అస్సామీ సాంస్కృతిక బావుటా... భూపేన్ హజారికా
అస్సామీ సాంస్కృతిక బావుటా... భూపేన్ హజారికా
దిశ, వెబ్ డెస్క్ : 'దిల్ హూం హూం కరే ఘబ్ రాయే..', 'విస్తార్ హాయ్ అపార్ ప్రజా దోనో పార్'.. భూపేన్ హజారికా రాసిన నిరుపమానమైన ఈ పాటలు వినగానే దుఖం, వేదన, కోపం, ఆవేశం, ఆలోచన ఒకటేమిటి అనేక భావాలు ఉత్తుంగ తరంగంగా మనలో మెదులు తాయి..మనసంతా అదుపు తప్పుతుంది.. అచేతనమయిపోతుంది.. మనసంతా కలి కలి..కలకలం.. ఒక్క మీరూ నేనే కాదు.. మన దేశమే కాదు.. సమస్త ప్రపంచమూ భూపేన్ హజారికా పాటలకూ సంగీతానికీ దాసోహం ఆన్నది. మైఖేల్ జాక్సన్ ని అభిమానించిన వారు సైతం భూపేన్ స్వరానికీ, సంగీతానికీ .. ఊగిపోయారు. భూపేన్ దా ఈశాన్య భారతావనిలో పుట్టిన వాడు. అక్కడి సంగీతాన్నీ సాహిత్యాన్నీ, జీవితాల్నీ సంగీత ప్రపంచానికి పరిచయం చేసి ఓహో అనిపించారు. మనుషుల్ని వారి మనసుల్నీ భూపేన్ హజారికా ఇట్టే పట్టేస్తాడు.. తన పాటల వెంట లాగేసుకుంటాడు.. హజారికా గీతాల్లో అస్సాం కనిపిస్తుంది.. ఆయన పాటల్లో ఆసామీ ప్రజలు వినిపిస్తారు.. ఆ గానంలో ఒంటరితనమూ వుంది.. సామూహిక స్వరమూ ధ్వనిస్తుంది.. భూపేన్ హజారికా కేవలం అస్సాం జానపద పాటలు పాడడు.. మొత్తంగా అస్సామీ సంస్కృతిని ఆవాహనం చేసుకుని హృదయాన్ని ఆవిష్కరిస్తాడు..
..........................
దిల్ హూం హూం కరే ఘబ్ రాయే..
ఘన్ దం దం కారే
గర్ జాయే
ఏక్ భూంద్ క భీ పానీ కీ
మోరి అఖియోన్ సే బర్సాయే
తేరి ఝోరీ దారూన్ సబ్ సూఖే పాత్ జో ఆయే తేరా చువాన్ లాగే మేరి సూఖీ దాల్ హరియాయే
జిస్ తనకో చువాన్ తూనే అస్ తన కో చుపావూన్ జిస్ మనకో లగే నయినా వొహ్ కిసకో దిఖావూన్
ఓ మేరె చంద్రమా తేరి చాందినీ అంగ్ జలాయే ఊంచి తొర్ ఆతారీ మైనే పంఖ్ లిఏ కత్వాయీ
................
ఆ ఆవారా హూన్ జమీసే చల్తే ఝలక్ ది బహాతే ధరియాకి ధారా హూన్..
యహాన్ కా వహాన్ కా కహీ కా నహూ దిశా వొంకా మారరా హున్
....................
విస్తార్ హాయ్ అపార్ ప్రజా దోనో పార్
కరే హా హా కార్
నిశబ్ద్ సదా ఓహ్ గంగా తుమ్ బహతీ హాయ్ క్యోన్
నైతికతా నష్ట్ హివీ, మానవతా భ్రష్ట హువీ
నిర్లజ్య భావ్ సే బహతీ క్యాన్..
...................
