నగరాల్లో పుస్తక మహోత్సవాలు విరివిగా…

antarangam

Update: 2023-03-05 19:30 GMT

పుస్తకమే జ్ఞాన కవాటం. పుస్తకమే మనిషి జీవితానికి భవిష్యత్ దర్శనం. చరిత్ర వర్తమాన సామాజిక ఆర్థిక సాంస్కృతిక విషయాల పట్ల వికాసం పెంపొందించేవి ఖచ్చితంగా పుస్తకాలే. ఒకప్పుడు పుస్తకాలు ఇష్టంగా చదివేవాళ్లు. కథలు కవిత్వం నవలలు సీరియస్‌గా అన్నీ చదవడం పోయి ఇప్పుడు అవసరం రిత్యా చదువుతున్న వాళ్ళు వస్తున్నారు. అంటే పుస్తకాల కంటే కూడా ఇంటర్నెట్ విస్తృతంగా ఉపయోగపడుతుంది. అందులోంచే అవసరమైన సమాచారం గూగూల్ సెర్చ్ లేదా యూట్యూబ్‌ల ద్వారా సేకరించుకుంటున్నారు. ఉద్యోగం పొందేందుకు పరీక్షల పుస్తకాల చదువు సరే, జీవితం గూర్చి సమాజం గూర్చి మానవ సంబంధాల గూర్చి గత ప్రాచీన సంస్కృతి గూర్చి చరిత్ర గూర్చి హేయబద్దమైన తర్క జ్ఞానం గూర్చి తెలిపేటివి బయట చదువుతున్న పుస్తకాలే కదా! ఇలాంటి సెలబస్‌లో లేని పోటీ పరీక్షలకు రాని పుస్తకాలు నేటి తరం చదవాల్సి ఉంది. ఇట్లా చదవడం వల్లనే గొప్ప జీవన సాఫల్యత ఉంటుంది.

బుక్‌టౌన్ కార్యక్రమం ఏర్పాటు

బుక్ ఫెయిర్‌లో తెలుగునాట కొత్తకాదు గానీ జిల్లాలోకి పుస్తక మహోత్సవాలు రావడం గొప్ప విషయమే. గతంలో హైదరాబాద్, విజయవాడ నగరాల్లో రెగ్యులర్‌గా పుస్తకాల ప్రదర్శన ఉండేది. ముంబాయి ఢిల్లీ నగరాల్లో కూడా ఉంటాయి. హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లు ఏర్పాటు చేయడం మంచి విషయం ప్రస్తుతం మార్చి 2 నుండి 8 వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని కరీంనగర్ పుస్తక మహోత్సవం నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అడిషనల్ కలెక్టర్ జి.వి శ్యాం ప్రసాద్ లాల్‌ లకు పుస్తక వికాస ప్రేమ ఉండటం వల్ల ఇలాంటి ఉత్సవాలు నిర్వహించి ప్రజలకు అందుబాటులోకి పుస్తకాలను తెచ్చేందుకు తెలంగాణ బుక్ ట్రస్ట్‌కు తోడ్పాటును అందిస్తున్నారు. దాదాపు 60 స్టాల్స్ ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతిరోజు సాహిత్య సమాలోచన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు.

సాహిత్య సమాలోచన కార్యక్రమంలో ‘బుక్‌టౌన్’ కార్యక్రమం అంటే ఒక పుస్తకం రచనను ఒకరు చదివి వినిపించడం. ఇట్లా పోతన, జాషువా, సినారె, యశోదారెడ్డి, చిన్నయ సూరి, అలిశెట్టి ప్రభాకర్ రచనలు శ్రోతలు వినవచ్చు. మొత్తం ఏడు రోజుల కార్యక్రమంలో విద్యార్థులకు యువతరానికి చిత్రకళ వ్యాసరచన పోటీలు డాన్స్ కార్యక్రమాలు రూపొందించారు.

పేరుకే పుస్తక ప్రదర్శన కానీ

సాయంకాలం చింత యక్షగానం లాంటి జానపద కార్యక్రమాలు ప్రతిరోజు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏందంటే ఏడు రోజులు కరీంనగర్ జిల్లాకు చెందిన లబ్ద ప్రతిష్టులైన రచయితల స్మారకంగా మాలో ఏడు మంది కవులను ఎంపిక చేసి వారి పేరు మీద పురస్కారం ఏర్పాటు చేశారు. అట్లా కరీంనగర్ జిల్లాలోని వానమామలై జగన్నాథాచార్యులు, పాకాల యశోదారెడ్డి, ముద్దసాని రాంరెడ్డి, గోపు లింగారెడ్డి, రేగులపాటి కిషన్ రావు, బొద్దుల వెంకటేశం, శ్రీ భాష్యం విజయసారధి పేర్లతో ఏర్పాటు చేసి జిల్లా కవులను ఎంపిక చేసి పదివేల పురస్కారం ప్రకటిస్తారు.

పేరుకు పుస్తక ప్రదర్శన కానీ ఇదంతా సాహిత్య సాంస్కృతిక ఉత్సవాల వేదిక అయ్యింది. పుస్తక ప్రియులు సాహితీవేత్తలు ప్రతిరోజు సాయంకాలం ఒక జాతర లాగా వస్తున్నారు.

పుస్తకాల సంస్కృతిని చదువు అలవాటును అధ్యయనం పట్ల ఆవశ్యకతను ప్రజల్లో కలిగించేందుకు ప్రతిరోజు ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. పుస్తక జ్ఞానం వికాసం అన్నీ నగరాల్లో విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉన్నది. అందరూ అధ్యయనం చేసే పుస్తకాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకరావడం నేటి తరానికి ముఖ్యమైన అవసరం.

అన్నవరం దేవేందర్

94407 63479

Tags:    

Similar News

పిల్లలంటే!