అంతరంగం: ఇరాం లేని కలం

Antarangam

Update: 2024-06-23 18:45 GMT

ఆయన కలం పారని రోజు లేదు. ఆయన కవిత్వం ప్రవహించని వస్తువు లేదు. ఆయన మనసుకు తాకని ఊహ లేదు. ఆయనే ఆచార్య ఎన్ గోపి. తెలుగు నేల మీద ఆయనది వైవిధ్య జీవన వాస్తవిక కవిత్వ సంతకం. ఈ జూన్ 25కు ఆయనకు 75 ఏళ్లు. ఆయన కవిత్వానికి 50 ఏళ్ల పైమాటే. 1950 జూన్ 25న భువనగిరిలో పుట్టిన ఆయన దాని పక్కనే కొండంత వ్యక్తిత్వంతో ఎదిగారు. ఆధ్యాపకత్వం, సారస్వతం, మానవ సంవేదనలు ఆయన ఇష్ట వ్యాపకాలు.

పచ్చగా మెరిసే కవిత్వ సృజన

ఆచార్య గోపి ఆకలిని అనుభవించిన కవి. మట్టిలోంచి మొలిచిన మొక్కలా ఆయన కవిత్వం పచ్చగా మెరుస్తుంది. ఆయన కవిత్వం నిండా జీవితం పరుచుకుంటుంది. పేదరిక సామాజిక వాస్తవికత మెరుస్తుంది. అందుకే 'పెంక మీద / రొట్టెను మర్లెసినట్టు / కాలం కాలుతూ /ఆకలి వాసన వేస్తుంది' అంటారు. శ్రమైక జీవితం లేకుంటే శక్తివంతమైన కవిత్వం రాదు. మొక్కల పెరుగుదలలో సేంద్రియ ఎరువులు వాడినవి, రసాయనిక ఎరువులు వాడినవి వేరువేరని సులువుగానే గుర్తించవచ్చు. గోపి కవిత్వంలో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది. సహజమైన పసితనపు చూపూ ఉంటుంది. 'ముట్టుకుంటే తగలాలి కవిత్వం/ మనిషిలాగ / నరాల్లో ప్రవహించే రక్త పుష్పాలు / వెచ్చగా తాకి పోవాలి' అంటారు.

23 భాషల్లోకి కవిత్వ అనువాదం

ఆయన 1976లో రాసిన తొలి కవిత్వ సంపుటం 'తంగేడు పూలు' నుంచి రేపు విడుదలయ్యే 'రేపటి మైదానం' దాకా 29 కవితా సంపుటాలు వెలువరించారు. ఇంత విస్తృతంగా కవిత్వం రాసింది చాలా తక్కువ మందే. ఆయనకు మరొక చరిత్ర కూడా ఉంది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన 'కాలాన్ని నిద్రపోనివ్వను' కవితా సంపుటి 23 భారతీయ భాషల్లోకి అనువాదం అయింది. దాదాపు తెలుగులో ఏ ఇతర పుస్తకం కూడా ఇన్ని భాషల్లోకి వెళ్లలేదు. ఇది తెలుగు కవిత్వానికి దక్కిన జాతీయ స్థాయి గౌరవం. అలానే 'జలగీతం' దీర్ఘ కావ్యం అపూర్వమైనది. దీనిని రామన్ మెగాసెస్ అవార్డు గ్రహీత రాజేందర్ సింగ్ హైదరాబాదులో ఆవిష్కరించారు. ఈ కావ్యం 15 భాషల్లోకి అనువాదమై వెళ్ళిపోయింది. అట్లాగే వృద్ధుల గురించి రాసిన 'వృద్ధోపనిషత్' కవిత్వం ఏడు భాషల్లోకి అనువాదమైంది. ఇవే గాక మరో 11 ఇతర పుస్తకాలు అనువాదమైనవి. ఆచార్య ఎన్. గోపి తెలుగు విశ్వవిద్యాలయం కులపతిగానే గాకుండా, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఎన్నో పదవులు నిర్వహించారు. కవిత్వం, విమర్శ, యాత్రా చరిత్రలు, అనువాదాలు, పరిశోధనలు ఆగకుండా కొనసాగిస్తున్న పట్టుదల ఆయనది.