బ్రహ్మపుత్ర వాగ్గేయకారుడు
‘సుధాకాంత’, ‘బ్రహ్మపుత్ర వాగ్గేయకారుడు’(బాలడ్ ఆఫ్ బ్రహ్మపుత్ర)గా సుప్రసిద్దుడయిన భూపేన్ హజారిక కవి, రచయిత, సంగీత దర్శకుడు, గాయకుడు, సినిమా దర్శకుడు, జర్నలిస్ట్. అంతే కాదు ఆయనకాయనే తానో జాజాబోర్ (దేశద్రిమ్మరి) అని ప్రకటించుకున్న కళాకారుడు. అస్సామ్ జానపద సంగీతానికి కొంత శాస్త్రీయ సంగీతాన్ని మేళవించి ప్రపంచాన్ని మంత్ర ముగ్ధుల్ని చేసారు. ఆయన రచనల నిండా మానవీయత, మతసామరస్యం, సహానుభూతి నిండి వుంటాయి. ఆసామీ, బెంగాలీ, హిందీ భాషల్లో గానం చేసి ప్రపంచ ఖ్యాతిని ఆర్జించారు. భూపెన్ హజారికా ఈశాన్య భారతంలో అస్సామీ చలనచిత్ర వైతాళికుడు. ఆ రాష్ట్రంలో మొట్టమొదటి ఫిలిం స్టూడియో నిర్మించింది ఆయనే. ప్రపంచానికి అస్సామీ సినిమాను పరిచయం చేసింది కూడా ఆయనే.
ఆదివాసీ తల్లుల పాలు తాగి...
భోపెన్ హజారికా 1926 సెప్టెంబర్ 8న అస్సాం లోని సదియా గ్రామంలో జన్మించాడు. ఆయన పుట్టిన ప్రాంతమంతా ఆదివాసీలు నివసించే ప్రాంతం. అక్కడి మహిళలు గొప్పగా నృత్యం చేస్తూ పాటలు పాడేవాళ్ళు. బాల్యం లోని ఆ సంగీతం పాటలు భూపేన్ మనసులో నాటుకు పోయాయి. బాల్యంలోనే ఒక రోజు ఆదివాసీ మహిళలతో కలిసి వెళ్ళిపోయాడు. భూపేన్ తల్లిదండ్రులు ఆందోళనతో అంతటా వేడికి వేసారి దొరక్క పోవడంతో తీవ్రంగా ఆందోళన చెందారు. మర్నాడు ఉదయం ఆ మహిళలే పిల్లాన్ని తెచ్చి అప్పగించడంతో. వీడు తల్లి పాలు తాగే వాడు కదా రాత్రంతా ఎట్లా వున్నాడు అని అడిగితే ఆదివాసీల మహిళలే తమ పాలిచ్చి పడుకో బెట్టామని చెప్పారు. అట్లా చిన్న నాటినుండే ఆదివాసీ ఆట పాటలు భూపేన్ లో అంతర్భాగమయి పోయాయి. భూపేన్ తల్లి శాంతి ప్రియా హజారికా, తండ్రి నీలకంఠ. వారి కుటుంబంలో పలువురు టీచర్లుగా పని చేసేవారు. పది మంది సోదర సోదరీ మణులలో భూపేన్ పెద్దవాడు. చిన్నప్పుడు గౌహతి, తేజ్పూర్ లలో ఆయన విద్యాభ్యాసం సాగింది. అనంతరం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో 1944లో బీ.ఎ., 1946లో ఎం.ఏ పూర్తి చేసాడు.
