అసమాన హీరో చిరంజీవి

ప్రాణంఖరీదు’ సినిమాతో తెరంగేట్రం చేసిన హీరో చిరంజీవి ‘ఖైదీ’ సినిమాతో మెగా స్టార్‌గా మారారు. తెలుగు ప్రేక్షకుల గుండెలలో డేరింగ్-డాషింగ్

Update: 2022-08-21 19:30 GMT

ప్రాణంఖరీదు' సినిమాతో తెరంగేట్రం చేసిన హీరో చిరంజీవి 'ఖైదీ' సినిమాతో మెగా స్టార్‌గా మారారు. తెలుగు ప్రేక్షకుల గుండెలలో డేరింగ్-డాషింగ్-డైనమిక్ హీరో-సుప్రీం హీరోగా నిలచిపోయారు. మగ మహారాజు, కొదమ సింహం, కొండవీటి దొంగ, అడవిదొంగ, స్టేట్ రౌడీ, దొంగ మొగుడు, యముడికి మొగుడు, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, జ్వాల, రక్త సింధూరం, విజేత, జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, హిట్లర్, రుద్రవీణ, మంచు పల్లకి, అన్నయ్య, చూడాలని వుంది, శంకర్‌దాదా ఎంబీబీఎస్, స్వయంకృషి, ఠాగూర్, ఖైదీ నం.150 వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి తెలుగునాట నంబర్ వన్ హీరోగా అవతరించారు.

తెలుగు రాష్ట్రాలలో అశేష అభిమానులను సంపాదించుకున్నారు. 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల అంజనిదేవీ- వెంకటరావు దంపతులకు తొలి సంతానంగా జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు శివశంకర వరప్రసాద్. చిరంజీవిగా వెండితెరకు వెలుగులు నింపారు. పాత, మధ్య, కొత్త తరం నటులకు, కళాకారులకు ఆదర్శంగా నిలిచారు. డ్యాన్స్, పైట్స్, డైలాగ్స్‌తో విజేతగా నిలిచారు. కల్మషం లేని చిరునవ్వుతో అన్నయ్యగా అందరి ఆప్యాయతను అందుకున్నారు.

ఎందరికో మార్గదర్శకంగా

శ్రీకాంత్ వంటి ఎందరో యువ హీరోలకు, ఉత్తేజ్‌లాంటి ఎంతో మంది నటులకు చిరంజీవికి మార్గదర్శకంగా నిలిచారు. అన్నయ్య నటించిన సినిమా ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ప్రతి సినిమాలో సామాజిక సందేశం ఉంటుంది. కష్టం విలువ తెలిసినోడు. ఆయన మాట విలువైన సంపద. అన్నయ్య సినిమా వచ్చిందంటే అభిమానులకి పండుగ. 1990లలో గ్రామాలలో ప్రొజెక్టర్ ద్వారా సినిమాలు ప్రదర్శించేవారు. ఆ తర్వాత వీడియో క్యాసెట్లు వచ్చాయి. మా గ్రామంలో సత్తయ్యగౌడ్ వీడియో ద్వారా సినిమాలు ప్రదర్శించేది. చిరంజీవి సినిమాలు అంటే ఆదరణ ఎక్కువగా ఉండేది. అభిమాన సంఘం ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాం. 1998 అక్టోబర్ 2న చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్థాపించిన తర్వాత సేవా కార్యక్రమాలు విస్తృతంగా ముందుకెళ్లాయి.

1998 నవంబర్ 21న దుబ్బాక నుండి చిరంజీవి అభిమానులదరం కలిసి హైదరాబాద్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేశాం. నేత్ర దానం పత్రాలు సమర్పించాం. పేదవారికి తోచిన మేరకు సహాయం చేశాం. మిత్రులు ఆకుల శ్రీనివాస్, బంటు వాసు, అల్వాల టైలర్ జహంగీర్, తోగుట శ్రీనివాస్, నార్సింగి శ్రీనివాస్, యాదగిరితో కలిసి దుబ్బాక, మిరుదొడ్డి, తొగూట, దౌల్తాబాద్, చేగుంట, నార్సింగి, రాయపోల్ తదితర గ్రామాలు తిరిగాం. ప్రజారాజ్యం పార్టీ ప్రారంభించినప్పుడు మీటింగ్‌లో పాల్గొన్నాం. చిరు తిరుపతి ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యునిగా, 2012 ఆగస్టు 27 నుంచి 2014 మే 26 దాకా కేంద్ర పర్యాటక శాఖా మంత్రిగా పని చేశారు. 2006లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. 150 చిత్రాలలో నటించారు. ఎన్నో నంది అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు, రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చాయి.

అందరికీ అండగా

తెలుగు రాష్ట్రాలలో అశేష అభిమానులను సంపాదించుకున్న ఏకైక హీరో చిరంజీవి. ఆయన ఆధ్వర్యంలో ఎన్నో సహాయ కార్యక్రమాలు నడుస్తున్నాయి. తుపాన్ బాధితులను ఆదుకోవడంలో చిరంజీవి ముందున్నారు. కరోనా కాలంలో వందలాది కుటుంబాలను ఆదుకున్నారు. సినిమా కార్మికులకు అండగా ఉన్నారు. తెలుగు సిని'మా'కు చిరంజీవి పెద్ద దిక్కు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సాన్నిహిత్యం ఉంది. సినిమా కార్మికులకు ఇది కావాలని చిరు అడిగితే ఇద్దరు సీఎంలు కాదనలేరు. అన్నయ్య కోసం ఎంత రాసిన తక్కువే. అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు.

 చిటుకుల మైసారెడ్డి,

జర్నలిస్ట్, కాలమిస్ట్

సిద్దిపేట. 94905 24724

Tags:    

Similar News

పిల్లలంటే!