కవిత్వం అంటే కైగట్టడం కొందరు చమత్కారంగా, యతి ప్రాసలు కలుపుతూ మాట్లాడుతరు. మరికొందరు తాపతాపకు సామెతలను వాడతారు. ఆ సామెతలను కలుపుతూ ముచ్చట్లు పెట్టె చమత్కారులు ఉంటరు. వీళ్లందరినీ దొరుకబట్టి రికార్డ్ చేసి తెలుగు సాహిత్యంలో చేర్చాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటివాళ్లు ఉన్నారని, ఉంటరని, గుర్తించి పట్టుకొని పట్టుబట్టి వాళ్లతో కథ చెప్పిచ్చి ఇలా పుస్తకం వేయడం గొప్ప విషయం.
మనిషి మనిషిలో ఏదో ఓ కళ నిక్షిప్తమై ఉంటుంది. కొందరు దాన్ని వెలికి తీసి సాన పెట్టుకుంటారు. మరికొందరు మరుగున ఉంచుకుంటారు. అయితే, ఇదంతా పల్లెటూర్లలోనే ఎక్కువ కన్పిస్తది. ఊరూరికి కథలు చెప్పేవాళ్లు ఉంటరు. అంటే యక్షగానం, ఒగ్గు కథలు, బాగోతం ఆడేటోళ్లు. అందరికీ తెలుసు వీళ్లు వృత్తి కళాకారులని. కానీ, ఇతర వృత్తులలో చేను-చెలక పనులలో ఉంటూ, కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగించేవాళ్లలో కొందరు తాతల నుంచి వారసత్వంగా వచ్చి కథలను చెబుతరు. వీటిని 'శాత్రం' చెప్పుడు అంటరు.
కీర్తిశేషులైన మా తాత అన్నవరం మల్లయ్య మా చిన్నప్పుడు వాకిట్ల వెన్నెల వెలుగుకు ఇలాంటి శాత్రాలు చెప్పేది. నేను, మా చెల్లెండ్లు, తమ్ముడు మంచం చుట్టూ కూచొని ఇష్టంగా వినేటోళ్లం. ఆయనకు వాళ్ల తాత చెప్పిండట. ఆయన మాకు చెప్పిండు. ఇందులో బేతిరెడ్డి కథ, చిన్న అక్కమ్మ, పెద్ద అక్కమ్మ కథ అని చాలా గమ్మత్తుగా ఉండేటివి. వినసొంపుగా ఉండటమే కాకుండా తను చెబుతుంటే ఆ సన్నివేశాలు మనసులో దృశ్యమానం అయ్యేవి. ఆ కథల్లోనూ స్థానికంగా ఉండేవాళ్ల పేర్లు, ప్రాంతాలను ఉదహరించేది. ఇట్లాంటి కథలు మా ఊర్లో మరికొందరు చెప్పేవాళ్లు. అయితే, ఈ విద్య అందరికీ రాదు. ఇదొక కథనం అర్థం అయ్యే రీతిలో చెప్పే కళ.
ఆయన ఆసక్తి మేరకే
ఇట్లాంటి 242 కథలనే ఆచార్య పులికొండ సుబ్బాచారిగారు రెండు రాష్ట్రాల నుంచి సేకరించి 'తెలుగింటి జానపద కథలు' పేరిట ఒక పుస్తకంగా వెలువరించారు. తాను రెండు సంవత్సరాలు కష్టపడి చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం, ఖమ్మం, మహబూబ్‌నగర్, జిల్లాలలోని 200 గ్రామాలు తిరిగి కథలు చెప్పేవాళ్లను దొరుకబట్టి, చెప్పించి, రికార్డ్ చేసి 'ఉన్నదున్నట్లు' వాళ్ల భాషలోనే అచ్చు వేశారు. తెలుగు నేల మీద రాసే కథా రచయితలు ఎందరో ఉన్నారు. వీళ్లు చెప్పే కథలలో జానపద జీవనశైలి, నమ్మశక్యంగాని ఊహలు, రాజులు, రాణులు, ప్రయాణాలు అన్నీ ఉంటాయి. ఇన్ని కథలను సేకరించడం మామూలు పని కాదు.