బాల ప్రతిభాశాలి
భూపేన్‌కు చిన్న తనం నుండే పాటలు రాయడం పాడడం స్వభావ సిద్ధంగా అబ్బింది. ఆరవ తరగతి చదువుతూ ఉండగానే తన తొలి పాట రాసాడు. దానికి అవార్డును కూడా గెలుచుకున్నాడు. అదంతా విన్న ప్రముఖ సంగీతజ్ఞులు జ్యోతిప్రసాద్ ఆగర్వాల, విష్ణు రాఖాలు హజారికాను కలకత్తా తీసుకెళ్ళి సంగీతం లో శిక్షణ ఇప్పిస్తామని తీసుకెళ్ళారు. అప్పుడే బెంగాలీ సినిమాలో పాటలు పాడించారు. అట్లా మొట్టమొదటి సారి హజారికా ‘జాయ్ మతి’, ‘శోనిత్ కున్వారీ’ సినిమాల్లో పాటలు పాడి బాల ప్రతిభాశాలిగా పేరు తెచ్చుకున్నాడు. అప్పటికి తన స్వరం పూర్తిగా పరిపక్వం కాకపోవడం తో ఆయన పాడిన పాటల్ని ఆ సినిమాల్లో కథానాయికలకు వాడారు. తర్వాత అస్సాం లో రూపొందిన మొదటి సినిమాలో పాడాడు. అప్పటికి అక్కడ రికార్డింగ్ వసతి లేక పోవడం తో షూటింగ్ కి సమాంతరంగా పాడి విజయవంతంగా నిలిచాడు. ఇక తాను తన బనారస్ చదువులు పూర్తి అయ్యాక కొంత కాలం అద్యాపకుడిగా పనిచేసాడు. ఆ తర్వాత ఆకాశవాణిలో చేరాడు. అనంతరం హజారికాకు స్కాలర్షిప్ రావడంతో కొలంబియా విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. అక్కడ ‘భారతదేశంలో వయోజన విద్యారంగంలో దృశ్య శ్రవణ పద్ధతుల్ని వినియోగించడానికి చేపట్టాల్సిన మౌలిక చర్యలు’ అన్న అంశం పైన డాక్టరేట్ చేసారు.
ప్రేయసికి పెళ్లయింది... మనం పెళ్లాడదామా?
అక్కడ ఉండగానే “జై రఘునందన్..’ అన్న నృత్య గీతానికి హాజారిక స్వరాన్నీ సంగీతాన్ని సమకూర్చాడు. ప్రియంవదా పటేల్ నృత్యం చేసింది. తర్వాత పెద్ద ధనికురాలయిన ప్రియంవద భూపేన్ హజారికాను ప్రేమించి వివాహం చేసుకుందామని అడగడంతో తాను ఇప్పటికే ఒక అమ్మాయికి మనసిచ్చానని హజారికా చెప్పడంతో హతాశురాలయిన ప్రియంవద మరి ఆమెను పెళ్లి ఎందుకు చేసుకోలేదు అని అడిగింది. ఆ అమ్మాయికి ఇప్పటికే పెళ్లి అయిపొయింది అన్నాడు భూపేన్. మరింకేముంది మనం పెళ్లి చేసుకోవచ్చుకదా అని ఆమె ప్రోత్సహించడం తో హజారికా అంగీకరించి ముందుకొచ్చాడు. కానీ వారి ఇండ్లల్లో ఇద్దరి పెద్దలు అంగీకరించక పోవడంతో స్నేహితులు కలిసి వారికి వివాహం చేసారు. వారిద్దరికీ 1951లో ఒక కొడుకు జన్మించాడు.
