అక్కడి గాలిలోని సుగంధ ద్రవ్యాల మొక్కల పరిమళం మనసుకు హాయి చేస్తది. తేయాకు తోటల నుంచి నడిచి వెళుతుంటే పచ్చి పచ్చి చాయ వాసన వ్యాపిస్తుంది. మిరియాలు, యాలకులు, సాజీర, దాల్చిన చెక్క, లవంగాల చెట్ల గాలి సోకి ఛాతీ ఉబ్బిపోతుంది. మున్నార్‌లో ఎక్కడ తిరిగినా మనసు తేలికగా మారి గాలిలో నడుస్తున్న అనుభూతి కల్గుతుంది. ఇదంతా కేరళ యాత్రానుభవం. కేరళ అంటే నారికేళ వృక్షాల నేల. బాగం వక్కల చెట్లు రెండు తాడి చెట్ల ఎత్తు నిటారుగా నిలబడతాయి. రబ్బరు చెట్లు, యూకలిప్టస్ చెట్లు కంటికి ఇంపుగా కన్పిస్తాయి.
మున్నార్ అందమైన కొండ ప్రాంతం. పచ్చని పర్వత సానువులు. ఎటు చూసినా కాఫీ తోటలు, తేయాకు తోటలు, పచ్చదనం నిండిపోతది. జలపాతాలకైతే లెక్కేలేదు. ఎక్కడినుంచో పారుతున్న నది తెల్లని పాల నురగ పైనుంచి కుమ్మరిస్తున్నట్టు కన్పిస్తుంది. ఇడుక్కయి జిల్లాలోని ఈ మున్నార్ ప్రాంతంలో పడమటి కనుమలు వ్యాపించి ఉన్నాయి. పక్కనే అరేబియా సముద్రం 14వ శతాతబ్దంలోనే వాస్కోడిగామా సుగంధ ద్రవ్యాలకు మసాలాలకు నిలయమని కనుగొన్న ప్రాంతం ఇది. తర్వాత పోర్చ్‌గీస్, డచ్‌వారు వ్యాపార నెపంతో కేరళ తీరానికి చేరారు. ప్రపంచంలో ఎక్కడా దొరకని మసాల దినుసులు ఇక్కడి నుంచే ఎగుమతి చేసేవారు.
విసిరేసినట్లుగా ఇండ్లు
మున్నార్ గానీ, అలెప్పీ గానీ ఎక్కడ తిరిగినా వందల కిలోమీటర్లు. ఇండ్లు అక్కడక్కడా కన్పిస్తుంటాయి. అక్కడి గృహాల నిర్మాణం కూడా మామూలుగా ఉండదు. సౌందర్యవంతంగా ఉంటుంది. ప్రతి ఇంటి మీద రూఫ్ అందంగా నిర్మిస్తారు. ఇండ్ల మధ్య చెట్లు పెంచినట్టు కాదు, చెట్ల మధ్య మనుషులు ఇండ్లు కట్టుకున్నట్టు ఉంటాయి. ఇంటి ఆవరణ అంతా మొక్కలే. అసలే ఆ ఊరంతా చెట్లు చేమలు పచ్చదనమే ఉండగా, ఇంటి వాకిటా వందల మొక్కల కుండీలు కనిపిస్తాయి. ఇండ్లు కూడా దూరం దూరం ఉంటాయి. ఆ మధ్యలో మొక్కలు ఉంటాయి. వాకిళ్లు కనిపించవు.
మనకు సిమెంట్ కాంక్రీట్ వాకిళ్లు అయినవి కానీ, వాళ్లకు సన్న సన్న కంకర నింపిన ఆవరణ కన్పిస్తది. ఎందుకంటే వర్షం నీరు ఇంకేందుకని. మున్నార్‌లో తేయాకు తోటలన్నీ టాటా, లిప్టన్, రిప్పన్ ఇతర కంపెనీలవే. అక్కడి భూమి పుత్రులైన ఆదివాసీలు ఎవరూ కన్పించరు. తేయాకు ఎస్టేట్‌లలో పనిచేసేవారంతా బిహార్, అస్సాం వచ్చినవారే. ఆయుర్వేద మూలికల చెట్లు, పనస చెట్లు అడుగడుగునా కన్పిస్తాయి. కొన్ని చోట్ల కోక్ చెట్లు ఉంటాయి. వాటి నుంచే బ్లాక్ చాక్‌లెట్స్ తయారవుతాయి. ఆ కాయల గుజ్జు నుంచి జెల్లీ తయారవుతుంది. చాక్‌లెట్ ఫ్యాక్టరీని సందర్శించవచ్చు.
