ఎన్నికలు జరుగుతున్నయంటే, ఆయా రాజకీయ పార్టీలు ప్రజలకు చేస్తున్న వాగ్దానాలు, భవిష్యత్తులో చేయబోయే పనులు, గతంలో చేసిన పనులు ప్రచారం చేయాలి. కానీ, ఎన్ని ప్రలోభాలు, కులాలవారీగా మతాల వారీగా ఓటర్లను విడదీసి గంపగుత్తగా ఓట్లు దొబ్బుకపోయి గద్దె మీద కూర్చునే పెద్దలదే ప్రజాస్వామ్యం అయింది. ఇక అమ్ముడుపోవడం అనే మాటనే అసహ్యంగా ఉన్నది. సంతలో కోళ్లు, ఆవులు, పశువులు అవసరాలకు అమ్ముకుంటారు. కానీ, గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు కూడా అమ్మకం సరుకు అవడం చాలా అసహ్యం. మనిషి అడ్డా మీద కూలిగా అమ్ముడు పోవడం వేరు. ప్రతినిధి కూడా బ్యారానికి గురికావడం వేరు.
ఎన్నికల వార్తలు చూసినా, విన్నా నిజంగా ఒకారమొచ్చినంత పనైతంది. రాజకీయాలు ఎంత వ్యాపారం అయినవి. రాజకీయ పార్టీలు ఎంత బరితెగించినవి. ప్రజాస్వామ్యం అనే మాటకు బొత్తిలకు విలువ లేకుంటా పోయింది. ఒక్క లీడర్లు మాత్రమేనా, ఓటర్లు కూడా అధ్వానంగా తయారైండ్రు. పైసలు బహిరంగంగానే తీసికునుడు. తాగుడు, తినుడు, ఓట్లేసుడు. పూర్తిగా ఓటరు తనకు తాను అమ్ముడుపోవుడు. చూస్తే దేశం ఎటు పోతుందో? ఇంకా కొన్ని రోజులు పోతే ఇంకెంత నాశనం కానున్నదో? తెలుస్తలేదు.
ప్రభుత్వ యంత్రాంగం ఏమన్నా తక్కువనా? నిబంధనలను పక్కన పెట్టి పైవారు ఆడించినట్టే ఆడుడు. గింత మాత్రానికి ఎలక్షన్ ఎందుకు? ఎన్ని వాహనాలు! ఎంతమంది ప్రచారం! ఎన్ని మందు సీసాలు! ఎన్ని నోట్ల కట్టలు! చెప్పనలవి కాదు. గాంధీ మహాత్ముడు బతికి ఉంటే ఎంత నెత్తి నోరు కొట్టుకునునో! ఆ తరం రాజకీయ నాయకులు ఎవరైనా ఎంత గొప్పగా నిజాయితీగా ఉండేది.
Also read: అంతరంగం: సెల్‌తో జర పదిలం మరి!!
ఈ విలువలు ఎక్కడ?
ఇప్పటి రాజకీయ నాయకులకు బొత్తిగా నీతి నిజాయితీ, నిబద్ధత లేకుండా ఉన్నది. ఒక్క సీటు కోసం ఇంతగా ఓటర్లను ప్రలోభాలకు గురి చెయ్యాలా? వాళ్లను తమ వలెనే అవినీతిపరులుగా మార్చేలా అన్పిస్తది. అసలు ఆ ఎమ్మెల్యే గారు ఎందుకు రాజీనామా చేసిండో ఎవరికి తెలియదు. ఆ నియోజకవర్గం ఓటర్లు ఎన్నుకున్నారు. అధికారంలో ఇంకో పార్టీ ఉన్నది. ఈయన ఎందుకు రాజీనామా చేసిండు. నిజంగా ఎందుకు చేసిండో అందరికీ తెలుసు. కానీ, మల్లో పార్టీల చేరుడు, తనకు ఇది వరకు గెలిపించిన ఓటర్లే ఎందుకు రాజీనామా చేసిండో తెలుసుకోకుండా మల్లా ఓట్లువెయ్యాలె. అప్పటి ఓటర్లు వేరు ఇప్పటి ఓటర్లు అనేందుకు లేరు. ఎందుకంటే ఊర్లల్ల ఓటర్లను ప్రభావితం చేసుడే ప్రధానం. ఈ పార్టీ ఆ పార్టీ అంటు ఏమి ఉంటది స్థానిక నాయకులతో అవసరాలు పనులు పైరవీలు అక్కరలు ఎరలు గట్టెక్కిస్తే వాల్లకే అన్నట్లు తయారైంది.