నానీల సృష్టికర్త

తెలుగు కవిత్వంలో నానీల ప్రక్రియకు ఆచార్య గోపి సృష్టికర్త. నాలుగు లైన్ల నానీ ఎంతో గొప్ప భావాన్ని ప్రోదిచేస్తుంది. 'దహనంలో / కుడి చేయి కాలలేదు / ఎందుకంటే అది కలం పట్టిన చెయ్యి' అంటారు. ఇట్లాంటి నానీల కవిత్వ సంపుటాలను 1986 నుంచి ఇప్పటివరకు దాదాపు 500 మంది కవులు ప్రచురించారు. ఇందువల్ల గోపి గారిని నానీల నాన్నా అని పిలుస్తారు. వేమనను పరిశోధనాత్మకంగా వెలుగులోకి తెచ్చింది ఆయనే! అందుకే 1980 ప్రాంతంలో ఆయనను వేమన గోపి అని పిలిచేవారు. 'ప్రజాకవి వేమన' పేర వెలువడ్డ గ్రంథం మళ్లీ ఎన్నో ముద్రణలు పొందింది. పరిశోధనలో నాలుగు పుస్తకాలు, విమర్శలో ఆరు పుస్తకాలు, అనువాదంలో ఆరు, యాత్రా చరిత్రలు ఆరు పుస్తకాలు ఇతరములు మరొక నాలుగు పుస్తకాలు ప్రచురించారు. 1976 తంగేడు పూలు మొదలుకొని మొదలుకొని ఇప్పటి నీటి మైదానం వరకు 123 గ్రంధాలు ప్రచురించారు.

కవిత్వమంటే మనిషిని కలిసినట్లుండాలి!

'పనిచేసే చేతుల్లో / ప్రవహించే విద్యుత్తు / జ్యోతుల్ని వెలిగిస్తుంది.' అని ఒక కవితలో అంటారు. గోపి గారు తెలుగు నేల మీద సినారె తర్వాత అంత నిరంతరంగా రాస్తున్న కవి. ఆయన 'కవిత రాస్తుంటే / వేళ్ల కదలిక / తలపోతల్లో ముంచి / రాస్తున్న నెమలీక. ఆయన శ్రమజీవుల పక్షాన నిలబడ్డ మనిషి. కవిత్వం అంటే మనిషిని కలిసినట్టు ఉండాలి అంటారు. ఆయనే ఒకచోట 'నేను ఇవాళ రొట్టె పక్కన / నిలబడి మాట్లాడుతున్నాను / విసుర్రాయి గింజ నలుగుతున్న / మెత్తని ధ్వని వింటున్నాను / దాని పెదవుల నుంచి మెత్తని ప్రేమ రాలుతున్నట్టు భావిస్తున్నాను' అంటుంటారు. మరొక చోట 'ఆకలి లేనప్పుడు తినడం నేరం / అది ఇతరుల నోటికాడి కూడును / దొంగిలించటం అవుతుంది' అంటారు జూన్ 25న విడుదలయ్యే 'రేపటి మైదానం ' పుస్తకంలో.

ఒకచోట కవి కృష్ణుడు రాస్తూ ' గోపి మన మధ్య కవిత్వ రూపంలో తిరుగుతున్న ఒక మనిషి' అంటారు. ఇది నిక్కచ్చి నిజం. తన ప్రయాణమే ఒక కవిత్వం. మాట్లాడితే వాక్యల జల కవిత్వమై ప్రవహిస్తుంది. గోపి గారికి శిష్యులు కోకొల్లలు. కాల గమనంలో ఆయన కవిత్వ ప్రయాణాన్ని కొలవడం, అధ్యయనం చేయడం ఈ తరం కవుల కర్తవ్యం.

(గోపి సార్‌కు అమృతోత్సవ జన్మదిన శుభాకాంక్షలు)

-అన్నవరం దేవేందర్

94407 63479

Tags:    

Similar News

అమరత్వంపై