అసలు ఇట్లా కథలు చెప్పేవాళ్లు ఊరంతా అందరికీ తెలియదు కూడా. ఎందుకంటే ఇది బహిరంగంగా ప్రదర్శించే కళ కాదు. అందరి ముందు చెప్పడం ఉండదు. తన కుటుంబం ముందు రాత్రిపూట ఆరుబయట కూర్చొని చెప్పడం లేదా వ్యవసాయ పనుల దగ్గర రాత్రి పంట కావలి పోయినప్పుడు అక్కడ పడుకునే ముందు చెప్పడం జరుగుతది. ఇందులో రాగం, తాళం ఏమీ ఉండవు. కానీ, కథ చాలా ఆసక్తిగా ఉంటుంది. ఆచార్య సుబ్బాచారిగారు పరిశోధకుడు, జానపద జ్ఞానం పట్ల అత్యంత ఆసక్తి గల రచయిత, భాషా శాస్త్రవేత్త కూడా.
గుర్తించడం గొప్ప విషయం
పల్లె ప్రజలు పాడుకునే జానపద పాటలు ఎన్నో ఏళ్ల నుంచి బయటకు వచ్చాయి. ఆ బాణిలోనే మరికొందరు పాటల రచయితలు రాసి, పాడి వాటికొక గొప్ప గౌరవం తెచ్చారు. పల్లెపాట చాలా మార్పుల తర్వాత వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలందరికీ చేరింది. ఇదొక జానపద కథల సంపుటి. ఇందులో కథ చెప్పేటోళ్లు వాళ్ల భాషలోనే ఆ పదాలే చెప్పారు. ఈ తెలుగింటి జానపద కథలు చదివితే అన్ని ప్రాంతాల ప్రజలు మాట్లాడే భాష తెలుసుకోవచ్చు. అనంతర కాలంలో పల్లెలలో ఇట్లాగే సినిమా కథలు చెప్పేవాళ్లు అక్కడక్కడ కన్పిస్తారు. తరతరాల నుంచి వచ్చిన జానపద కథ 'శాత్రం' పేరుతో చెప్పేవాళ్లు కొందరైతే, తర్వాత తరంలో సినిమా మాధ్యమం వచ్చిన తర్వాత రాత్రి సినిమా చూసివచ్చి ఆ స్టోరీని 'ఉన్నదున్నట్టు' హీరో హీరోయిన్ పేర్లతో సహా విలన్ పాత్రలు ఫైటింగ్ అన్ని కలిపి ఒక ప్రవాహంలాగా చెప్పేవాళ్లు ఉంటరు. ఇలా సినిమా చూసిన అందరు చెప్పలేరు. కొందరికే సినిమా కథను నోటితో తిరిగి చెప్పే కళ ఉంటుంది.
అట్లనే, ఊర్లలో రెండు కుటుంబాల మధ్య పంచాయితీ అయితే, కొందరు దాన్ని 'ఉన్నదున్నట్టు' ముందు ఆమె ఏమన్నది? ఆమె మనసులో ఏమున్నది? తర్వాత తను ఏమని తిట్టింది? ఇలా వరుస క్రమంలో చెబుతరు. ఇలా అందరికీ చెప్పరాదు. ఇదొక కళ. కవిత్వం అంటే కైగట్టడం కొందరు చమత్కారంగా, యతి ప్రాసలు కలుపుతూ మాట్లాడుతరు. మరికొందరు తాపతాపకు సామెతలను వాడతారు. ఆ సామెతలను కలుపుతూ ముచ్చట్లు పెట్టె చమత్కారులు ఉంటరు. వీళ్లందరినీ దొరుకబట్టి రికార్డ్ చేసి తెలుగు సాహిత్యంలో చేర్చాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటివాళ్లు ఉన్నారని, ఉంటరని, గుర్తించి పట్టుకొని పట్టుబట్టి వాళ్లతో కథ చెప్పిచ్చి ఇలా పుస్తకం వేయడం గొప్ప విషయం.
అన్నవరం దేవేందర్
94407 63479