ఏ ఒక్కరు తెస్తే వచ్చింది కాదు తెలంగాణ

Antarangam

Update: 2024-06-03 05:42 GMT

ఎంతమంది ప్రాణాలు ధారపొస్తే తెలంగాణ సాకారం అయింది? ఎంతమంది మృత్యువును ముద్దాడితే తెలంగాణ ఆవిర్భవించింది! ఎన్ని వేల మంది గొంతెత్తి నిలదీస్తేనే కదా కల నెరవేరింది. ఆంధ్ర రాష్ట్రం హైదరాబాదు రాష్ట్రం తెలుగు పేరు మీద కలపడమే ఏర్పడని కుట్ర. ఆ కుట్రను 1969 నుంచి చేదించుకుంటూ పోరాడిన అందరిదీ తెలంగాణ. విద్యార్థులు, ఉద్యోగులు, కవులు, మేధావులు, కళాకారులు, సకల జనులు... వీళ్ళందరి వెనుకా ముందూ రాజకీయ పార్టీల కృషి వల్లనే తెలంగాణ సాధ్యమైంది. తొలి దశ తెలంగాణ ఉద్యమాన్ని పోలీసు తూటాలు బలిగొంటే మలిదశ ఉద్యమంలో తమకు తామే ఆత్మబలిదానం చేసుకుని తెలంగాణ దీపానికి చమురు అయ్యారు. తెలంగాణ ఉద్యమం అంటే గాలిలోంచి వచ్చింది కాదు. అంతకుముందు ఈ నేల మీద జరిగిన ఉద్యమాల దారులే కారణాలు. ప్రశ్నించడం, ఎదిరించడం, ధిక్కరించడం, పోరాడటం... 1946-51లలో నైజాం వ్యతిరేక తెలంగాణ సాయుధ పోరాటం నుంచి అందివచ్చిన వారసత్వం.

వరంగల్ డిక్లరేషన్‌తో 'వార్'

ఆ తర్వాత 1980 దశకంలో ఫ్యూడల్ భూస్వామ్య వ్యతిరేక నక్సలైట్ ఉద్యమ స్వభావ రహదారి కారణమైనది. పరిపాలనలో భాగస్వామ్యం చెందిన ఆయా రాజకీయ పార్టీల్లోని తెలంగాణ నాయకత్వం ద్వితీయ శ్రేణిగా గుర్తింపబడడం. నిధులు నీళ్లు నియమాకాలు పకడ్బందీగా అవతలి పక్కకి పోవడం కళ్ళారా చూసి చలించిపోయి ఉన్నదశలో మొదటగా అప్పటి పీపుల్స్ వార్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను కేంద్రంగా చేసుకొని వరంగల్ డిక్లరేషన్ వెలువరించింది. ఆ తర్వాత బీజేపీ కూడా కాకినాడ తీర్మానం ద్వారా తెలంగాణ రాష్ట్రంపై కదలిక తెచ్చింది. కాలక్రమేన తెలంగాణ ఆవశ్యకతపై 1995 ప్రాంతం నుంచే విశ్వవిద్యాలయ మేధావులు, ఉపాధ్యాయులు, ప్రజా దృక్పథ పాత్రికేయులు సామాజిక చింతన గల సాహిత్యకారులు భువనగిరి సభ నుంచి ఆంధ్ర వలసవాద దోపిడీ లెక్కలు కట్టి భావజాల ప్రచారం చేశారు. అప్పుడు 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భ వించింది. అంతకు ముందు ఉన్న ప్రభుత్వ నిర్బంధం కొత్తగా ఉద్యమాల ఆలోచనలు ఆర్థిక సాంస్కృతిక సాహిత్య అభివృద్ధి రంగాల్లో పెత్తనాన్ని లెక్కలతో సహా ప్రశ్నించడం మొదలైంది.

