అంతరంగం: చేసికోవాల్సిన సమయంలో పెళ్ళి చేసికుంటలేరు

antarangam

Update: 2023-02-05 19:30 GMT

దువు ఉద్యోగం స్వతంత్ర ఆలోచనా దృక్పథం ఇటీవల యువతరంలో తరచూ కన్పిస్తున్నది. చదువుకున్న యువతరంలో ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి అనే విషయం పక్కన పెట్టితే ఆ ఉద్యోగాలు పొందిన ఆడపిల్లలైనా, మగపిల్లలైనా తమ పెళ్ళి కోసం తొందరపడటం లేదు. చదువు పోయింది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చింది. ఇగ పెళ్ళి చేసికోవాలె అనే ఆలోచన కూడా ఎక్కువగా చేయడం లేదు. ఆడవాళ్ళు కూడా 30, 35 దాటిన తర్వాత తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చినా నిర్లిప్తంగా ఉంటున్నారు.

స్వతంత్ర ఆలోచనలతో..

కొత్త ట్రెండ్ ఏమిటంటే ఆడపిల్ల పెళ్ళికి అసలే సై అంటలేదు. తర్వాత తర్వాత అని దాటేస్తున్న సాఫ్ట్‌వేర్ తరం కన్పిస్తుంది. ఆధునిక సాంకేతిక విద్యలు అభ్యసించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అవకాశాలను సమర్థులైన చురుకైన వాల్లు అందుకుంటున్నారు. ఇలా మల్టినేషనల్ కంపెనీలలో చేరిన వాల్లకు ఆకర్షనీయమైన వేతనం, లక్జరీ జీవితం, ఖరీదైన అపార్ట్‌మెంట్‌లు ఏక్ నిరంజన్‌గా బతుకుతున్నారు. ఒకవేళ పేరెంట్స్‌కు అమ్మాయికి పెళ్ళి ప్రస్తావన తెస్తే ఆ వరుని ప్రొఫైల్ చూసి వీడు ఏ కాలేజి ఇంటర్మిడియట్‌లో ఏ ర్యాంక్, ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలో ఏ పొజిషన్, ప్యాకేజి ఎంత ఇత్యాది సెర్చ్ చేసి అవసరమైతే వాళ్ళే అబ్బాయితో చాటింగ్ చేసి రిజెక్ట్ చేస్తున్నారు. తల్లిదండ్రులకు ఇది ఇబ్బందిగా పరిణమిస్తుంది. మంచి చదువులు చదివిస్తిమి, మంచి ఉద్యోగం వచ్చినా పెళ్ళికి పెద్దగా ఆసక్తి కనపడటం లేదు. పైగా అబ్బాయిలు తమకంటే ఎక్కువ ప్యాకేజీ పెద్ద పోజిషన్ గల వాల్లనే కోరుకుంటున్నరు. ఇందులో స్వతంత్ర ఆలోచనల భావధార కొనసాగుతుంది. పైగా పెళ్లైన కుటుంబాల ఆడపిల్లలు మగహంకార ఆధిపత్యాలు గమనించి ఉంటారు. సింగిల్ లైఫే బెటర్ అనే ధోరణిలో ఉంటున్నారు. ఎంపికలో ఇంకా మంచిగా మరింత మంచి మ్యాచ్ దొరకపోతదా అనే మీమాంస కూడా ఉంటుంది. ఈ సెర్చిలాటకే పుణ్యకాలం కాస్తా గడిచిపోతది. పెళ్ళి ఆలస్యం, పిల్లలు కల్గడమూ ఆలస్యం అవుతోంది. ఈడు పోయినంక క్రోమోజోముల సంఖ్య తగ్గిపోవడం వాటిలో చైతన్యం మందగించడం ఇవన్నీ జరిగిపోతున్నయి. అసలే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం, నిర్విరామ పని ఒత్తిడి, జీతం ఎక్కువే వేతనం ఎక్కువే. విరామం తర్వాత సెలవులు ఉన్నా లేనట్లే లెక్క ఇలాంటి సందర్భంలో ఆలస్యంగా ప్రారంభం అయిన సంసార జీవితాలు కొనసాగుతున్నయి.

పెద్దస్థాయి ఉద్యోగం చేస్తేనే పెళ్ళి..

ఇప్పటి ట్రెండ్ ప్రకారం అమ్మాయిలదే పైచేయి. పెళ్ళి చేసికోవాలంటే అబ్బాయి తరపువాళ్ళు ఒప్పుకోవడం కాదు. అన్ని కులాల్లో ఇట్లాగే జరుగుతోంది. అమ్మాయి ఉద్యోగం చేస్తున్నదంటే ఇది వరకు ఏ మగవాళ్ళు అయినా వచ్చి మాట్లాడుకొని పెళ్ళి చేసికునే వాళ్ళు. ఇప్పుడు అలాకాదు అబ్బాయి వాళ్ళకు ఎంత ఆస్తి ఉన్న పర్వాలేదు అబ్బాయి నచ్చితేనే, తనకంటే పెద్దస్థాయిలో ఉద్యోగం చేస్తేనే పెళ్ళి చేసికునేందుకు ఒప్పుకుంటున్నారు. దొరకకుంటే 40 ఏళ్ళ వరకు కూడా వేచి చూస్తున్నారు. కెరీర్ పట్ల ఉన్న శ్రద్ద, సంపాదన పట్ల ఉన్న ఆసక్తి జీవన సౌఖ్యాల పట్ల కల్గడం లేదు. ఈ సాంకేతిక విద్య చదువులు చదివి ఇట్లా ప్రవర్తిస్తున్నారనుకుంటే అంతో ఇంతో చదువులు చదివిన వాళ్ళకు కొన్ని కులాల్లో పెళ్ళిల్లు కావడమే లేదు. వ్యవసాయం వృత్తిగా ఉన్న యువకులను పెళ్ళి చేసుకునేందుకు ఆయా కులాల్లో ఎవరూ ముందుకు రావడం లేదు. స్వంత వ్యవసాయం కనీసం 4, 5 ఎకరాలున్న వాళ్ళు ఈ రోజుల్లో పెద్ద ఆస్తిపరులే అవుతారు నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి. రైతుబందు వస్తుంది. ఇరవై నాల్గు గంటలు కరెంటు నీటి పారకం ఉంటది. ఇదివరకు ఉన్నట్లు నాగలి దున్నడం, కలుపు తీయడం కూడా లేదు. వ్యవసాయం అంతా యంత్రాల మీదనే నడుస్తున్నయి. కాని వ్యవసాయదారులైన రైతుల పిల్లలకు ఏదైనా ప్రైవేట్‌గానైనా పట్టణంలో ఉద్యోగం ఉంటేనే పిల్లను ఇస్తున్నరు కాని ఏదీలేక ఫక్తు వ్యవసాయం అంటే దొరకడం కొంచెం కష్టంగానే ఉన్నది. ఏది ఏమైనా ఇది వరకు అబ్బాయిలు దొరకపోయేది. ఇప్పుడు అమ్మాయిలు ఉన్నా నచ్చక పెళ్ళిళ్లు తొందరగా అయితలేవు.

అన్నవరం దేవేందర్

94407 63479

Also Read..

సమీక్ష: జానపద కరదీపిక పూల జాతర 


Tags:    

Similar News

పిల్లలంటే!