సంగీతం... దర్శకత్వం
తర్వాత ఇండియా వచ్చిన భూపేన్ హజారికా క్రమంగా బెంగాలీ సినిమాలకు సంగీతం అందించడం మొదలు పెట్టాడు. ‘ఎరా బతుర్ సుర్’, ‘శకుంతల’, ‘ప్రతిధ్వని’, ‘లోతి ఘోటి’, ‘చిక్మిక్ బిజిలీ’, ‘మొన్ పతి’, ‘స్వికరోక్తి’, ‘సిరాజ్’ లాంటి అనేక సినిమాలకు సంగీతం తో పాటు పాటలూ పాడారు. తానే స్వయంగా ‘మాహుత్ భండూరే’ లాంటి సినిమాల్ని రూపొందించాడు. ఇంకా అరుణాచల్ ప్రేదేశ్ లో మొట్ట మొదటి హిందీ కలర్ సినిమా ‘మేరా ధరం మేరి మా’ సినిమాను నిర్మించడంతో బాటు దర్శకత్వం సంగీత దర్శకత్వ బాధ్యతల్నీ తీసుకున్నారు. ఇంకా ఆయన అరుణాచల్ రాష్ట్రం కోసం ఆదివాసీ నృత్య సంగీతం లతో కూడిన ‘హూం ద సన్ శైన్స్’ అన్న డాక్యుమెంటరీ తీసారు. అస్సాంలోని సహాకార ఉద్యమం పైన హజారికా ‘ఎముథీ సౌ లార్ కహాని’ డాకుమెంటరీ ని , ‘త్రూ మెలోడీ అండ్ రిధం’ పేర కలకత్తా దూరదర్శన్ వాళ్ళకోసం మంచి డాక్యుమెంటరీ తీసారాయన. ఇంకా అనేక డాక్యుమెంటరీ చిత్రాలకు సంగీతం అందించడం తో పారు నిర్మించారు కూడా.
తప్పని ఒంటరితనం
క్రమంగా ఆర్థికస్థితి మెరుగు పడింది. ఇంతలో హేమంత్ కుమార్ హజారికాకు లతా మంగెష్కర్ను పరిచయం చేసాడు. హజారికా క్రమంగా హిందీ సినిమా వైపునకు తన ప్రయాణం ఆరంభించాడు. అప్పుడు ఇండియా వచ్చిన ప్రియంవద అక్కడ హజారికకు ఇతర మహిళలతో సంబంధం వుందని భావించింది. అనేక వాద వివాదాల తర్వాత విడాకులు తీసుకుంది. కానీ చివరంటా స్నేహంగా ఉండేందుకు నిర్ణయించుకున్నారు.. కొడుకుతో ప్రియంవద అమెరికా వెళ్ళిపోయింది. హజారికా ఒంటరి అయిపోయాడు. అప్పుడే కలకత్తా లో హేమేంద్ర ప్రసాద్ బరూవా ‘ఏకే పల్’ సినిమాను నిర్మించ తలపెట్టాడు. ఆ సినిమా దర్శకురాలు కల్పనా లాజ్మీని భూపేన్ హజారికా కు పరిచయం చేసాడు. వారిద్దరి అభిప్రాయాలూ కలిసాయి. ఆమె చివరంటా భూపేంద్ర జీవితంలోనూ, వృత్తీ ప్రవృతిలోనూ తోడూనీడగా వుండి పోయింది. ఇన్నేళ్ళ తర్వాత కూడా భూపేన్ హజారికా అంటే తనకెంత ప్రేమో వ్యామోహమో అందామె.
భూపేన్ స్వతంత్ర అభ్యర్థి గా 1967 – 73 ల మధ్య అస్సాం లో శాసనసభ్యుడిగా పని చేసారు. అయితే 2004 లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గౌహతి నుంచి పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. ఆయన జీవితం, సృజనాత్మతల పైన వి.బోరా, అర్నాబ్ జాన్ దేఖాలు సంయుక్తంగా ‘మొయి ఇతి జాజోబార్’ (I am a wanderer) పేర పూర్తి స్థాయి డాక్యుమెంటరీ మొదలు పెట్టారు కానీ కారణాంతరాల వల్ల అది పూర్తి కాలేదు. ఈ లోగా సహదర్శకుడు అర్నాబ్ దేఖా ఆ ఫిలిం పైన. ‘అన్య ఏక్ జాజోబార్’, ‘మోర్ సునాకే భూపేంద్ర’ అన్న రెండు పుస్తకాలు రాసాడు. ఇక హిందీ సినిమాల విషయానికివస్తే కల్పనా లాజ్మీ తీసిన ‘ ఏకే పల్’ సినిమాకు హజారికా అందించిన సంగీతం విశేష ప్రశంసల్ని అందుకుంది. ఆ సినిమాలో షబానా ఆజ్మి, నసీరుద్దీన్ షా, ఫరూఖ్ షేఖ్ ప్రధాన భూమికల్ని పోషించారు. అస్సామీ భాషలో వచ్చిన గొప్ప చిన్న కథల్ని ఆధారం చేసుకుని కల్పనా లాజ్మీ టీవీ కోసం రూపొందించిన ‘లోహిత్ కినారే’ సీరియల్‌కి భూపేన్ దా గొప్ప సంగీతం అందించారు.