రాష్ట్ర సాధన ఒకరి సొత్తు కాదు

2001 తెరాసలో ఎంతోమంది ఉద్యమ పోరాట స్వభావం ఉన్నవారు చేరారు. కెసిఆర్ రాజకీయ అధ్యయన స్పృహతో ముందుకు నడిపించారు. అన్ని వర్గాలు తెరాస గొడుగు కింద చేరి ఉద్యమాన్ని నడిపించాయి. ఈ మలి దశ ఉద్యమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగ యువకులు, విశ్వవిద్యాలయ విద్యార్థులు, అన్ని కుల సంఘాల పెద్దలు సభ్యులు, అన్ని రాజకీయ పార్టీలు, ఆ పార్టీల అనుబంధ సంఘాలు, మహిళలు, మహిళా సంఘాలు, రచయితల సంఘాలు, ప్రభుత్వ అధికారుల సంఘాలు, ఉద్యోగుల సంఘాలు, న్యాయవాదుల సంఘాలు... ఒక్కటేమిటి అన్ని వృత్తుల సంఘాలు సభ్యులు ఒక్కటై ఒకటే అంశం జై తెలంగాణ తెలంగాణ సాధనే లక్ష్యం అన్న రీతిలో జాతి గర్వించదగ్గ రీతిలో పోరాటం చేశాయి. ఈ ఆరాట పోరాటాలకు అవతలి వాళ్లు ఎన్ని ఆటంకాలు చేసినా ఎత్తుగడలు వేసినా వాటిని తుత్తునియలు చేసి తెలంగాణ సాధన జరిగింది. ఇటీవల నేర్నాల కిషోర్ తీసిన 'దచ్చన్న దారిలో' పాట వింటే అందులో అమరత్వాన్ని ముద్దాడిన వీరులను గుర్తు చేసుకుంటే దుఃఖం ఆగదు. ఎంతమంది తల్లుల నుదుటి కుంకుమ నేల రాలితే ఈ తెలంగాణ వచ్చిందనేది మననం చేసుకోవాల్సిన సందర్భం. అంతేగాని ఏ ఒక్కరి కృషి వల్ల మాత్రమే ఈ తెలంగాణ రాలేదు. ఆ ఒక్కరి నాయకత్వం గొప్పదే కావచ్చు కానీ చరిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం ఉంటుంది.

సీన్ మారింది అందుకే...!

సరే తెలంగాణ వచ్చింది 10 ఏళ్లు గడిచింది. గతంలో పోరాడిన గళాలు మూగబోయినయి. స్వభావాలు మారినాయి. ప్రజాస్వామ్యం దారి తప్పింది. ఏ ప్రజాస్వామిక తెలంగాణ కోసమైతే ప్రజలు రణం చేసి తెచ్చుకున్నారో ఆ స్వేచ్ఛను వదులుకోవాల్సి వచ్చింది. సంక్షేమం, అభివృద్ధి జరగవచ్చు. కాదనలేం. కానీ పరిపాలనలో ప్రజాస్వామికత వికసించాలి కదా. అదే కొరవడడం వల్ల సీన్ మారాల్సిన రీతిలోకి మారింది. ఎక్కడైతే వైఫల్యాలు ఉన్నాయో ఆ సాఫల్యాల కూర్పు కోసం ప్రజలు ఎదురు చూశారు. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాల సుదీర్ఘ ఎదురు చూపుల తర్వాత 'జయ జయహే తెలంగాణ ' గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించుకోవలసి రావడం విచారమే కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ అమలయేది అదే రాజ్యాంగం, అవే చట్టాలు, అదే ప్రభుత్వ యంత్రాంగం, అవే నిబంధనలు. కానీ పట్టు పట్టి సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని దృఢ సంకల్పంతో దూరదృష్టితో తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించడమే లక్ష్యం కావాలి.

అన్నవరం దేవేందర్

94407 63479

Tags:    

Similar News

అమరత్వంపై