సాంస్కృతిక వారసత్వ పరంపర

Antarangam

Update: 2024-07-07 18:45 GMT

సంగీత సాహిత్య చిత్రలేఖనం లాంటి కళలలో ఆరితేరిన వారి వారసత్వం తిరిగి తమ పిల్లలు అనుసరించి కొనసాగించాలని ఏమీ లేదు. వృత్తులు, ప్రవృత్తులు వేరు వేరు. ఈనాటి తరం ఎక్కువలో ఎక్కువ సాఫ్ట్‌వేర్ లేదా బిజినెస్ మేనేజ్మెంట్ లేదా ఇతర ప్రైవేట్ ఉద్యోగాలు, వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. కొందరు తల్లిదండ్రుల ప్రవృత్తిలో సాహిత్యం, సంగీతం, నృత్యం లాంటి లలిత కళల్లో ఏదో ఒకటి ఉండేది. వారు గతించిన తర్వాత వాళ్ల పుస్తకాలకు వాళ్ల పరికరాలకు ఇప్పటి ఇండ్లలో స్థానం లేకుండా ఇరుకు వాతావరణం కొనసాగుతుంది.

ఒక తండ్రి సాహిత్యకారుడైతే అతని ఇల్లే ఒక గ్రంథాలయంగా రూపొంది ఉంటుంది. ఆయన కొడుకులు పూర్తిగా ఈ రంగానికి సంబంధం లేకుండా ఉంటే ఆ పుస్తకాలు ఏమైపోవాలి? ఆ గ్రంథాలు ఎవరు చదవాలి? అనే చర్చలతో ఆలోచిస్తున్న కాలం. తండ్రి ఆస్తికి మాత్రమే వారసత్వ కొనసాగింపా లేదా సాంస్కృతిక భావనను కూడా ఏదో ఒక రూపంలో కొనసాగించాలని కరీంనగర్‌లో అయిదుగురు మిత్రులు అనుకున్నారు. వాళ్ల తండ్రుల పేరు మీద ఆ రంగంలో నిష్ణాతులైన వారిని ఎంచి నగదు పురస్కారాన్ని ఇవ్వాలని తలంపు చేసుకున్నారు. గత నాలుగేళ్లుగా ఈ కార్యక్రమం సమైక్య సాహితీ అనే వేదిక ద్వారా కొనసాగుతోంది. సంగీత నాట్య ఉపాధ్యాయ సాహిత్య పరిశోధన రంగాల్లో రాష్ట్ర స్థాయిలో గుర్తించి గౌరవిస్తున్నారు. ఇది ఒక విశిష్ట కార్యక్రమంగా ఒక సాంస్కృతిక వారసత్వ పరంపరగా లోకమంతా తెలియాల్సి ఉంది.

పురస్కారం పొందిన వారు..

ఉమ్మడి కరీంనగర్‌కు చెందిన కలకుంట్ల సంపత్ కుమారాచార్య స్మారక సంగీత పురస్కారం, సంగీత రంగంలో గురువైన హైదరాబాద్‌కు చెందిన రామాచారికి, ఆచార్య రజని శ్రీ స్మారక నాట్య పురస్కారం, కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత పేరిణీ ప్రకాష్‌కు, మాడిశెట్టి మల్లయ్య స్మారక ఉపాధ్యాయ పురస్కారం, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత గాజుల రవీందర్‌కు, రావి కంటి రామయ్య గుప్త స్మారక సాహిత్య పురస్కారం, అవధాని ముద్దు రాజయ్యకు, డాక్టర్ దారం నాగభూషణం స్మారక పరిశోధన పురస్కారం, పురావస్తు చరిత్ర పరిశోధనలో నిపుణులైన డాక్టర్ దేవనపల్లి సత్యనారాయణకు ఈ సంవత్సరం ప్రదానం చేశారు. తమ తమ తండ్రుల కళలు, సాహిత్య అభిరుచులను తాము వారి స్మారకార్థం పుత్రులుగా ఇలా కొనసాగించడం ఒక విశేషంగా గౌరవంగా భావిస్తున్నామని కె.ఎస్ అనంతాచార్య, జీవి శ్యాం ప్రసాద్ లాల్, మాడిశెట్టి గోపాల్, రావికంటి శ్రీనివాస్, డాక్టర్ రఘురామన్‌లు ఆ సభలో ప్రకటించారు. పురస్కారం ఇచ్చే వాళ్ల కుటుంబ సభ్యులు పురస్కారం స్వీకరించే వాళ్ల కుటుంబ సభ్యుల మధ్య ఒక ప్రత్యేకమైన అన్యోన్యతగా సభ కొనసాగింది.

ఆ కళాత్మక విలువలను కొనసాగించాలి!

సంగీత గురువైన రామాచారి ఒక మాట అంటారు. ఈనాటి విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక విద్యలతో పాటు వారికి ఇష్టమైన ఏదైనా లలిత సంగీతంలో ఆసక్తి చూపితే తుంచి వేయకుండా ప్రావీణ్యత పెంచుకునేలా చేయూత నివ్వాలి. అట్లాగే వ్యాయామ విద్యను తప్పనిసరిగా కొనసాగించాలి. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో తమ పిల్లలతో వాత్సల్యాలను అనుసంధానించాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే ఎన్ని డబ్బులు సంపాదించినా మానవ సంబంధాలు లేని అసంతృప్తి జీవితం ఉంటుందని ఆయన అన్నారు. పూర్వీకుల ఇష్టాలను, ప్రవృత్తులను అనుసరించిన కళాత్మక విలువలను ఒక పరంపరగా తరం నుంచి మరో తరంకి కొనసాగించాలి. ఆయా రంగాల్లో కొడుకులకు ఆసక్తి లేకపోవచ్చు కానీ ఇలా పురస్కారాల పేర కొన్ని జ్ఞాపకాలను కూర్చుకోవచ్చు.

అన్నవరం దేవేందర్

94407 63479

Tags:    

Similar News

పిల్లలంటే!