Also read: అంతరంగం:కెమెరా కళ్ల కోసమే పెళ్లి
పుక్కటికి వత్తాందని
ఉచితం అనే పదానికి అందరు బోల్తా కొట్టుడే. ఉచితం అంటే ఊర్లల్ల పుక్కడికి అంటరు. అన్నం ఎన్నడూ తిననట్టు, పార్టీల వాళ్లు మీటింగ్ పెట్టి భోజనం పెడితే అట్టల మీద తినే దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ఈ రోజులల్ల అన్నం లేక ఎవరూ లేరు. తినలేక ఎవరూ లేరు. అయినా, మీటింగ్ పెట్టి అన్నం అంటే ఎగబడే తత్వం తయారైంది. సరిగ్గా ఇలాంటి మనస్తత్వం గల మనుషుల గుంపు రాజకీయ నాయకులకు కావాలి. అందుకే ఎలక్షన్ల నిలబడ్డ అభ్యర్థులు మీకు ఇది ఇస్తం, అది ఇస్తం, మాఫీ చేస్తం, అని పుక్యానికి పథకాలను ఊదరగొడతరు. దానికి ఓటర్లు బలి అవుతరు.
అసలు ఎవరు ఎవరికి ఉచితంగా ఇవ్వరు. పెట్టరు. ప్రభుత్వాలు సంక్షేమ పథకం ద్వారా ఉచితాలు ఇస్తున్నదంటే, అదంతా మనది మనకి ఇస్తున్నట్టే. అట్లనే ఓట్ల కోసం ఇచ్చే తాయిలాలు అని అర్థం చేసికోవాలి. ఇగ ముందు గురించి చెప్పనలవి కాదు. సీసాలకు సీసాలు సరఫరా అవుతున్నయి. తాగి తాగి ఓటర్ల లివర్ చెడిపోతున్న సోయి కూడా లేకుండా పోయింది. ఎన్నికల తెల్లారి అన్ని ఊర్లల్ల పరిస్థితి ఎట్లా ఉంటదో ఊహించుకోవచ్చు.
అంతా ఓట్ల కోసమే
ఎన్నికలు జరుగుతున్నయంటే, ఆయా రాజకీయ పార్టీలు ప్రజలకు చేస్తున్న వాగ్దానాలు, భవిష్యత్తులో చేయబోయే పనులు, గతంలో చేసిన పనులు ప్రచారం చేయాలి. కానీ, ఎన్ని ప్రలోభాలు, కులాలవారీగా మతాల వారీగా ఓటర్లను విడదీసి గంపగుత్తగా ఓట్లు దొబ్బుకపోయి గద్దె మీద కూర్చునే పెద్దలదే ప్రజాస్వామ్యం అయింది. ఇక అమ్ముడుపోవడం అనే మాటనే అసహ్యంగా ఉన్నది. సంతలో కోళ్లు, ఆవులు, పశువులు అవసరాలకు అమ్ముకుంటారు. కానీ, గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు కూడా అమ్మకం సరుకు అవడం చాలా అసహ్యం.
మనిషి అడ్డా మీద కూలిగా అమ్ముడు పోవడం వేరు. ప్రతినిధి కూడా బ్యారానికి గురికావడం వేరు. ఎన్నికలను చూస్తే కొత్తగా ఎదుగుతున్న విద్యార్థి తరానికి ఏ సంకేతాలు ఇస్తున్నం మనం. వాళ్లు ఎన్నికలు, ప్రజాప్రతినిధుల గురించి పుస్తకాలలో చదువుకున్నదేమిటి? ఈడ జరుగుతున్నదేమిటి? అయినా ఆ తరం ఇప్పుడు దినపత్రికలను చదవడం, వార్తా చానల్స్ చూడటం పూర్తిగా లేకుండా అయిపోయింది. ఎన్నికల వ్యవస్థను రాజకీయాలను చూస్తే జాలి కలుగుతుంది.
అన్నవరం దేవేందర్
94407 63479