ఈ మధ్య అన్నింటికి తొందర ఎక్కువైంది. నిదానం తక్కువైంది. ఏ పని అయినా తృప్తిగా చేయడం లేదు. అయ్యింది అన్పించుడు ఎక్కువైంది. అందరికీ బిజీ షెడ్యూల్. ఆఫీసులకు, వ్యాపారాలకు, ఉద్యోగాలకు వెళ్ళిపోవాలె అనే ధ్యాసనే కానీ, ఈ పనులన్నీ ఆనందంగా జీవించడానికే అని మరచిపోతున్నారు. ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలంటే సరియైన వేళకు సరియైన సమతుల్యమైన భోజనం అవసరం. కానీ ఆ భోజనాన్ని ఒక పద్దతిగా తినడం తగ్గిపోతుంది. ఎవలకు చూసినా నాలుగు బుక్కలు నోట్లోపెట్టుకొని మూతి కడుక్కొని ఉరుకుడే అవుతుంది.
ఆస్వాదిస్తూ నమిలి తినాలి
అన్నాన్ని డబ్బాలవేసి మూత పెట్టినట్టు నోట్లో వేసి టక్కున మింగుతున్నారు. పాఠశాల విద్యార్థులు, ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, స్వంత పనులు చేసుకునే వాళ్ళు బస్సుల సమయాలకు అందించేందుకు ఇలా చేస్తున్నారు. కానీ, అన్నం, కూర మంచిగా పల్లెంలో నిదానంగా కలపాలె. అట్లా కలెగలుపుంటేనే నోట్లో నీళ్లు ఊరుతయి. అప్పుడు నోట్లో బుక్క పెట్టుకొని నోట్లో కొద్దిసేపు నమిలితేనే అక్కడ స్రవిస్తున్న లాలాజలం కొన్ని ఎంజైంలతో ఆహారం కల్సిపోతది. అప్పుడు మింగాల్సి ఉంటుంది. అన్నం కూర పంటి కింద మిక్సీ కావాలి.
అప్పుడే లోపలికి పోయి జీర్ణం సరిగ్గా అయితది. సంపూర్ణ జీర్ణం అయితేనే ఆహారంలోని విటమినులు ఒంటికి పడుతాయి. అటు తర్వాత అవసరం లేని వ్యర్థం తెల్లవారి సులువుగా వెళ్ళిపోతుంది. సరియైన తిండి తిన్నా, సరియైన రీతిలోనే తినాలి. అసలు కారం, తీపి, వగరు, పులుపు, లవణం మింతులు, మసాలా ఘాటు ఆస్వాదిస్తేనే ఆనందం. ఒకప్పుడు ఊర్లల్లో ఇంటి అరుగుల మీద కడపల దగ్గర ఇరుగుపొరుగు వారు అమ్మలక్కలు కలిసి ముచ్చట్లు పెట్టుకుంట నిమ్మలంగ తినేవారు. ఇప్పుడు ఆ నిమ్మలం ముచ్చటే లేదు. నాలుకకు రుచి వస్తుందా ఆ రుచి మెదడుకు ప్రేరేపించి ఆనందాన్ని తెస్తున్నదా? అనేది కూడాలేదు. గబగబ తినడం పనులకు వెళ్ళడం అయిపోతంది.
అప్పుడే తిండి పెయ్యికి పడుతది
బిజీ లైఫ్ దాపురించి మంచినీళ్ళు తాగడం కూడా తక్కువైంది. సరియైన నీళ్ళు తాగిన, మోతాదులో తాగడం లేదు. మహిళలు అయితే ప్రయాణాలు చేస్తూ ఉద్యోగాలు చేసేవారు తక్కువ నీళ్ళు తాగుతారు. దాంతో వాళ్ళకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. సరియైన వేళకు సరిగ్గా తినడం అన్ని వృత్తుల్లోని వారికి తగ్గిపోయింది. ఎందుకంటే ఒత్తిడి, పోటీతత్వం, సంపాదన ఎక్కువైనయి. ఆఖరుకు వ్యవసాయం చేసే ఈ తరం వాళ్ళు కూడా తినే దగ్గర తృప్తి లేదు. మందు తాగే బృందాల దగ్గర మాత్రం 2,3 గంటలు కూర్చుంటరు కాబట్టి నిదానంగా ముచ్చట్లు పెట్టుకుంటూ కానిస్తున్నారు.
