ఎన్నీల ముచ్చట్లు తెలుగు సాహిత్య చరిత్రలో ప్రత్యేకంగా పేర్కొనదగిన ప్రస్థానం. ఎన్నీల ముచ్చట్లు అంటే కరీంనగర్ కవుల ఇంటి డాబాల మీద ప్రతి పౌర్ణమి రోజు జరుపుకునే కవి సమ్మేళనం. ఈ కవిత్వ పున్నమి కలయిక గత పది సంవత్సరాలుగా నిర్విరామంగా నడుస్తున్నది. మొన్న పున్నమికి 117వ 'ఎన్నీల ముచ్చట్లు' కవి వైరాగ్యం ప్రభాకర్ ఇంటి మీద జరిగాయి. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రచయితల వేదిక 2013 ఆగస్ట్ 21న రాఖీ పౌర్ణమి రోజు అన్నవరం దేవేందర్ అపార్ట్‌మెంట్ పైన మొదటగా నిర్వహించింది. ఆ కొనసాగింపునకు 117 నెలలు కావస్తోంది. ఒక పున్నమికి కవులందరు చదివిన కవిత్వం మరో పున్నమికి మరో పున్నమి వరకు పుస్తకంగా వస్తుంది. ఇట్లా 40 నెలల వరకూ కవిత్వ సంకలనాలు వచ్చాయి.
పరిశీలకులకు ఉపయోగపడేలా
ఇట్లా వెలువడ్డ 1 నుంచి 25 ఎన్నీల ముచ్చట్ల కవితా సంకలనాలను కవి, విమర్శకుడు, తెలుగు భాషోపాధ్యాయుడు కూకట్ల తిరుపతి 'జల్లెడ' పేర విమర్శనా వ్యాసాల పుస్తకం వెలువరించారు. ఇందులో 2013 నుంచి 2015 వరకు జరిగిన కవి సమ్మేళనాల కవిత్వంకు చాలా సూక్ష్మంగా పరిశీలన చేశారు. తిరుపతి ప్రతిభావంతమైన కవి, ఎన్నీల ముచ్చట్ల నిర్వహణ అనంతరం ఈ కవిత్వాన్ని 'సాహితీ సోపతి' పుస్తకంగా వేయడంలోనూ భాగస్వామి. ఈ జల్లెడను ప్రభాత కవి రచయిత కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నలిమెల భాస్కర్‌కు అంకితం ఇవ్వడం బాగుంది. నలిమెల భాస్కర్ పద్నాలుగు భారతీయ భాషలు నేర్చిన పండితుడు. అన్ని భాషల్లోంచి కథలు కవిత్వం అనువాదం చేశారు. ఈ పుస్తకానికి తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ చెన్నయ్య ముందు మాట రాస్తూ, ఎన్నీల ముచ్చట్లు తెలంగాణ సాముదాయక సాంస్కృతిక వ్యక్తిత్వ ప్రదర్శన అయితే, ఆ స్ఫూర్తిని సంస్కృతీ ప్రదర్శకంగానే కూకట్ల తిరుపతి విమర్శ గ్రంథం ద్వారా అందించడం గొప్ప విషయం అన్నారు.
ఎన్నీల ముచ్చట్లను కాళోజీ మిత్రమండలిని స్ఫూర్తిగా తీసికొని నిర్వహణ జరిగిందని ఈ కార్యక్రమం ద్వారా కరీంనగర్‌లోని ఎంతోమంది నూతన కవులను తయారు చేసిందని ఇదొక వర్క్‌షాప్‌గా జరుగుతుందని తిరుపతి పేర్కొన్నారు. తాను 25 పుస్తకాల్లోని కవిత్వాన్ని దేనికదే జల్లెడ పట్టి సారాన్ని విడదీసి ఈ వ్యాసాల్లో పొందుపరిచారు. ఒక్క కరీంనగర్ నగరంలోనే వరుసగా రెండు సంవత్సరాలుగా రాస్తున్న కవిత్వాన్ని పరిశీలించేందుకు ఈ పుస్తకం పరిశీలకులకు ఉపయోగపడుతుందని 2013, 2014 తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగి ఆకాంక్షలు సాఫల్యం చెందుతున్న సందర్భం వంటివన్నీ ఈ పుస్తకంలో పేర్కొన్నారు.
పైగా ఈ ఎన్నీల ముచ్చట్లు ఏ ఏ పున్నమి రోజు ఎవరి ఇంటి మీద నిర్వహిస్తున్నారో ఎవరెవరు పాల్గొన్నారో కూడా వివరంగా ఉంది. భవిష్యత్ తరాలకు ఎంతో చక్కగా ఈ విమర్శనా పుస్తకం ఉపయోగపడుతుంది. ఎన్నీల ముచ్చట్లు ఆయా మాసాల్లో పుస్తకాలు వెలువడేటప్పుడు నలుపు తెలుపు రంగుల్లో ముద్రించారు. ఒక్కో నెల ఒక ప్రత్యేకతలో వచ్చేవి. దాశరథీ, అలిశెట్టి ప్రభాకర్, సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ, తెలంగాణ ఆవిర్భావం సందర్భంలో తెలంగాణ తల్లి, పీ.వీ నరసింహరావు, సినారె, జయశంకర్ నలిమెల భాస్కర్‌కు పురస్కారం వచ్చిన సందర్భంలో తన ముఖచిత్రం జీవగడ్డ విజయ్ కుమార్, బోయినపల్లి వెంకట రామారావు, సరోజినీ నాయుడు, దామోదరం సంజీవయ్య, వరకవి సిద్ధప్ప, భాగ్యరెడ్డి వర్మ, మహాత్మ జ్యోతిబా పూలే ఇలా ఆయా రోజుల్లో ఆయా సందర్భాల్లో ముఖచిత్రాలుగా వెలువడ్డాయి. కూకట్ల తిరుపతి తెలుగు సాహిత్యంలో మైలురాయి లాంటి ఎన్నీల ముచ్చట్లను 'జల్లెడ' పట్టి ప్రపంచానికి అందించారు.
అన్నవరం దేవేందర్
94407 63479