చరిత్ర సృష్టించిన 'రుడాలి'
ఇక “రుదాలి” చిత్రం భూపేన్ దా సంగీత జీవితంలో అత్యంత ప్రభావంతమయినదిగా పేరొందింది. అందులో ఆయన అందించిన సంగీతంలో భైరవి రాగంతో కలిపి అయిదు రాగాల్ని జానపద సంగీతంతో సమ్మిళితం చేసి సృష్టించారు. ఇందులో మొత్తం జై సల్మేర్ కు చెందిన సంగీత వాయిద్యకారులనే ఉపయోగించారు. రుడాలికి కల్పనా లాజ్మీ, గుల్జార్‌లు స్క్రీన్ ప్లే రాసారు. ఆ స్క్రీన్‌ప్లేను ముందుంచుకుని ఆ సినిమాకు సినిమాటోగ్రఫీ ని నిర్వహించిన సంతోష్ శివన్ తో ఒక్కో సీన్ నూ చర్చిస్తూ దానికి తగ్గట్టుగా సంగీతాన్ని రూపొందించారు. అందుకే ఆ సినిమాలో ఏ పాటా సినిమాకు గానీ, కథకు గానీ, కథనానికి ద్రుశ్యానికే గానీ వేరుగా అనిపించదు. అన్నీ సమ్మిళితమయిపోయి ప్రేక్షకుల్ని వాటిల్లో మమేకం చేస్తాయి. అందుకే రుడాలి పాటలు అప్పటికీ ఇప్పటికీ ‘సమయ్ ఓ దీరే చలో ‘ అంటూ శ్రోతల్ని మమేకత్వంలో నింపేస్తున్నాయి. రుడాలి లో డింపుల్ కపాడియా, రాఖీ, రాజ్ బబ్బర్, అమ్జద్ ఖాన్‌లు ప్రాధాన పాత్రల్ని పోషించారు. ఆ సినిమా జాత్జీయ అవార్డుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించింది.
