుల్చుకున్నా ఎవరి గొంతు నుంచి ఒక్క మాటా బయటకు రాకుండాపోయింది.
మంగారి రాజేందర్ జింబో
94404 83001