ఎందుకంటే మందు బాటిల్ అయిపోవడం లక్ష్యం కాబట్టి అందుకు ముందున్న స్టఫ్‌ను తృప్తిగా తింటున్నారు. ఇక పెండ్లిళ్ళు ఇతర ఫంక్షన్లలోనైతే అవసరమైన దానికంటే ఎక్కువ పెట్టించుకోవడం పూర్తిగా తినకపోవడం చూస్తూనే ఉన్నాం. ఇండ్లలో ఉండే మహిళలు సీరియల్ చూస్తూ భోజనం చేస్తారు. వీళ్ళలో తొందర ఏమి ఉండదు సీరియల్ నడుస్తున్నంత సేపు తింటారు. కానీ మనసంతా టీవీ మీద అందులో వచ్చే పాత్రల మీదనే ఉంటది. తినే అన్నం మీద మాత్రమే ద్యాస పెడితే తిన్న తిండి పెయ్యికి పడుతది.
జీవితాన్ని సరైన మార్గంలో పెట్టాలంటే
తినడమే కాదు ఎంత తింటున్నం ఎన్ని క్యాలరీలు మన శరీరానికి అవసరం అవుతున్నాయి అంతకంటే ఎక్కువ పడుతున్నాయా తక్కువ వస్తున్నాయా అనేది కూడా పరిశీలన చేసికోవాలి. మన శరీరానికి కావాల్సిన పిండి పదార్థాలు, మాంసకృత్తులు కొవ్వు పదార్థాలు ఎంత అవసరం? వాటిలోని ఎన్ని క్యాలరీలు ధ్వంసం అవుతున్నయి? ఎంత మిగులుతున్నయి? ఎంత వెయిట్ ఎక్కువ అవుతున్నము? ఎక్కువ బరువుతో ఏ ఏ వ్యాధులు వస్తాయి? మధుమేహం, రక్తపోటులు వస్తాయా వస్తున్నాయా అనే శరీర జ్ఞానం కూడా ఈ రోజుల్లో అందరికీ ఉండాల్సిన అవసరం ఉన్నది. దానిని బట్టే ఆహారం ఎక్కువగా కార్బొహైడ్రెట్‌లు అంటే పిండి పదార్థాలతో కూడిన అన్నం తింటాం. తక్కువగా ప్రోటీన్ ఫుడ్ తింటాం.
ఫ్యాట్స్ కూడా ఎక్కువ తింటున్నం. ఈ సమతుల్యత లేకపోతనే పలురకాల అనారోగ్యాలు, వైద్యుల మందులు అవసరం అవుతున్నయి. ఆ మందులకు సైడ్ ఎఫెక్ట్‌లు దానికి మరో మందులు ఇలా నడుస్తున్న జీవితాన్ని సరియైన మార్గంలో పెట్టాలంటే వ్యాయామం యోగా వంటివి చేస్తుండాలి. శరీరం ఎక్కడికి అక్కడికి టింగున వంగాలి. చలాకి గా ఉండాలి. ఇట్లా ఉంటేనే ఆయా రంగాల్లో వృత్తి విద్య ఉద్యోగాల్లో ఉన్నవారు రాణిస్తారు. ముందుగా ఆనందంగా ఏ పని చేసినా ఆ పనిపై శ్రద్ధ నైపుణ్యత పెంచుకోవడం, పనిని ప్రేమించడం నిరంతరం ఆ రంగంలో మార్పులకు సాంకేతికను గమనిస్తూ చైతన్యం పెంపొందించడం ముఖ్యం.
అన్నవరం దేవేందర్
94407 63479