అస్సామీ, బెంగాలీ చిత్రాల సంగీత స్రష్ట
ఇక అస్సామీ భాషలో వచ్చిన సినిమాల్లో అధిక శాతం సినిమాలకు భూపేన్ దా నే పాటలు రాసి పాడి సంగీతం అందించాడు. అంతే కాదు అనేక బెంగాలీ సినిమాలకు కూడా ఆయన సంగీత దర్శకత్వం వహించాడు. ‘జీబన్ త్రిష్ణ’, ‘జోనకిర్ ఆలో’, ‘మహిత్ బందూరే’, ‘కారి ఓ కోమల్’,’పింజర్’, ‘దంపతి’, ‘చమేలి మేమ్సాబ్’ లాంటి అనేక సినిమాలు అందులో వున్నాయి. హిందీ లో కల్పనా లాజ్మీ సినిమాలతో పాటు సాయి పరంజి పే తీసిన ‘పాపీహా’, బిమల్ దత్తా సినిమా’ ప్రతి మూర్తి’ లాంటి అనేక సినిమాలకు మ్యూసిక్ ఇచ్చాడు. ‘మిల గాయీ మంజిల్ ముజే’ సినిమాను ప్లస్ చానల్ రూపొందించగా లేఖ్ టాండన్ దర్శకత్వం వహించారు. సాయి పరంజి పే సినిమా ‘ సాజ్’ కూడా భూపెందా సంగీతం అందించాడు. పాన్ పిక్చర్స్ వారి ‘దర్మియాన్’ సినిమాకు కూడా సంగీతం తానే ఇచ్చాడు. ప్రఖ్యాత పేయింటర్ ఎం.ఎఫ్.హుస్సేన్ రచించి దర్శకత్వం వహించిన ‘గజ గామిని’ సినిమాకు భూపేన్ హజారికా అందించిన సంగీతం అద్భుతమయింది. ఇంకా లెక్క లేనన్ని డాక్యుమెంటరీలకు, టెలి సీరియల్స్ కు ఆయన సంగీతం విశేషప్రాచుర్యాన్ని తెచ్చింది. 2000 సంవత్సరంలో కల్పనా లాజ్మి సినిమా ‘దమన్’కు, 2003 లో ’ క్యోఁ’ సినిమాకు కూడా భూపేన్ డా సంగీత దర్శకత్వం వహించాడు. మొత్తంగా ఆయన 36 అస్సామీ సినిమాలకు, ఎనిమిది బెంగాలీ, అనేక హిందీ సినిమాలకు సంగీతం అందించాడు.
పాల్ రాబ్సన్‌తో భేటీ - అవార్డుల వెల్లువ
సంగీతమే తన మొదటి ప్రాముఖ్యత ‘మై ఫస్ట్ లవ్’ అని చెప్పిన భూపేన్ హజారికా సినిమా సంగీతం, పాటలతో పాటు అనేక ప్రైవేట్ ఆల్బమ్స్ తో శ్రోతల్నీ విశేషంగా అకర్శించాడు. భూపేన్ హాజారికా అమెరికాలో ఉన్నప్పుడే పాల్ రాబ్సన్‌ని కలిసాడు. అప్పుడే ఆయనకు భారతీయ జానపద పాటలకు గాను అమెరికాలో బంగారు మెడల్ లభించింది. భూపేన్ హజారికా అందుకున్న అవార్డులకు లెక్కేలేదు.ఆయనకు 1961 లో ఆసామీ సినిమా ‘శకుంతలకు’ జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం అవార్డు, 1967లో ఉత్తమ సంగీతానికి గాను ‘చమేలీ మేమ్సాబ్’కు, అవార్డులు లభించాయి. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్’, ‘పద్మ విభూషణ్’, లభించాయి. మరణానంతరం ఆయనకు కేంద్రం ‘భారతరత్న’ అవార్డు ఇచ్చి గౌరవించింది. ఇంకా సంగీత నాటక అకాడెమీ అవార్డు, ఫెలో షిప్, తదితర ఎన్నో పురస్కారాలు లభించాయి
బాలడ్ ఆఫ్ బ్రహ్మపుత్ర
భూపేన్ హాజారికా అనేక ఆరోగ్య సమస్యలతో 2011 వ సంవత్సరంలో కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లో చేరారు. అదే సంవత్సరం నవంబర్ 5న మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో తుదిశ్వాసను విడిచారు భూపేన్ హజారికా గారి అంత్యక్రియలలో అయిదు లక్షల మంది పాల్గొన్నారు. భూపేన్ హజారికా ఈశాన్యభారతం అందించిన ‘బ్రహ్మపుత్ర వాగ్గేయకారుడు’(బాలడ్ ఆఫ్ బ్రహ్మపుత్ర). ఆయన గురించీ ఆయన అందించిన సంగీతం గురించీ ఎంతచెప్పుకున్నా మిగిలే వుంటుంది.
చిత్ర, సాహిత్య సమీక్షకులు
-వారాల ఆనంద్
94405 01281