సమీక్ష: అరుదైన భావాల సమ్మేళనం
సమీక్ష: అరుదైన భావాల సమ్మేళనం... book review
ఇది వరకే సౌగంధిక, సౌపర్ణిక పేర్లతో రెండు గజల్ సంపుటాలను అందించి పేరొందిన కవి సూరారం శంకర్. నీహారిక పేరుతో మరో 68 ఆకట్టుకునే గజళ్లను సంపుటిగా వెలువరించారు. గజళ్లను రాయటం కష్టమే అయినా, ఇష్టం పెంచుకుని సృజనతో ముందుకు సాగారు. దీంతో అద్భుతమనిపించే గజళ్లు ఆవిష్కృతమవుతాయని ఈ సంపుటి స్పష్టంగా నిరూపించింది. కవి సమయం, తాత్త్వికత, చమత్కారం, విశ్వజనీనత, సర్వకాలీనత, భావగర్భితం, భావ సమన్వయం, భావుకత, మృదుత్వం, కోమలత్వం, సౌకుమార్యాల వంటి ప్రత్యేకతలతో నీహారికలోని గజళ్లు మెరిసాయి.
గజల్‌లో వాడవలసిన భాష, గతులు, కొలతలు, ఛందస్సు వంటి ప్రామాణిక విషయాల మీద సంపూర్ణ అవగాహనతో రూపకల్పనకు కవి పూనుకున్నట్టు స్పష్టమవుతున్నది. గజళ్లలో నాద పరిపూర్ణత వ్యక్తమైంది. నిర్మాణంలో శబ్ద, భావ సౌందర్యాలను బలంగా పాటించారు. అంత్యప్రాసలతో శంకర్ ఈ గజళ్లను ఎంతో హృద్యంగా రాసి మెప్పించారు.
మదిని తాకేలా
'అందమైన రాగానికి మెట్లు చెక్కుతున్నా / అరుదవు ఆనందానికి గుట్టు విప్పుతున్నా' అన్న గజల్‌లో ఎడద మీటే పద సవ్వడిని కవితగా తరగలెత్తించారు. ఆశావాదం, సౌందర్య దర్శనం ఇందులోని ప్రతి గజల్‌లో తారాడుతాయి. తీరని దాహంతో సాగర తీరానికి చేరుకునే పరితపనను కవి గజల్‌లో ఎంచుకున్న ప్రతిపదం వక్తం చేసింది. ఎంతో కవితా తాత్త్వికతతో గజళ్లు పరిమళించాయి. 'నదులను చూసి నడకలు నేర్చిన పయనం నాది / పికమును చూసి స్వరములు కూర్చిన కవనం నాది అన్న కవి ఆత్మ బలంగా వెల్లడైంది.
'వసంతాన్ని పల్లవిగా పాడడం తెలుసు / ముళ్లపైన హుందాగా నడవడం తెలుసు' అన్న గజల్ వాక్యాలు కవిలోని భావ గర్భిత కవిత్వానికి ఉదాహరణలుగా నిలిచాయి. 'నీకు తెలియని నేను ఒక కల, గాయం తెలియని వాడొకడు గాయం గురించి చెబుతాడు, భావం ఎదిగీ ఎదిగీ రాగంగా మారి, గజలంటే తుహిన కణం తాకినట్టుండాలి' వంటి మొత్తం భావాత్మతను కలిగిన గజళ్ల సచిత్రంగా ఈ సంపుటిలో ఉన్నాయి.
ప్రతులకు:
సూరారం శంకర్
99489 63141
పేజీలు 133: వెల రూ. 250
సమీక్షకులు
తిరునగరి శ్రీనివాస్
84660 53933