అలౌకిక ఆనందం
మున్నార్‌లోనే సుగంధ ద్రవ్యాల హెర్బల్ వైద్యానికి సంబంధించిన ప్రదర్శన, అమ్మకాలు ఉంటాయి. తేయాకు తయారు చేసే ఫ్యాక్టరీని చూడవచ్చు. పచ్చని తేయాకును తెంపుకొని బ్యాగులో వేసుకుంటే రెండు రోజులకు నల్లగా తయారైంది. ఆకును టీ ఎస్టేట్ కార్మికులు కట్ చేసి, నీడలో ఎండబెట్టి వివిధ ప్రక్రియల అనంతరం దేశమంతా పంపిణీ చేస్తారు. కాఫీ తోటలు కూడా కన్పిస్తాయి. ఎక్కడా నేల ఖాళీగా కన్పించదు. పచ్చని పర్వతాలు. ఆ పర్వతాల మీద నుంచే మనకు కన్పిస్తున్నట్టే తిరిగే మేఘాలు. అదొక అలౌకిక ఆనందం.
టూరిస్ట్‌లు బస చేసేందుకు రిసార్ట్‌లు, రూంలు ఉంటాయి. ఇవి కూడా పర్వాతాలలోనే అరణ్యంలోనే విశాలంగానే ఉంటాయి కేరళలో టూరిస్ట్‌లను గౌరవంగా చూస్తారు. తెల్లవారి లేవంగానే న్యూస్ పేపర్లు చదువుతూ కన్పిస్తారు. త్రిన్సూర్, తిరువనంతపురం, గురువాయూర్ నగరాలలోని పేపర్స్ స్టాల్స్‌లో చాలా పేపర్లు కన్పించాయి. మాతృభూమి అనే ప్రాచీన మలయాళ వార పత్రికను నేను బహుభాషావేత్త నలిమెల భాస్కర్ గురించి తెచ్చాను. పఠనం పట్ల మలయాళీలకు ఆసక్తి ఇంకా కన్పించింది.
బట్టల బ్యానర్‌లే
మన దగ్గర ఉన్నంత ఫ్లెక్సీల కల్చర్ అక్కడ లేదు. హోర్డింగ్‌లు ఇబ్బడి ముబ్బడిగా లేవు. చాలా వరకు బట్టలతో చేసిన బ్యానర్‌లు కన్పిస్తున్నాయి. విజయవాడలో అక్టోబర్ 24న జరిగే సీపీఐ జాతీయ సదస్సు ప్రచార పోస్టర్లు కనిపించాయి. ప్లాస్టిక్ వాడకం లేదు. ఎక్కడ చూసినా పేపర్ కప్పులు, పేపర్ బ్యాగులే. పర్యావరణం పట్ల అక్కడి ప్రజలకు చైతన్యం కన్పించింది. లిక్కర్ అమ్మకాలు ఎట్లా ఉన్నాయో గానీ, షాపులు అంతగా కనబడలేదు. హోటళ్లు, రిసార్ట్‌లలో పని చేసేవాళ్లంతా స్థానికేతరులే. ట్యాక్సీ, కారు, ఆటో డ్రైవర్లు మాత్రం స్థానికులు. చక్కని ఇంగ్లిష్, హిందీ మాట్లాడతారు. మోసం చేయడం కనపడదు. మేం హైదరాబాద్ నుంచి ప్రదీప్ నేతృత్వంలో 50-60 యేండ్లకు అటూ ఇటున్న జంటలం రైలులో బయలుదేరాం. త్రిసూర్‌లో దిగి ముందే మాట్లాడుకున్న ఏసీ బస్సు ఎక్కి వాయనాడు, మున్నూర్, అలెప్పీ గురువాయూరు, తిరువనంతపురం సందర్శించాం.
దారి పొడవునా
వెంబనాడ్ సరస్సు చాలా పెద్దది. దాదాపు 3000 వరకు బోట్స్ ఉంటాయి. యాత్రికులు అందులో రోజంతా ప్రయాణిస్తారు. బోట్‌లో గదులు హోటల్ రూంలో వలనే ఉంటాయి. అందులోంచే తెచ్చిన చేపలను వండి పెడతారు. అదొక అహ్లాదకర సముద్రయాన అనుభవం. అక్కడినుంచే నగరంలోకి జల రవాణా కూడా ఉంది. జలపాతాలు ఉన్నాయి. అందులో పడిపోకుండా నిలువరించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది. ఆహార పదార్థాలు కొబ్బరినూనెతో తయారు చేస్తారు. బాగానే ఉంటాయి. ఉప్పుడు బియ్యం వాడుతారు. చేపలు బాగా దొరుకుతాయి. వేడి నీళ్లు తాగుతారు. ఆ నీళ్లను దాహసమిని అనే ఆయుర్వేద చెట్ల వేర్లతో కలిపి మరిగిస్తారు. రోగ నిరోధక శక్తి పెంచడానికి, జీర్ణవ్యవస్థ బాగుండడానికిని పనిచేస్తాయట. కేరళ అందాలు చూస్తే అక్కడే ఉండాలనిపిస్తది. అక్షరాస్యత ఎక్కువ. ఇంగ్లిష్ మీడియం బడులు. ముస్లిం, క్రైస్తవ పాపులేషన్ కూడా ఎక్కువగానే ఉంది. ముస్లింలు ఇండ్లలో మలయాళం మాట్లాడతారు.
Also Read : నేడు రేపు అలర్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
అన్నవరం దేవేందర్
94407 63479